
ఏసీబీకి చిక్కిన ‘కాలుష్య’ అధికారి
అయిదు జిల్లాల్లో పది చోట్ల సోదాలు
రూ.35 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సీనియర్ ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరు కోరుకొండ రమేష్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గురువారం ఏసీబీకి పట్టుబడ్డారు. అవినీతి సంపాదనలతో ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో ఏసీబీ ఉన్నతాధికారులు ఉదయమే ఆయన ఇంటిపై దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు మొత్తం పది బృందాలుగా ఏర్పడి శ్రీకాకుళం, విజయనగరం, ఖమ్మం, నెల్లూరు జిల్లాల్లోని రమేశ్ బంధువుల ఇళ్లపైనా పదిచోట్ల తనిఖీలు చేశారు. ఉదయం విశాఖ శ్రీనగర్‌లోని రమేశ్ ఇంట్లో తనిఖీలు చేపట్టిన అధికారులు రమేష్ ఆస్తులు చూసి నివ్వెరపోయారు.
1998లో అసిస్టెంట్ ఇంజినీరుగా విధుల్లో చేరిన ఆయన విశాఖలో మూడు ఖరీదైన ఫ్లాట్‌లు, శ్రీకాకుళం-పొందూరు మధ్య పదెకరాల భూమి, పది ఇళ్ల స్థలాలు సంపాదించినట్లు ప్రాథమికంగా తేల్చారు. ఇంకా రూ.10 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.10 లక్షల ఎల్‌ఐసీ పాలసీలు గుర్తించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న ఆయన భార్య శశికళ నివాసంలో సోదాలు చేసి, ఆమె పేరిట మూడు లాకర్లు ఉన్నట్లు తేల్చారు. పాల్వంచలోని రమేశ్ లక్ష్మీపతిరావు ఇంట్లోనూ తనిఖీ చేసి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన రమేష్ ఏడాదిన్నరగా విశాఖ రీజియన్ కాలుష్య నియంత్రణ మండలి విభాగం ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. అధికారాలను దుర్వినియోగం చేసి రమేశ్ భారీగా ఆస్తులు కూడగట్టారని ఏసీబీ డీఎస్పీ నరసింహారావు వెల్లడించారు. మార్కెట్ విలువ ప్రకారం అక్రమ సంపాదన రూ.35 కోట్లు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.