సాక్షి, అమరావతి: అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో ఆర్టీసీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీకి ఉన్న పరిమితులను ఏపీఎస్‌ఆర్టీసీ సమర్థంగా అందిపుచ్చుకోవడమే అందుకు తాజా నిదర్శనం. హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు అదనంగా వెయ్యి సంక్రాంతి స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. వాస్తవానికి ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ కింద 6,725 బస్సులను నడపాలని నిర్ణయింది. అందులో హైదరాబాద్ నుంచి సంక్రాంతికి ముందు 1,600 బస్ సర్విసులు, సంక్రాంతి తరువాత 1,500 బస్ సర్విసులు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించింది.
ఏటా సంక్రాంతి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులు నడిపేది. కానీ తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తుండటంతో అంచనాలకు మించి మహిళా ప్రయాణికులతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సు సర్విసులు నడపలేమని తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసింది. ఈ అవకాశాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ సద్వినియోగం చేసుకుంది. పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వచ్చేవారికి సౌలభ్యంగా ఉండేందుకు అదనంగా వెయ్యి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయించింది.
హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, అమలాపురం, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, చీరాల, విశాఖపట్నాలకు అదనపు వెయ్యి బస్సు సర్విసులు నడుపుతారు. బెంగళూరు, చెన్నైల నుంచి కూడా మన రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వీటితోపాటు విజయవాడ నుంచి కర్నూలు, అనంతపురం, తిరుపతిలకు అదనపు ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు మెరుగైనసేవలు అందించేందుకు అదనంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించామని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment