
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి మెజార్టీ సిటిజన్లు సొంతూరు బాటపట్టారు. రోడ్లెక్కే వాహనాలు తగ్గడంతో దుమ్ము, ధూళి కాలుష్యం కూడా సగానికంటే ఎక్కువగానే తగ్గింది. ఈసారి పండుగకి సుమారు 25 లక్షల మంది నగరం నుంచి సొంతూళ్లకు ప్రయాణం కావడంతో.. ప్రధాన రహదారులపై వాహనాల సంచారం అరకొరగానే కనిపించింది.
గ్రేటర్ పరిధిలో నిత్యం 50 లక్షల వాహనాలు తిరుగుతుండగా.. మంగళ, బుధవారాల్లో ఆ సంఖ్య 15 లక్షలకు మించకపోవడం గమనార్హం. దీంతో దుమ్ము, ధూళి కాలుష్యంతో పాటు మోటార్ వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ తదితర కాలుష్య ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ రెండు రోజులు నగరం స్వచ్ఛ ఊపిరి పీల్చుకుంది.
కాలుష్యం తగ్గింది ఇలా...
కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు ప్రతి ఘనపు మీటర్ గాల్లో ధూళి కణాలు 60 మైక్రో గ్రాములకు మించి ఉండరాదు. కానీ సాధారణ రోజుల్లో పలు ప్రధాన రహదారులు, కూడళ్లలో 90 నుంచి 100 మైక్రోగ్రాముల మేర ధూళి కాలుష్యం నమోదవుతోంది. భోగి, సంక్రాంతి పండగ సందర్భంగా మంగళ, బుధవారాల్లో వాయు కాలుష్యం సగానికంటే తక్కువ నమోదవడం విశేషం. మోటారు వాహనాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు కూడా.. సగానికంటే తక్కువ మోతాదులో నమోదు కావడం విశేషం. నగరవాసులు సైతం పండగ వేళ ఇళ్లకే పరిమితం కావడంతో వాహనాల సంచారం గణనీయంగా తగ్గడం కాలుష్య ఉద్గారాలు పడిపోవడానికి మరో కారణం.
Comments
Please login to add a commentAdd a comment