హామీలతో ఆమోద ముద్ర | public opinion on narla tata rao thermal power station | Sakshi
Sakshi News home page

హామీలతో ఆమోద ముద్ర

Published Sat, Jan 11 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

public opinion on narla tata rao thermal power station

సాక్షి, విజయవాడ, ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : స్థానికుల తీవ్ర నిరసనను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్టీటీపీఎస్ తన పంతం నెగ్గించుకొంది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో నూతనంగా నిర్మించబోయే 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రంపై శుక్రవారం భారీ పోలీసు బలగాల మధ్య కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయసేకరణ జరిపి ఆమోదముద్ర వేయించుకోగలిగారు.

 ఇబ్రహీంపట్నంలోని థర్మల్ కేంద్రం గ్రౌండ్‌లో ఉదయం 11.30కి ప్రజాభిప్రాయ సదస్సు ప్రారంభమైంది. ఎన్టీటీపీఎస్ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల బాధపడుతున్న 10 గ్రామాల ప్రజలు ‘రాజకీయ పార్టీల ఐక్యకార్యాచరణ వేదిక’గా ఏర్పడి ప్రజాభిప్రాయసేకరణలో తీవ్ర నిరసన తెలిపారు. వేదిక ముందే బైఠాయించి ఎన్టీటీపీఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీటీపీఎస్ డౌన్‌డౌన్, మాకొద్దు ఈ ప్రాజెక్టు.. అంటూ నినాదాలు చేశారు.  ఎన్టీటీపీఎస్‌లో మరో కొత్త ప్లాంట్ ఏర్పాటుచేసి తమ జీవితాలను బుగ్గి చేయొద్దని మహిళలు డిమాండ్ చేశారు.

 ఒక దశలో స్థానికులతో అధికారులు మినిట్స్ పుస్తకాల్లో  సంతకాలు పెట్టించి సమావేశాన్ని మొక్కుబడిగా ముగించేందుకు చేసిన యత్నాలను ప్రజలు తిప్పికొట్టారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే సభ రసాభాసగా మారింది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. సభాస్థలి వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని స్థానికుల్ని శాంతింపజేశారు. ఒకదశలో పరిస్థితి చేయి దాటిపోతోందని భావించిన ఏపీ జెన్‌కో అధికారులు ప్రజల డిమాండ్లను అంగీకరిస్తూ లిఖితపూర్వక హామీ ఇచ్చేందుకు సిద్ధం కావడంతో సభ ప్రశాంతంగా ముగిసింది.

 సమావేశంలో ఏపీ జెన్‌కో మేనేజింగ్ డెరైక్టర్ విజయానంద్, జెన్‌కో డెరైక్టర్ సి.రాధాకష్ణ, వాతావరణ కాలుష్య నియంత్రణ  మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీఎల్ శాస్త్రి,  కలెక్టర్ రఘునందన్‌రావు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.ఎల్.చెన్నకేశవరావు, సబ్ కలెక్టర్ హరిచందన, ఎన్టీటీపీఎస్ సీఈ సమ్మయ్య, ఎంపీడీవో లక్ష్మీకుమారి, తహశీల్దారు ఎం.మాధురి, వ్యవసాయ అధికారి లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.

 భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు : జోగి
 ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించిన తర్వాతే ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలంటూ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ సదస్సులో పట్టుబట్టారు. లక్షా 50వేల మంది ప్రజలున్న ఇబ్రహీంపట్నం మండలంలో కేవలం 120 మంచినీటి కుళాయిలు వేశామని చెప్పడానికి అధికారులు సిగ్గుపడాలంటూ ఆయన ధ్వజమెత్తారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, తమతోను, తమ పిల్లల భవిష్యత్తుతోనూ ఆటలాడుకోవద్దని ఆయన సూచించారు. 20 అంశాలపై అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మేడపాటి నాగిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ అంక మోహనరావు, కాంగ్రెస్ నాయకులు అక్కల గాంధీ, ఆవుల సీతారామయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్,  బీజేపీ నేత రేగళ్ల రఘునాథ్‌రెడ్డి, సీపీఐ నాయకుడు పి.తాతయ్య, ఇబ్రహీంపట్నం ప్రముఖులు మల్లెల పద్మనాభరావు, సర్పంచి అజ్మీర స్వర్ణ, కొండపల్లి సర్పంచి అమ్మాజీ, ఈలప్రోలు సర్పంచి మిరియాల చినరామయ్య, జూపూడి  సర్పంచి నల్లమోతు దుర్గారావు, జి.ప్రసాద్, ఎ.విఠల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement