బీపీఎల్‌కు షాక్! | shock to bpl! | Sakshi
Sakshi News home page

బీపీఎల్‌కు షాక్!

Published Mon, Jul 7 2014 1:51 AM | Last Updated on Sat, Sep 1 2018 5:05 PM

బీపీఎల్‌కు షాక్! - Sakshi

బీపీఎల్‌కు షాక్!

ప్రతిపాదిత బీపీఎల్ విద్యుత్ కేంద్రం స్థలం కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు తీర్పునివ్వడం బీపీఎల్ యాజమాన్యానికి షాక్ కలిగించింది.

- భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు తీర్పు
- ముగిసిన పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు(పీసీబీ) గడువు
- జెన్‌కోకు అప్పగించేందుకే ప్రభుత్వం మొగ్గు

 రామగుండం : ప్రతిపాదిత బీపీఎల్ విద్యుత్ కేంద్రం స్థలం కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు తీర్పునివ్వడం బీపీఎల్ యాజమాన్యానికి షాక్ కలిగించింది. కేటాయించిన భూమిలో ప్రాజెక్టు కట్టకపోగా... ఎలాగైనా భూమి దక్కించుకోవాలని చూస్తున్న ఆ కంపెనీకి కోర్టు తీర్పు శరాఘాతంగా మారింది. కోర్టు తీర్పుతో ఈ భూములను జెన్‌కోకు అప్పగించి విద్యుత్ కేంద్రం నెలకొల్పేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.
 
రామగుండంలో బ్రిటీష్ పవర్ లి మిటెడ్(బీపీఎల్) కంపెనీకి విద్యుత్ కేం ద్ర స్థాపన కోసం ప్రభుత్వం 14 ఏళ్ల క్రి తం భూములు కేటాయించింది. తొలిదశలో 600 మెగావాట్ల కేంద్రం స్థాపనకు అప్పుడే భూములు స్వాధీనం చేసుకున్న కంపెనీ సాంకేతిక కారణాలతో నిర్దేశిత గడువులోగా పనులు ప్రారంభించలేదు. ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయంపైనా స్పష్టత ఇవ్వలేదు.

పనులు ప్రారంభిస్తారా? లేదా? అనే విషయమై వెంటనే స్పష్టత ఇవ్వాలని గత డిసెంబర్‌లో ప్రభుత్వం బీపీఎల్ కంపెనీకి లేఖరాయగా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. భూ కేటాయింపులు పూర్తయి పదేళ్లు దాటినా దానిని వినియోగించుకోకపోతే కేటాయింపులు రద్దయి భూములు ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతాయి.
 
ఇలా 1,280 ఎకరాల భూములు బీపీఎల్ నుంచి ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే భూమి అభివృద్ధి కోసం తాము పెట్టిన సొమ్ము రాబట్టుకునేందుకు సదరు భూములను ఎన్టీపీసీకి కట్టబెట్టేందుకు బీపీఎల్ కంపెనీ పావులు కదిపినట్లు సమాచారం. ఎన్టీపీసీ కూడా ఈ భూములపై దృష్టి సారించింది. సదరు భూములపై బీపీఎల్ కంపెనీ వెచ్చించిన వ్యయాన్ని చెల్లించి భూములను తీసుకుంటామనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి ఎన్టీపీసీ తీసుకెళ్లింది.

రెండు నెలల క్రితం ఎన్టీపీసీ సీఎండీ, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌లు ప్రత్యేక హెలికాప్టర్‌లో ఎన్టీపీసీని సందర్శించిన క్రమంలో బీపీఎల్ భూములపై ఏరియల్ సర్వే చేసి విలేకరుల సమావేశంలో సైతం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది గమనించిన తెలంగాణ విద్యుత్ జేఏసీ సదరు స్థలాన్ని జెన్‌కోకు అప్పగించి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరింది. ఆ దిశగా ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటోంది.

దీంతో ప్లాంట్ కేటాయింపులో ఇన్నాళ్లూ సాంకేతిక ఇబ్బందులు ఎదురైనందున ఇప్పుడు తమకు భూములు అప్పగిస్తే ప్లాంటు నెలకొల్పుతామని, భూములు అప్పగించేలా చూడాలని బీపీఎల్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందం పాటించనందున భూములు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతో కోర్టు... బీపీఎల్ భూములపై యథాతథ స్థితి కొనసాగించాలని తీర్పునిచ్చింది. దీంతో మళ్లీ భూములు తీసుకుందామనుకున్న బీపీఎల్ కంపెనీఆశలపై ఈ తీర్పు నీళ్లు చల్లినట్లయింది.
 
ముగిసిన పీసీబీ గడువు
 600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో విద్యుత్ కేంద్రం ఏర్పాటు కోసం బీపీఎల్ కంపెనీ 2009 జూన్ 30న పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు నుంచి అనుమతులు పొందింది. ఐదేళ్ల గడువుతో కాన్‌సెంట్ ఫర్ ఎస్టాబ్లిష్‌మెంట్(సీఎఫ్‌ఈ) జారీ చేయగా 2014 జూన్ 30కి గడువు ముగిసింది. దీంతో బీపీఎల్‌కు ప్లాంట్ నెలకొల్పేందుకు దాదాపు ఏ అవకాశం లేకుండా పోయింది.
 
జెన్‌కోకు భూమి?
 ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుని జెన్‌కోకు అప్పగించి విద్యుత్‌కేంద్రం ఏర్పాటు చేసే యోచన చేస్తోంది. తెలంగాణలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉండడంతో వనరులు పుష్కలంగా ఉన్న రామగుండంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తోంది. ఈమేరకు బీపీఎల్ భూములను జెన్‌కోకు అప్పగించాలని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు వారం రోజుల క్రితం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్న భూములను జెన్‌కోకు అప్పగించడం పెద్ద కష్టం కాబోదని అధికారులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement