లైంగిక ఆరోపణలు అవాస్తవం: జస్టిస్ స్వతంత్ర కుమార్
సుప్రీం న్యాయమూర్తులపై వరుసపెట్టి లైంగిక ఆరోపణలు వస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీపై ఆరోపణలు వెల్లువెత్తగా, ఇప్పుడు మరో మాజీ జడ్జి స్వతంత్ర కుమార్ వంతు వచ్చింది. అయితే, తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని జస్టిస్ స్వతంత్ర కుమార్ చెబుతున్నారు. ఆయన వద్ద పనిచేసినట్లు చెబుతున్న ఓ న్యాయ విద్యార్థిని ఆయనపై ఆరోపణలు చేసింది. ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్కు ఆయన చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు ఆయన పేరు బయటకు రాలేదు. శుక్రవారం నాడు బాధితురాలి ఫిర్యాదును ఉటంకిస్తూ సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్ ఆయన పేరు బయటపెట్టడంతో, స్వతంత్రకుమార్ జాతీయ మీడియాకు తన వివరణ పంపారు.
అసలు ఆమె ఎవరో తనకు తెలియదని, తన వద్ద ఆమె శిష్యరికం చేసినట్లు కూడా గుర్తు లేదని ఆయన అన్నారు. ఆమె అఫిడవిట్ దాఖలు చేసినట్లు కూడా తనకు సమాచారం ఏమీ లేదన్నారు. కేవలం మీడియా ద్వారా మాత్రమే తనకు అలాంటి అఫిడవిట్ పంపినట్లు తెలిసిందని, అఫిడవిట్ వివరాలు ప్రచురిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని ఆయన చెప్పారు. జస్టిస్ స్వతంత్రకుమార్ తన పృష్టభాగంపై చేయి వేశారని, ఆయనతో కలిసి ప్రయాణించేందుకు, హోటళ్లలో ఉండేందుకు ఇబ్బంది ఏమీ లేదు కదా అని అడిగారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.