సిద్దిపేట జోన్: పరిశ్రమల కాలుష్యంపై సర్కార్ నిఘా పెంచింది. కాలుష్యంతో జనజీవనం అతలాకుతలం అవుతున్న వైనంపై దృష్టి సారించిన ప్రభుత్వం పరిసరాల పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వీర్యంపై స్థానిక మున్సిపాలిటీలు అనుసరిస్తున్న విధానాన్ని సునిశితంగా పరిశీలిస్తోంది. అందులో భాగంగానే కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఇటీవల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలతో పాటు గజ్వేల్-ప్రజ్ఞాపూర్, దుబ్బాక నగర పంచాయతీలకు నోటీసులను జారీ చేసింది.
రాజధానికి సమీపంలో ఉన్న జిల్లాలో కాలుష్య నియంత్రణ చర్యలపై పీసీబీ గట్టి చర్యలకు పూనుకుంది. అందులో భాగంగానే జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కాలుష్య నివారణ చర్యల గురించి వివరాలను వెల్లడించడమే కాకుండా వారం రోజుల్లో బోర్డు ఎదుట హాజరు కావాలంటూ ఆయా మున్సిపాలిటీ, నగర పంచాయతీల కమిషనర్‌లకు ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేసింది.
పట్టణంలోని మురికినీటి వల్ల ఉత్పన్నమయ్యే కాలుష్య నియంత్రణ చర్యలు, పట్టణ ప్రజల నుంచి సేకరించిన వ్యర్థ పదార్థాల సమగ్ర వివరాలు, కబేళా నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల నియంత్రణ ప్రక్రియ, మురికి నీటి ప్రవాహ స్థితి గతులు, ప్లాస్టిక్ మేనేజ్‌మెంట్ విధానం, ప్రాసెసింగ్ యూనిట్ అమలు లాంటి ప్రధాన ఐదు అంశాలపై మున్సిపల్ కమిషనర్‌లకు పీసీబీ నోటీసులను జారీ చేసింది. దీంతో వారం రోజులు క్రితమే జిల్లా అధికారులు పీసీబీ బోర్డ్ హాజరైనట్లు సమాచారం. ఈ సందర్భంలోనే సిద్దిపేట మున్సిపాలిటీ అధికారులు ఆరు నెలల క్రితమే సిద్దిపేటను క్లీన్ అండ్ గ్రీన్ చేయాలన్న నినాదంతో చేపట్టిన వినూత్న కార్యక్రమాలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది.
తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్తరూపంలో రీసైక్లింగ్ చేసి కంపోస్ట్ ప్రక్రియకు వినియోగిస్తున్న తీరును వివరించగా, పీసీబీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇవే అంశాలను జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లో అమలు చేస్తున్నారా లేదా అనే అంశంపై వివరాలు సేకరించినట్లు తెలిసింది. కాలుష్య నియంత్రణ చర్యలను విస్మరించిన మున్సిపాలిటీలకు కొద్దిరోజులు గడువిచ్చిన అధికారులు ఆ తర్వాత మెమోలు జారీ చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం.
‘కాలుష్యం’పై కొరడా
Published Wed, Dec 24 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement
Advertisement