మీడియాపై జస్టిస్ స్వతంత్ర కుమార్ పరువు నష్టం దావా
లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ స్వతంత్ర కుమార్ బుధవారం న్యూఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయ విద్యార్థిని ఆరోపణలు, మీడియా కథనాల వల్ల తన పరువుకు తీవ్ర భంగం వాటిల్లిందని స్వతంత్ర కుమార్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆటు మీడియా, ఇటు న్యాయవిద్యార్థిని తనకు రూ. 5 కోట్లు చెల్లించాలని హైక్టోర్టులో వేసిన పరువు నష్టం దావాలో పేర్కొన్నారు.
స్వతంత్ర కుమార్ మీద న్యాయ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం నాడు వాదనలు విననుంది. న్యాయ విద్యార్థిని వేధింపుల కేసులో అమికస్ క్యూరీలుగా ఫాలి ఎస్.నారిమన్, కె.కె. వేణుగోపాల్లను సుప్రీంకోర్టు బుధవారం నియమించింది. జస్టిస్ స్వతంత్ర కుమార్పై వచ్చిన అభియోగాల మీద తమ అభిప్రాయాన్ని చెప్పబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యాయవిద్యార్థులపై జరుగుతున్న లైంగిక దాడుల కేసులను విచారించేందుకు ప్రత్యేక విభాగం ఉండాలని వేధింపులకు గురైన న్యాయ విద్యార్థిని సుప్రీంకోర్టును కోరింది. అయితే ఆ ఘటన జరిగిన వెంటనే ఫిర్యాదు చేయకుండా తీవ్ర జాప్యం ఎందుకు చేశారని న్యాయవిద్యార్థినిని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.