నగరమా.. నువ్వూ అంతే! | Danger Pollution Industries in Hyderabad | Sakshi
Sakshi News home page

నగరమా.. నువ్వూ అంతే!

Published Sat, May 9 2020 9:52 AM | Last Updated on Sat, May 9 2020 9:52 AM

Danger Pollution Industries in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో కాలుష్య కారక పరిశ్రమలు వదులుతోన్న ఘన, ద్రవ, వాయువులతో మహానగర పర్యావరణం పొగచూరుతోంది. వాతావరణ కాలుష్యానికి, మానవ ఆరోగ్యానికి పొగబెడుతోన్న పారిశ్రామిక కాలుష్యం కట్టడిలో పీసీబీ, పరిశ్రమల శాఖలు దారుణంగా విఫలమవుతున్నాయి. వైజాగ్‌లోని ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థ నుంచి విషవాయువు వెలువడిన ఘోర దుర్ఘటన నేపథ్యంలో నగరంలో కాలుష్యానికి కారణమౌతున్న పరిశ్రమల ఆగడాలపై అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. కాలుష్య కారక పరిశ్రమలను దశలవారీగా నగరానికి దూరంగా తరలించే విషయంలో సర్కారు విభాగాలు గత నాలుగేళ్లుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఏడాది క్రితం అత్యంత కాలుష్యం వెదజల్లుతోన్న రెడ్, ఆరెంజ్‌ విభాగానికి చెందిన 1160 పరిశ్రమలను సిటీకి దూరంగా తరలించే విషయంలో తెలంగాణా పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) మీనమేషాలు లెక్కిస్తుండడంతో..కాలుష్య మేఘాలు మహానగరాన్ని కమ్మేస్తున్నాయి..సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

గ్రేటర్‌ పరిధిలో ప్రధానంగా కాటేదాన్, జీడిమెట్ల, కుత్భుల్లాపూర్, మల్లాపూర్, బాలానగర్,భోలక్‌పూర్, పాశమైలారం, ఖాజిపల్లి, బొంతపల్లి, ఐడీఏ బొల్లారం, పటాన్‌చెరు, మల్లాపూర్‌ తదితర ప్రాంతాల్లో  బల్క్‌డ్రగ్, ఫార్మా, ప్లాస్టిక్, ఆయిల్, లెడ్, బ్యాటరీ, ట్యానింగ్, బ్లీచింగ్‌ అండ్‌ డైయింగ్, పొగాకు, పెయింట్స్, వార్నిష్, మీట్‌ ప్రాసెసింగ్, పెస్టిసైడ్స్, క్రాఫ్ట్‌ పేపర్‌ తదితర పరిశ్రమలున్నాయి.  
వీటి కారణంగా మహానగరం పరిధిలోని 185 చెరువుల్లో ఇప్పటికే సుమారు 100 కాలుష్యకాసారంగా మారాయి. ఆయా పారిశ్రామిక వాడల నుంచి వ్యర్థజలాలను ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లలో శుద్ధి చేయకుండానే బహిరంగ నాలాలు, కాల్వలు, చెరువులు, కుంటల్లోకి వదులుతుండడంతో ఆయా జలవనరులు కాలుష్యకాసారంగా మారాయి. కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత నగరానికి ఆనుకొని ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్‌రింగ్‌ రోడ్డుకు ఆవల 30 కి.మీ దూరం తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పెరుగుతోన్న కాలుష్యం ఇలా..
వాయుకాలుష్యం: నగరానికి ఆనుకొని ఐదు వేలకు పైగా పరిశ్రమలుండగా..వీటిలో ప్రమాదకర వాయువులు వదులుతోన్న కంపెనీలు వెయ్యికి పైగానే ఉన్నాయి. ఈ పరిశ్రమలు వెదజల్లుతోన్న వాయుకాలుష్యంలో ఓలటైల్‌ ఆర్గానిక్‌ కాంపౌండ్స్,బెంజీన్, టోలిన్, నైట్రోజన్,కార్భన్‌ మోనాక్సైడ్‌ వంటి విషవాయువులుండడంతో సిటీజన్లకు స్వచ్ఛమైన ప్రాణవాయువు దూరమౌతోంది.

జలాశయాల కాలుష్యం: నగరంలో సుమారు 185  చెరువులుండగా..ఇందులో 100 చెరువులు ఆర్గానిక్‌ కాలుష్యం కాటుకు బలవుతున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి నిత్యం వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలు ఆయా జలాశయాల్లో చేరి పర్యావరణం హననం అవుతోంది. ఆయా జలాశయాల నీరు కాలుష్య కాసారమౌతోంది.

నేల కాలుష్యం: బల్క్‌డ్రగ్, ఫార్మా, ఇంటర్మీడియెట్, తోలు, లెడ్, బ్యాటరీ కంపెనీల నుంచి వెలువడుతోన్న ఘన, ద్రవ కాలుష్య ఉద్గారాలను బహిరంగ ప్రదేశాల్లో పడవేస్తుండడంతో ఆయా ఉద్గారాల్లోని భారలోహాలు, మూలకాలు వర్షం పడినపుడు నేలలోపలికి ఇంకుతున్నాయి. దీంతో భూగర్భజలాలు సైతం కాలుష్యకాసారంగా మారుతున్నాయి. ప్రధానంగా వ్యర్థ జలాల్లో మెర్క్యురీ, లెడ్, క్రోమియం, ఆర్సినిక్, నికెల్, మాంగనీస్, కాపర్, కోబాల్ట్‌ వంటి మూలకాలుండడంతో నేల కాలుష్యం సంభవిస్తోంది.

