ఐడియా మండితే.. పర్యావరణ పండగే!
సాక్షి, కర్నూలు : సాధారణంగా గుట్కా, ఒక్కపొడి.. వినియోగించే వారు వాటి ప్యాకెట్లను ఎక్కడో ఒకచోట పడేస్తుంటారు. అలాగే వాడేసిన షాంపూలు.. బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు తినేసి ప్లాస్టిక్ కవర్లను అలాగే వదిలేస్తుంటారు. ఇవేవీ పునర్వియోగానికి పనికిరావు. ఇది తెలిసే చెత్త కాగితాలు ఎరుకునే వారు సైతం ముట్టుకోరు. ఫలితంగా జిల్లాను ప్లాస్టిక్ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) అధికారులు ఓ ప్రణాళిక రూపొందించనున్నారు. పునర్వియోగానికి కూడా పనికిరాని ప్లాస్టిక్ చెత్తను సిమెంట్ పరిశ్రమలోని కొలిమిలో వినియోగించేందుకు చర్యలు తీసుకోబోతున్నారు.
భవిష్యత్తులో ఏం చేస్తారంటే..
కర్నూలు జిల్లాలో సుమారు 15 వరకు సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలోని కొలిమిలో వినియోగానికి బొగ్గుతో పాటు ఫార్మా పరిశ్రమల నుంచి చివరి దశలో వెలువడే ఘన వ్యర్థాలను కూడా ఉపయోగిస్తుంటారు. సాధారణంగా ప్లాస్టిక్ వ్యర్థాలను కాలిస్తే విష వాయువులు వెలువడుతాయి. అదే సిమెంట్ పరిశ్రమ కొలిమిలో 1,400 డిగ్రీల ఉష్టోగ్రత ఉంటుంది కాబట్టి ఆ సమస్య ఉత్పన్నం కాదు. ఇదే సమయంలో బొగ్గు కూడా ఆదా అవుతుంది. ఈ నేపథ్యంలో సిమెంట్ పరిశ్రమల యజమానులను ఒప్పించి పనికిరాని వ్యర్థాలను తరలించాలని పీసీబీ ఆలోచిస్తోంది. ఇందుకోసం త్వరలో ఆయా కంపెనీల యజమానులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లా నుంచి ప్రతిరోజూ సుమారు 2,500 మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుండగా.. కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్ తదితర మున్సిపాలిటీల్లోని డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ వేరుచేసి కొన్నింటిని సేంద్రియ ఎరువుల తయారీకి, మరికొన్నింటిని ఇతర పరిశ్రమల్లో వినియోగానికి ఇటుకలుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఎందుకూ పనికిరాని వాటిని భూమిలో నిక్షిప్తం చేస్తారు. వీటిలో చాలా వరకు వివిధ వస్తువుల తయారీకి వినియోగించే కవర్లే ఉంటున్నాయి.
మరోవైపు ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలు అధికంగా ఉన్న హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాలకు కొందరు వ్యాపారులు ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. పునర్వియోగానికి పనికొచ్చే ప్లాస్టిక్‌ను గ్రాన్యుల్స్(దాణా.. చిన్నపాటి ఉండలు)గా మార్చి సంచుల తయారీకి వినియోగిస్తారు. అందుకు కూడా ఉపయోగపడని వాటికి నిప్పు పెడతారు. తద్వారా ప్రమాదకర డయాక్సిన్లు అనే కార్సినోజెనిక్ వాయువులు వెలువడి అనారోగ్య కారకాలవుతాయి.