justice Swatanter Kumar
-
జస్టిస్ స్వతంత్ర కుమార్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు సేవలందించిన జస్టిస్ స్వతంత్ర కుమార్ మంగళవారం పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత ఈ పదవికి ఇంకా ఎవరినీ నియమించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ కుమార్ 2012 డిసెంబరు 20న ఎన్జీటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అనంతరం అనేక కీలక తీర్పులను వెలువరించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడ్డారు. ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను నిషేధించడం, గంగ, యమున నదుల ప్రక్షాళన చేపట్టడం, హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమంగా నిర్మించిన హోటళ్లను కూల్చేయడం తదితరాలన్నీ ఈయన తీర్పుల వల్ల జరిగినవే. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయానికి రోజుకు 50 వేల కంటే ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి వీల్లేదనీ, అమర్నాథ్ వద్ద ప్రజలు గట్టిగా అరుస్తూ శివనామ స్మరణ చేయకూడదని కూడా జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆదేశించారు. -
శ్రీవారిని దర్శించుకున్న ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంతర్‌కుమార్
సాక్షి, తిరుమల : తిరుమల ప్రశాంతమైన ఆధ్యాత్మిక క్షేత్రమని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చైర్మన్ జస్టిస్ స్వతంతర్‌కుమార్ అన్నారు. గురువారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి తిరుప్పావై సేవలో పాల్గొన్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ స్వతంతర్కుమార్కు టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం కల్పించి, శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల జస్టిస్ స్వతంతర్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఆధ్యాత్మిక భావనతో వస్తున్నారని, అదే వాతావరణం తిరుమలలో ఉండటం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ అధికార యంత్రాంగం బాగా పనిచేస్తోందని, అందువల్లే ఈ క్షేత్రం పరిశుభ్రత, ప్రశాంత వాతావరణంతో ఉందని కితాబిచ్చారు. -
బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా
-
బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా
న్యూఢిల్లీ: కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) పూర్తిగా నిషేధించింది. చెత్త డంపింగ్ ప్రదేశాల్లోసహా ఎక్కడ చెత్తను దగ్ధంచేసినా వ్యక్తి లేదా సంస్థకు రూ.25,000 జరిమానా విధిస్తామని ఎన్ జీటీ స్పష్టంచేసింది. తక్కువ మొత్తంలో చెత్తను తగలబెడితే రూ.5,000 జరిమానా విధిస్తామని ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. తమ మార్గదర్శకాలను పాటించాలంటూ అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను సూచించింది. మరోవైపు, ఎన్నికల ప్రచారంలో ప్లాస్టిక్ జెండాలు, బ్యానర్ల వాడకాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై స్పందించాలని కేంద్రాన్ని ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖకు నోటీసులిచ్చింది. -
'నిషేధం ఇతర సిటీలకు విస్తరించం'
న్యూఢిల్లీ : దేశ రాజధాని ప్రాంతంలో కొనసాగుతున్న పెద్ద డీజిల్ వాహనాల అమ్మకం నిషేధం మరో 11 నగరాలపై విస్తరించే ప్రణాళికలేమి లేవని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్ జీటీ) వెల్లడించింది. మొదట వివిధ రాష్ట్రాలనుంచి వచ్చిన సిటీల్లో గాలి కాలుష్య లెవల్స్ ను పరిశీలించాల్సి ఉందని తెలిపింది. 2015 డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీ, దాన్ని పరిసర ప్రాంతాల్లో 2000 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యమున్న డీజిల్ ఇంజన్ వాహనాల నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిషేధం మరో 11 సిటీల్లో కూడా విధించబోతున్నారని వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ నిషేధం ఇతర నగరాల్లో విధించే ప్రణాళికలేమీ లేవని మంగళవారం గ్రీన్ ప్యానెల్ ప్రకటించింది. రాష్ట్రాల పరిధిలో ఉన్న రెండు అధిక కాలుష్య సిటీలేమిటో తెలుపుతూ మూడు వారాల్లో అఫిడివిట్ దాఖలు చేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ అన్ని రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీస్ ను ఆదేశించింది. ప్రతి జిల్లాలో జనాభా ఎంత ఉంది, ఆ ప్రాంతాల్లో వాహన డెన్సిటీలు ఎలా ఉన్నాయో తెలపాలని పేర్కొంది. తాము ఎలాంటి వాహనాలపై నిషేధం విధించడం లేదని, సిటీల్లో కాలుష్య లెవల్స్ పై రిపోర్టు సమర్పించాలని మాత్రమే ప్రభుత్వాలను ఆదేశించామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్ పర్సన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ తెలిపారు. డేటా వచ్చిన తర్వాత, వివిధ పార్టీల వాదనలు విన్న అనంతరం దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. 