కాలుష్య పరిశ్రమల ఆగడాలివే..
ఆయా పరిశ్రమల్లో ఉత్పత్తులను తయారు చేసే క్రమంలో ప్రమాదకరమైన వాయు, ఘన, ద్రవ, రసాయన వ్యర్థాలు వెలువడుతున్నాయి. రాత్రి వేళల్లో పలు కాలుష్య పరిశ్రమలు విషవాయువులను బయటకు వదులుతున్నాయి.
ఇందులో తక్కువ గాఢత కలిగిన జల వ్యర్థాలను మల్టిబుల్‌ ఎఫెక్టివ్‌ ఎవాపరేటర్లు(ఎంఈఈ), ఆర్‌ఓలతో శుద్ధి చేసి బయటకు వదలాలి. కానీ పలు పరిశ్రమల్లో ఇలాంటి ఏర్పాట్లు మృగ్యం.
గాఢత అధికంగా ఉన్న వ్యర్థజలాలను జీడిమెట్ల, పటాన్‌చెరులోని శుద్ధి కేంద్రాలకు తరలించాలని నిబంధనలు స్పష్టంచేస్తున్నా..పలు పరిశ్రమలకు ఈ ఊసే పట్టడంలేదు.
ఆయా పరిశ్రమల్లో వెలువడే  ఘన వ్యర్థాలను దుండిగల్‌లోని డంపింగ్‌ యార్డుకు తరలించాల్సిన విషయాన్ని పలు పరిశ్రమల యాజమాన్యాలు గాలికొదిలేశాయి.  
ఘన, ద్రవ వ్యర్థాలను శుద్ధికేంద్రాలకు తరలించేందుకు భారీగా వ్యయం చేయాల్సి రావడంతో అక్ర మార్కులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు.
ప్రధానంగా  మల్లాపూర్,ఉప్పల్,కాటేదాన్,కుత్భుల్లాపూర్,జీడిమెట్ల, దుండిగల్, పటాన్‌చెరు, పాశమైలారం, బొంతపల్లితదితర ప్రాంతాల్లోని కొన్ని పరిశ్రమల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకర వ్యర్థాలను నాలాల్లోకి వదిలేస్తున్నారు.  
మరికొందరు అక్రమార్కులు పరిశ్రమల నుంచి వ్యర్థాలను సేకరించి డ్రముల్లో నింపి శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, అటవీ ప్రాంతాలు, చెరువులు, కుంటల్లో డంప్‌ చేస్తున్నారు. ఒక్కో డ్రమ్ముకు రూ.100 నుంచి రూ.200 వరకు దండుకుంటున్నారు.
ఇంకొందరు పరిశ్రమల ప్రాంగణంలోనే గోతులు తీసి వ్యర్థాలను పారబోస్తున్నారు. అక్రమ వ్యవహారం బయటికి కనిపించకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరూ అటు వైపు రాకుండా 24 గంటల పాటు భద్రతా సిబ్బందిని సైతం ఏర్పాటు చేసుకుంటుండటం గమనార్హం.
వ్యర్థాల డంపింగ్‌తో  కుత్భుల్లాపూర్,జీడిమెట్ల, బొల్లారం తదితర పారిశ్రామివాడలు, వాటి పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పూర్తిగా కలుషితమయ్యాయి.  
ఆయా ప్రాంతాల్లో గతంలో నీటి నమూనాల్ని పీసీబీ ప్రయోగశాలలో ప్రయోగించినప్పుడు ప్రమాదకరమైన ఆర్సెనిక్, నికెల్, కాడ్మియం తదితర ప్రమాదకర రసాయన, భారలోహలు మోతాదుకు మించి భారీ స్థాయిలో ఉన్నట్లుగా తేలింది.  
గతంలో ఎన్‌జీఆర్‌ జరిపిన సర్వేలోనూ బాలానగర్‌ పరిసర ప్రాంతాల్లోని మట్టిలో ప్రమాదకర భారలోహాలు ఉన్నట్లుగా వెల్లడైంది.  
పరిశ్రమల కాలుష్యానికి కళ్లెంవేయాలిలా..  
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విషవాయువులను బయటకు వదిలినా.. వ్యర్థాలను ఆరుబయట,నాలాలు, చెరువులు, కుంటలు, వాగుల్లో పారబోసేందు ప్రయత్నిస్తే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదుచేయాలి. సంబంధిత పరిశ్రమలను మూసివేసేందుకు ఆదేశాలివ్వాలి.   
నూతనంగా పరిశ్రమలు ఏర్పాటుచేసే పారిశ్రామిక వాడల్లో ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు నిర్మించేలా చర్యలు తీసుకోవాలి. వీటిని ఏర్పాటుచేయని కంపెనీలకు అనుమతులివ్వరాదు.
పీసీబీ, టీఎస్‌ఐఐసీ, రెవెన్యూ, పోలీస్‌ తదితర శాఖలకు చెందిన అధికారులతో కలిసి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి కాలుష్య ఉద్గారాలను కట్టడిచేయాలి.
ఆయా బృందాలు 24 గంటలపాటు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉల్లంఘనుల ఆట కట్టించాలి.
నాలాలు, చెరువులు, మూసీ పరివాహక ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి వాటిని పీసీబీ, జీహెచ్‌ఎంసీ, పోలీసు కమిషనర్ల కార్యాలయంలోని టీవీలకు అనుసంధానించాలి.

సిటీజన్ల ఆరోగ్యానికి సెగ..
గ్రేటర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం సిటిజన్లలో గుండె, ఊపిరితిత్తులకు, పొగ పెడుతోంది. శ్వాసకోశ, జీర్ణకోశవ్యాధులతోపాటు కళ్లు, చర్మసంబంధ సమస్యలకు పరిశ్రమల కాలుష్యం కారణమౌతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement