న్యూఢిల్లీ : దేశ రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పెద్ద డీజిల్ వాహనాల అమ్మకం నిషేధం మరో 11 నగరాలపై విస్తరించే ప్రణాళికలేమి లేవని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) వెల్లడించింది. మొదట వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన సిటీల్లో గాలి కాలుష్య లెవల్స్ ను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. 2015 డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీ, దాన్ని పరిసర ప్రాంతాల్లో 2000 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ ఇంజన్ వాహనాల నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం మరో 11 సిటీల్లో కూడా విధించబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ నిషేధం ఇతర నగరాల్లో విధించే ప్రణాళికలేమీ లేవని మంగళవారం గ్రీన్ ప్యానెల్ ప్రకటించింది.
రాష్ట్రాల పరిధిలో ఉన్న రెండు అధిక కాలుష్య సిటీలేమిటో తెలుపుతూ మూడు వారాల్లో అఫిడివిట్ దాఖలు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీస్ ను ఆదేశించింది. ప్రతి జిల్లాలో జనాభా ఎంత ఉంది, ఆ ప్రాంతాల్లో వాహన డెన్సిటీలు ఎలా ఉన్నాయో తెలపాలని పేర్కొంది. తాము ఎలాంటి వాహనాలపై నిషేధం విధించడం లేదని, సిటీల్లో కాలుష్య లెవల్స్ పై రిపోర్టు సమర్పించాలని మాత్రమే ప్రభుత్వాలను ఆదేశించామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ తెలిపారు. డేటా వచ్చిన తర్వాత, వివిధ పార్టీల వాదనలు విన్న అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
2000 సీసీ కంటే ఎక్కువ డీజిల్ సామర్థ్యమున్న వాహనాల నిషేధం ఇతర ప్రాంతాలకు విస్తరించొద్దని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తరుఫున అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ బెంచ్ ను కోరారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 8శాతం ఎఫ్ డీఐలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయని తెలిపారు. ఉద్యోగవకాశాలు పెంపొందించడంలో ఈ పరిశ్రమ ముందంజలో ఉంటుందని, ఈ నిషేధ నిబంధనలు ఇతర ప్రాంతాల్లో కూడా అమలుచేస్తే వృద్ది రేటుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.