సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్ కలకలంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో నగరంలోని బల్క్‌డ్రగ్, ఫార్మా రంగంలోని పరిశ్రమలకు ప్రభుత్వం నిత్యం 24 గంటలపాటు ఉత్పత్తుల తయారీకి అనుమతించింది. ఇదే సమయంలో కొన్ని పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. గాలి, నీరు, నేల కాలుష్యానికి కారణమవుతున్న ఉద్గారాలను వదిలిపెడుతున్నాయి. పర్యావరణ హననానికి పాల్పడుతున్నాయి.
ఈ విషయంలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ కాలుష్య పరిశ్రమలను కట్టడి చేసే విషయంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీపీ) ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. ఇటీవల జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, పటాన్‌చెరు, పాశమైలారం తదితర ప్రాంతాల్లో ఆయా పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యంపై పీసీబీకి వందకుపైగా ఫిర్యాదులు అందినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆయా పరిశ్రమలను తనిఖీ చేసే విషయంలో పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కారణాలివే
►ఆయా బల్క్‌డ్రగ్, ఫార్మా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకర ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టీపుల్ ఎఫెక్టివ్ ఎవాపరేటర్లు (ఎంఈఈ), ఆర్‌ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం.
►గాఢత అధికంగా ఉన్న వ్యర్థ జలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు. ఆయా పరిశ్రమల్లో వెలువడే ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి.
►ఘన, ద్రవ వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్రమార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ప్రధానంగా మల్లాపూర్, ఉప్పల్, కాటేదాన్, కుత్భుల్లాపూర్, జీడిమెట్ల, దుండిగల్, పటాన్‌చెరు, పాశమైలారం, బొంతపల్లి తదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు.
►ఆయా ప్రాంతాల్లో గతంలో నీటి నమూనాల్ని పీసీబీ ప్రయోగశాలలో ప్రయోగించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భారలోహలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది. గతంలో ఎన్‌జీఆర్ జరిపిన సర్వేలోనూ బాలానగర్ పరిసర ప్రాంతాల్లోని మట్టిలో ప్రమాదకర భారలోహాలు ఉన్నట్లుగా వెల్లడైంది.
కాగితాల్లోనే తరలింపు..
►మహానగరానికి ఆనుకొని భయంకరమైన కాలుష్యం వెదజల్లుతున్న రెడ్, ఆరెంజ్ విభాగానికి చెందిన 1,160 పరిశ్రమలను సిటీకి దూరంగా తరలించే విషయంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) మీనమేషాలు లెక్కిస్తోంది. దీంతో కాలుష్య మేఘాలు మహానగరాన్ని కమ్మేస్తున్నాయి..సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
►గ్రేటర్ పరిధిలో ప్రధానంగా కాటేదాన్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్, భోలక్‌పూర్ తదితర ప్రాంతాల్లో బల్క్‌డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, ఆయిల్, లెడ్, బ్యాటరీ, ట్యానింగ్, బ్లీచింగ్ అండ్ డైయింగ్, పొగాకు, పెయింట్స్, వార్నిష్, మీట్ ప్రాసెసింగ్, పెస్టిసైడ్స్, క్రాఫ్ట్ పేపర్ పరిశ్రమలున్నాయి.
వీటి కారణంగా మహానగరం పరిధిలోని 185 చెరువుల్లో ఇప్పటికే సుమారు 100 కాలుష్య కాసారాలుగా మారాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థ జలాలను ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో శుద్ధి చేయకుండానే బహిరంగ నాలాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదులుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్య కాసారాలుగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment