కార్పొరేషన్, న్యూస్‌లైన్: ప్లాస్టిక్‌ను సృష్టిస్తున్న మనిషి కాలధర్మం చేస్తే మట్టిలో కలిసి పోతున్నాడు కాని, ప్లాస్టిక్ మాత్రం ఎన్ని సంవత్సరాలైన అలాగే ఉండిపోతోంది. ఫలితంగా మానవాళికి తీవ్ర ప్రమాదం జరుగుతోంది. వీటిని నిషేధించాలని జాతీయ కాలుష్య నియంత్రణ మండలి సూచనను అన్ని మున్సిపల్‌లలో అమల్లోకి తెచ్చినా పర్యవేక్షణ లేకపోవటంతో ప్లాస్టిక్ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రతి పదిమందిలో 8 మంది ప్లాస్టిక్ నిషేధాన్ని తుంగలో తొక్కుతున్నారు.
జిల్లాలో ఉన్న జనాభాలో దాదాపు 80 శాతం మంది ప్రజలు ఏదో ఒక పని మీద దుకాణాలకు వె ళ్తూ సామాగ్రి కొని ప్లాస్టిక్ కవర్లలో ఇంటికి తీసుకెళ్లున్నారు. తర్వాత వాటిని వాటిని పారవేస్తుండటంతో అవి మురుగు కాల్వలు, కుంటలు, జనావాసాల మధ్య పేరుకుపోతున్నాయి. 40 శాతం మైక్రాన్లు కలిగిన పాలిథీన్ కవర్లను వాడుకోవచ్చని ప్రభుత్వం సడలించిన అవకాశాన్ని అసరగా చేసుకుని చాలామంది వ్యాపారులు నిషేధాన్ని నీరుగారుస్తున్నారు. మున్సిపల్ అధికారులు ‘చెత్తపై కొత్త సమరం’ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధాన్ని పక్కగా అమలు చేయాలని పలువురు కోరుతున్నారు. పాలిథిన్ సంచులకు బదులుగా జూట్,పేపర్‌లతో తయారు చేసిన కవర్లు మాత్రమే వాడాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవి మార్కెట్‌లో లభ్యం కాకపోవటంతోనే ప్లాస్టిక్‌ను కొంటున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
జిల్లాలో ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకంపై నిబంధనలను వ్యాపారులు పాటించటంలేదు. ప్లాస్టిక్ వినియోగించే వ్యాపారులపై అధికారుల తూతూ మంత్రం చర్యలుతో సరిపెడుతుండటంతో ప్లాస్టిక్ వాడకం మరింత ఎక్కువై పోతోంది. ఫలితంగా నానాటికి పర్యవరణం మరింత పాడవుతోంది. పర్యవరణాన్ని సంరక్షించే కార్యక్రమాలను ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్నా దానిని అదే రోజు మరిచిపోతున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్యధికారి డాక్టర్ సిరాజుద్దీన్ అనేకసార్లు 20 శాతం మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్ కవర్లను పట్టుకుని వ్యాపారులకు భారీగా జరిమానాలు విధించారు. అయిన వ్యాపారులు దీనిని తేలికగా తీసుకుంటున్నారు. ఇటీవల ఎంహెచ్‌ఓ మూడు నెలల పాటు నగరంలో లేకపోవటంతో ప్లాస్టిక్ వ్యాపారం చేసే వ్యాపారుల ఇష్ట్యరాజ్యం అయ్యింది. మూడు నెలల పాటు ఇన్‌చార్జి ఎంహెచ్‌ఓగా ఉన్న అధికారి ఏనాడూ ప్లాస్టిక్ నిషేధం గురించి పట్టించుకోక పోవటంతో కొంతమంది వ్యాపారులకు అడ్డు అదుపులేకుండా పోయింది. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని అన్ని మండలాలు,గ్రామాలలోని దాదాపు అన్ని టిఫిన్ సెంటర్‌లలో, కూరగాయలు, పండ్లు, ఇతర పదార్థాల విక్రయాలకు 20 శాతం మైక్రాన్లు కలిగిన ప్లాస్టిక్ కవర్లే వాడుతున్నారు.
ఫంక్షన్‌హళ్లపై చర్యలేవీ?
జిల్లాలోని అన్ని ఫంక్షన్ హళ్లలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాస్‌లు, గిన్నెలు వాడొద్దని గతంలో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని ఫంక్షన్‌హాళ్లలో ఇక్కడ ప్లాస్టిక్ వాడటాన్ని నిషేధించామని బోర్డులు పెట్టించారు. ఈ ఆదేశాలు కొద్ది రోజులు మాత్రమే అమలు పరిచి మళ్లి వాటి వైపు కన్నెత్తి చూడటంలేదు.
దాడులు ఉధ్రుతం చేస్తాం..
ఇప్పటి వరకు నగరంలో ప్లాస్టిక్ కవర్లు విక్రయించే వ్యాపారులపైనే చర్యలు తీసుకుంటూ వచ్చాం. ఇక వ్యాపారులతో పాటు ప్లాస్టిక్ కవర్లు వాడే ప్రజలపై కూడ చర్యలు తీసుకుంటామని ఎంహెచ్‌ఓ సిరాజుద్దీన్ తెలిపారు. చెత్తపై కొత్త సమరం వంద రోజుల్లో క్లీన్ సిటీ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వినియోగంపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కావున ప్రజలు జూటు సంచులను మాత్రమే వాడాలని ఆయన సూచిస్తున్నారు.
అన ర్థాలివే..
ప్లాస్టిక్ కవర్లలో తీసుకుపోయే పదార్థాలకు ప్రాణ వాయువు(అక్సిజన్) తగలక పోవటంతో అట్టి పదార్ధాలు తొందరగా పాడవుతాయి. వీటిని తిన్న వారికి 20 రకాల క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
పాలిథిన్ సంచుల్లో తీసుకువచ్చే వేడి పదార్థాల్లో ప్లాస్టిక్ తయారీకి ఉపయోగించే రసాయన పదార్థాలు కలిసిపోయి వాటిని తినే చిన్న పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోతుంది.
ప్లాస్టిక్ సంచులు, వస్తువులు తగలబెట్టే సమయంలో వెలువడే వాయువు వల్ల ఓజోన్ పొర దెబ్బతింటుంది.
చెరువులో, కుంటల్లో ప్లాస్టిక్ కలిసిన నీటిని తాగే పశువులు అనారోగ్యం పాలవుతున్నాయి.