న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ సతమతమవుతోంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధానిలో డీజిల్ కార్లను నిషేధిస్తూ రవాణా విభాగం ఆదేశాలు జారీ చేసింది. బీఎస్-6 మినహా డీజిల్‌తో నడిచే పాత వర్షన్ లైట్ మోటార్ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) సిఫార్సు చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.20,000 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది.
ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. బీఎస్6 వాహనాలు, నిత్యావసర, ఎమర్జెన్సీ సర్వీసుల్లోని వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. బ్యాన్ కేటగిరీలోకి వచ్చే వాహనాలు ఉన్న యజమానులకు ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం సందేశాలు సైతం పంపించింది. ‘మీ వాహనం నిషేధిత కేటగిరిలో ఉన్నందున ఢిల్లీ రోడ్లపైకి తీసుకురాకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే.. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 ప్రకారం.. మీకు రూ.20,000 జరిమానా విధించబడుతుంది.’ అనే మెసేజ్‌ను వాహన యజమానులకు పంపించారు.
మరోవైపు.. నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఢిల్లీ రోడ్లపై అలాంటి వాహనాలు భారీగా తిరగటం గమనార్హం. ఢిల్లీ గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఏఐక్యూ 408కు చేరుకున్న క్రమంలో నగరం మొత్తం నల్లటి పొగ ఆక్రమించేసింది. ఏఐక్యూ 400 దాటితే దానిని తీవ్రమైన కాలుష్యంగా భావిస్తారు. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డీజిల్ వాహనాలు మినహాయిస్తే.. సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుమతులు ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసు సేవల్లో ఉన్న డీజిల్ వాహనాలకు మినహాయింపునిచ్చారు.
ఇదీ చదవండి: Delhi-NCR Pollution: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు
Comments
Please login to add a commentAdd a comment