ban on diesel vehicles
-
డీజిల్ కారు ఉందా? ఆ రోడ్లపైకి వెళ్లారో రూ.20వేల ఫైన్!
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ సతమతమవుతోంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. దేశ రాజధానిలో డీజిల్ కార్లను నిషేధిస్తూ రవాణా విభాగం ఆదేశాలు జారీ చేసింది. బీఎస్-6 మినహా డీజిల్‌తో నడిచే పాత వర్షన్ లైట్ మోటార్ వాహనాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గాలి నాణ్యత నిర్వహణ కమిషన్(సీఏక్యూఎం) సిఫార్సు చేసిన నిబంధనలను ఉల్లంఘిస్తే రూ.20,000 జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం.. బీఎస్6 వాహనాలు, నిత్యావసర, ఎమర్జెన్సీ సర్వీసుల్లోని వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. బ్యాన్ కేటగిరీలోకి వచ్చే వాహనాలు ఉన్న యజమానులకు ఢిల్లీ ట్రాన్స్‌ఫోర్ట్ విభాగం సందేశాలు సైతం పంపించింది. ‘మీ వాహనం నిషేధిత కేటగిరిలో ఉన్నందున ఢిల్లీ రోడ్లపైకి తీసుకురాకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే.. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 194 ప్రకారం.. మీకు రూ.20,000 జరిమానా విధించబడుతుంది.’ అనే మెసేజ్‌ను వాహన యజమానులకు పంపించారు. మరోవైపు.. నిషేధం అమలులో ఉన్నప్పటికీ ఢిల్లీ రోడ్లపై అలాంటి వాహనాలు భారీగా తిరగటం గమనార్హం. ఢిల్లీ గాలి నాణ్యత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఏఐక్యూ 408కు చేరుకున్న క్రమంలో నగరం మొత్తం నల్లటి పొగ ఆక్రమించేసింది. ఏఐక్యూ 400 దాటితే దానిని తీవ్రమైన కాలుష్యంగా భావిస్తారు. అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. డీజిల్ వాహనాలు మినహాయిస్తే.. సీఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుమతులు ఉన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసు సేవల్లో ఉన్న డీజిల్ వాహనాలకు మినహాయింపునిచ్చారు. ఇదీ చదవండి: Delhi-NCR Pollution: ఢిల్లీలో క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు -
'నిషేధం ఇతర సిటీలకు విస్తరించం'
న్యూఢిల్లీ : దేశ రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పెద్ద డీజిల్ వాహనాల అమ్మకం నిషేధం మరో 11 నగరాలపై విస్తరించే ప్రణాళికలేమి లేవని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) వెల్లడించింది. మొదట వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన సిటీల్లో గాలి కాలుష్య లెవల్స్ ను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. 2015 డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీ, దాన్ని పరిసర ప్రాంతాల్లో 2000 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ ఇంజన్ వాహనాల నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం మరో 11 సిటీల్లో కూడా విధించబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ నిషేధం ఇతర నగరాల్లో విధించే ప్రణాళికలేమీ లేవని మంగళవారం గ్రీన్ ప్యానెల్ ప్రకటించింది. రాష్ట్రాల పరిధిలో ఉన్న రెండు అధిక కాలుష్య సిటీలేమిటో తెలుపుతూ మూడు వారాల్లో అఫిడివిట్ దాఖలు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీస్ ను ఆదేశించింది. ప్రతి జిల్లాలో జనాభా ఎంత ఉంది, ఆ ప్రాంతాల్లో వాహన డెన్సిటీలు ఎలా ఉన్నాయో తెలపాలని పేర్కొంది. తాము ఎలాంటి వాహనాలపై నిషేధం విధించడం లేదని, సిటీల్లో కాలుష్య లెవల్స్ పై రిపోర్టు సమర్పించాలని మాత్రమే ప్రభుత్వాలను ఆదేశించామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ తెలిపారు. డేటా వచ్చిన తర్వాత, వివిధ పార్టీల వాదనలు విన్న అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 2000 సీసీ కంటే ఎక్కువ డీజిల్ సామర్థ్యమున్న వాహనాల నిషేధం ఇతర ప్రాంతాలకు విస్తరించొద్దని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తరుఫున అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ బెంచ్ ను కోరారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 8శాతం ఎఫ్ డీఐలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయని తెలిపారు. ఉద్యోగవకాశాలు పెంపొందించడంలో ఈ పరిశ్రమ ముందంజలో ఉంటుందని, ఈ నిషేధ నిబంధనలు ఇతర ప్రాంతాల్లో కూడా అమలుచేస్తే వృద్ది రేటుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.