2000 సీసీ కంటే ఎక్కువ డీజిల్ సామర్థ్యమున్న వాహనాల నిషేధం ఇతర ప్రాంతాలకు విస్తరించొద్దని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తరుఫున అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ బెంచ్ ను కోరారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా 8శాతం ఎఫ్ డీఐలు ఆటోమొబైల్ ఇండస్ట్రీ నుంచే వస్తున్నాయని తెలిపారు. ఉద్యోగవకాశాలు పెంపొందించడంలో ఈ పరిశ్రమ ముందంజలో ఉంటుందని, ఈ నిషేధ నిబంధనలు ఇతర ప్రాంతాల్లో కూడా అమలుచేస్తే వృద్ది రేటుపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. -
మీడియాపై జస్టిస్ స్వతంత్ర కుమార్ పరువు నష్టం దావా
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ స్వతంత్ర కుమార్ బుధవారం న్యూఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయ విద్యార్థిని ఆరోపణలు, మీడియా కథనాల వల్ల తన పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని స్వతంత్ర కుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆటు మీడియా, ఇటు న్యాయవిద్యార్థిని తనకు రూ. 5 కోట్లు చెల్లించాలని హైక్టోర్టులో వేసిన పరువు నష్టం దావాలో పేర్కొన్నారు. స్వతంత్ర కుమార్ మీద న్యాయ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం నాడు వాదనలు విననుంది. న్యాయ విద్యార్థిని వేధింపుల కేసులో అమికస్ క్యూరీలుగా ఫాలి ఎస్.నారిమన్, కె.కె. వేణుగోపాల్లను సుప్రీంకోర్టు బుధవారం నియమించింది. జస్టిస్ స్వతంత్ర కుమార్‌పై వచ్చిన అభియోగాల మీద తమ అభిప్రాయాన్ని చెప్పబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయవిద్యార్థులపై జరుగుతున్న లైంగిక దాడుల కేసులను విచారించేందుకు ప్రత్యేక విభాగం ఉండాలని వేధింపులకు గురైన న్యాయ విద్యార్థిని సుప్రీంకోర్టును కోరింది. అయితే ఆ ఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేయకుండా తీవ్ర జాప్యం ఎందుకు చేశారని న్యాయవిద్యార్థినిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. -
స్వతంత్ర కుమార్‌పై సుప్రీంకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: మాజీ జడ్జి స్వతంత్ర కుమార్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన వద్ద పనిచేసిన న్యాయ విద్యార్థిని నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్వతంత్ర కుమార్‌పై విచారణ జరపాలని న్యాయస్థాన్ని ఆమె కోరింది. ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం నేతృత్వంలోని బెంచ్ దీన్ని త్వరితగతిన విచారించేందుకు స్వీకరించింది. ఈనెల 15న దీనిపై విచారణ జరపాలని నిర్ణయించింది. మాజీ జడ్జిలపై వచ్చిన ఫిర్యాదులను విచారణకు స్వీకరించకూడని గతేడాది డిసెంబర్ 5న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా ఆమె సవాల్ చేశారు. ఇటువంటి కేసుల విచారణకు సరైన వేదిక ఏర్పాటు చేయాలని ఆమె పిటిషన్లో కోరింది. జస్టిస్ స్వతంత్ర కుమార్ ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
లైంగిక ఆరోపణలు అవాస్తవం: జస్టిస్ స్వతంత్ర కుమార్
సుప్రీం న్యాయమూర్తులపై వరుసపెట్టి లైంగిక ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీపై ఆరోపణలు వెల్లువెత్తగా, ఇప్పుడు మరో మాజీ జడ్జి స్వతంత్ర కుమార్ వంతు వచ్చింది. అయితే, తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని జస్టిస్ స్వతంత్ర కుమార్ చెబుతున్నారు. ఆయన వద్ద పనిచేసినట్లు చెబుతున్న ఓ న్యాయ విద్యార్థిని ఆయనపై ఆరోపణలు చేసింది. ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఆయన చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు ఆయన పేరు బయటకు రాలేదు. శుక్రవారం నాడు బాధితురాలి ఫిర్యాదును ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్ ఆయన పేరు బయటపెట్టడంతో, స్వతంత్రకుమార్ జాతీయ మీడియాకు తన వివరణ పంపారు. అసలు ఆమె ఎవరో తనకు తెలియదని, తన వద్ద ఆమె శిష్యరికం చేసినట్లు కూడా గుర్తు లేదని ఆయన అన్నారు. ఆమె అఫిడవిట్ దాఖలు చేసినట్లు కూడా తనకు సమాచారం ఏమీ లేదన్నారు. కేవలం మీడియా ద్వారా మాత్రమే తనకు అలాంటి అఫిడవిట్ పంపినట్లు తెలిసిందని, అఫిడవిట్ వివరాలు ప్రచురిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన చెప్పారు. జస్టిస్ స్వతంత్రకుమార్ తన పృష్టభాగంపై చేయి వేశారని, ఆయనతో కలిసి ప్రయాణించేందుకు, హోటళ్లలో ఉండేందుకు ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.