సిద్దిపేట జోన్: శాబ్ధ కాలం క్రితం వంద పరిశ్రమలతో పారిశ్రామిక వైభవాన్ని సంతరించుకున్న సిద్దిపేట పరిశ్రమల ప్రతినిధులకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇటీవల పట్టణానికి చెందిన శంకర్‌నగర్ కాలనీ వాసులు సమీప పరిశ్రమల కాలుష్యం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామనే ఫిర్యాదుపై డివిజన్ అధికారులు స్పందించారు. ఒక దశలో సిద్దిపేట మున్సిపల్ ప్రత్యేకాధికారి, ఆర్డీఓ ముత్యంరెడ్డి ఇటీవల మున్సిపల్ అధికారులకు సంబంధిత పరిశ్రమల సమగ్ర వివరాలపై, కాలుష్య స్థితి గతులపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఓ ఆదేశాలకు అనుగుణంగా సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఈ నెల 12న పట్టణంలోని 33 పరిశ్రమలకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు.
సుమారు పది అంశాలతో కూడిన సమగ్ర వివరాలపై మున్సిపల్ అధికారులు ఆయా పరిశ్రమల నుంచి నివేదికలు సేకరిస్తున్నట్లు సమాచారం. మరోవైపు నిర్ణీత గడువు ముగియనున్న దశలో రెండు మూడు రోజుల్లో సంబంధిత కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో కలిసి అకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే... వ్యాపార, వాణిజ్య రంగంలో వెలుగువెలిగిన సిద్దిపేటలో ఒకప్పుడు వంద పరిశ్రమలు ఉండేవి. కాలక్రమేణా పారిశ్రామికికరంగా సంబంధించిన మార్పులు, విద్యుత్ కోతలు, ప్రభుత్వ విధానాలు, ప్రత్యామ్నాయ మార్గాల నేపథ్యంలో కొన్ని పరిశ్రమలు మూలపడగా ప్రస్తుతం స్వల్ప సంఖ్యలో రైసు మిల్లులు, ఆయిల్, కుంకుమ, దాల్ మిల్లులతో పాటు ఇతర పరిశ్రమలు ఉన్నాయి.
గతంలో పట్టణ శివారులో నిర్మించిన ఫ్యాక్టరీలు గత కొంత కాలంగా పెరుగుతున్న పట్టణీకరణతో జనావాసాల్లో కలిసి పోయాయి. ఈ క్రమంలో ఇటీవల శంకర్‌నగర్‌కు చెందిన కాలనీ వాసులు సంబంధిత సమీప పరిశ్రమల ద్వారా వెదజల్లే కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిబంధనలను ఉల్లంఘించారంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు సిద్దిపేట ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో స్పందించిన ఆర్డీఓ ముత్యంరెడ్డి సంబంధిత ఫిర్యాదుపై తక్షణం స్పందించి సమగ్ర వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని ఈ నెల 10న మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
మున్సిపల్ ప్రత్యేకాధికారి ఆదేశాలతో స్పందించిన మున్సిపాల్టీ తక్షణ చర్యలో భాగంగా పట్టణ శివారులోని 33 పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత పరిశ్రమకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి, పరిశ్రమల శాఖ, అగ్ని మాపక శాఖ అనుమతులతో పాటు ఫ్యాక్టరీలో యంత్రాల సామర్థ్యం, పని చేస్తున్న కూలీల, కార్మికుల వివరాలు, ఫ్యాక్టరీ ఫొటో గ్రఫీతో కూడిన ప్లాన్ వివరాలు, మున్సిపల్‌కు వారు చెల్లిస్తున్న ఆస్తి పన్ను వివరాలు, విద్యుత్ బిల్లు వివరాలను తెలియజేసే ధ్రువీకరణ పత్రాలతో సమగ్ర వివరాలను అందజేయాలని ఈ నెల 12న ఎల్‌ఆర్ నం.ఎఫ్1/1316/2014 ప్రకారం నోటీసులు జారీ చేశారు.
గతంలో లేని విధంగా మున్సిపల్ అధికారులు ఒక్క సారిగా పరిశ్రమకు సంబంధించిన నివేదికను అందజేయాలని ఆదేశించడంతో గత వారం రోజులుగా సిద్దిపేటలోని పరిశ్రమల ప్రతినిధులు మున్సిపల్ కార్యాలయం బాట పట్టారు.సంబంధిత వివరాలకు అనుగుణంగా మరో రెండు రోజుల్లో సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం పరిశ్రమల్లో కాలుష్యం స్థితి గతులను అకస్మికంగా తనిఖీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
‘కాలుష్యం’పై సర్కార్ నిఘా!
Published Thu, Jul 31 2014 12:10 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement