మంత్రి ఇలాకాలో అక్రమ మైనింగ్‌ | Illegal mining At Near Paritala | Sakshi
Sakshi News home page

మంత్రి ఇలాకాలో అక్రమ మైనింగ్‌

Published Thu, Jul 26 2018 3:38 AM | Last Updated on Thu, Jul 26 2018 3:38 AM

Illegal mining At Near Paritala - Sakshi

పరిటాలలో కొండలను పిండిచేస్తున్న చిత్రం

సాక్షి, అమరావతి బ్యూరో: పర్యావరణానికి తూట్లు పొడుస్తూ కాలుష్యం వెదజల్లుతున్న అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించినా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలో మాత్రం వీటికి తెరపడటం లేదు. పర్మిట్లు రద్దు చేసినా నెల దాటుతున్నా ఉన్నతస్థాయి అండదండలతో మైనింగ్‌ మాఫియా నిత్యం వేలాది టన్నుల కంకరను తరలిస్తోంది. 

జాతీయ రహదారి చెంతనే..
నందిగామ, మైలవరం నియోజవర్గాల పరిధిలోని కంచికచర్ల మండలం పరిటాల దొనబండ సర్వేనంబర్‌ 801లో 1,204 హెక్టార్ల కొండపోరంబోకు భూములున్నాయి. సహజవనరులు విస్తరించిన ఇక్కడి భూముల్లో 94 క్వారీలు, 72 క్రషర్‌లు ఏర్పాటు చేశారు. విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారి పక్కనే ఈ క్వారీలున్నాయి. నిబంధనల ప్రకారం జాతీయ రహదారికి కిలోమీటర్‌ దూరంలో వీటిని ఏర్పాటు చేయకూడదు. కానీ వంద మీటర్ల లోపే క్రషర్స్‌ నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరికి 2 నుంచి 5 హెక్టార్ల చొప్పున 94 క్వారీల నిర్వహణకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటికే దాదాపు 800 హెక్టార్లలో క్వారీలు తవ్వేశారు. కొండలను తొలిచేశారు.

నిత్యం 500 వాహనాల్లో తరలింపు..
పరిటాల పరిధిలో మంత్రి సమీప బంధువులతోపాటు మోడరన్‌ క్రషర్, పవన్‌స్టోన్‌ క్రషర్, అయ్యప్ప క్రషర్, ఎన్‌ఎన్‌ఆర్‌ క్రషర్స్‌ యజమానులే అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్వారీల నుంచి పెద్ద బండరాళ్లను క్రషర్‌ ద్వారా 40 ఎంఎం, 20 ఎంఎం, 12 ఎంఎం, డస్ట్, బేబీ చిప్స్, జీఎస్‌బీ వెట్‌మిక్స్‌లా మార్చి నిత్యం 500 భారీ వాహనాల్లో 21,000 టన్నుల కంకరను రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం నుంచి భవన నిర్మాణాల వరకు రవాణా చేస్తున్నారు. 10 టైర్ల వాహనంలో 16 టన్నుల లోడ్‌ వెళ్లాల్సి ఉంటే 30 టన్నులు తరలిస్తున్నారు. 12 టైర్ల వాహనంలో 22 టన్నులకు బదులు 60 టన్నుల చొప్పున తరలిపోతున్నా పోలీస్, రవాణాశాఖ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. నిత్యం రూ. 1.2 కోట్ల విలువైన మెటల్‌ను తరలిస్తున్నారు. 

గుండెలు అదిరేలా బ్లాస్టింగ్‌లు..
పరిటాల క్వారీల్లో అనుమతులు లేకుండా నిత్యం రిగ్గు బ్లాస్టింగ్‌లు చేయడంతో దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలో భూమి కంపిస్తోంది. వాస్తవంగా క్వారీ నిర్వాహకులు 15 నుంచి 20 అడుగుల వరకు నిపుణుల పర్యవేక్షణలో బ్లాస్టింగ్‌ ద్వారా రెండు కొండ రాళ్ల మధ్య మట్టిని మాత్రమే తొలగించాలి. బ్లాస్టింగ్‌ చేసేటప్పుడు తప్పక హెల్మెట్‌ వాడాలి. బ్లాస్టింగ్‌లో డిప్లొమా చేసిన నిపుణులు ఉండాలి. పోలీస్, ఫైర్‌శాఖ అనుమతులు పొందాలి. కానీ ఇక్కడ ఏ ఒక్క నిబంధనా పాటించడం లేదు. బోర్లు వేసే రిగ్గు వాహనాలతో 150 నుంచి 200 అడుగుల వరకు గోతులు తవ్వి అమ్మోనియా, జెలిటిన్‌స్టిక్, యూరియా, గంధకం, సాల్టు నింపి బ్లాస్టింగ్‌ చేస్తున్నారు. ప్రమాదకరమైన జెలిటిన్‌స్టిక్‌ వాడటంతో భూమి కంపిస్తోంది. జిల్లాకు చెందిన మంత్రితో మైనింగ్‌ మాఫియాకు బంధుత్వం ఉండటంతో ఎన్నికల సమయంలో నజరానాగా నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో రూ.30 కోట్లు ఫండ్‌గా అందచేసినట్లు చెబుతున్నారు.

రాళ్ల కింద బతుకులు సమాధి
క్వారీల్లో పనిచేసేందుకు ఒడిశా, వైజాగ్, జార్కండ్, చత్తీస్‌ఘడ్‌ ప్రాంతాల నుంచి వేలాది మందిని రప్పిస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొండ రాళ్లు పడి పలువురు కార్మికులు మృతి చెందారు. చనిపోయిన విషయం కూడా వెలుగులోకి రానివ్వకుండా ప్రాణాలకు వెలకట్టి గుట్టుగా మృతదేహాలను తరలిస్తున్నారు. క్వారీల్లో కొత్త వ్యక్తులు కనిపిస్తే బెదిరించి వెళ్లగొడుతున్నారు.

పర్మిట్లు రద్దు చేసినా..
భద్రతా ప్రమాణాలు సక్రమంగా లేకపోవడం, కాలుష్యం కారణంగా పరిటాల సమీపంలోని రాతి క్వారీల్లో పనులు నిలుపుదల చేయాలని కాలుష్య నియంత్రణ మండలి గత నెల 20న ఆదేశాలిచ్చింది. కానీ కంకర తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. దొనబండలో 40 క్వారీలకు పర్మిట్‌లు లేకపోయినా మెటల్‌ను తరలిస్తున్నారు. నిత్యం వే బిల్లులు లేకుండా క్వారీల నుంచి 500 లారీల కంకరను తరలిస్తున్నారు. లారీల బంద్‌ జరుగుతున్నా ఇక్కడ మాత్రం వాహనాలు తిరుగుతున్నాయి. 

వేబిల్లులు లేకుండా తరలిస్తున్నారు...
వే బిల్లుల జారీ నెల రోజుల క్రితమే ఆపేసినా కంకర మాత్రం తరలుతోంది. నిత్యం రిగ్గు బ్లాస్టింగ్‌ పేలుళ్లతో బెంబేలెత్తిపోతున్నాం. భూకంపం వచ్చినట్లుగా కంపిస్తోంది. క్వారీల్లో అక్రమాలపై ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.
– ఎన్‌ అమ్మారావు(గాంధీ), స్థానికుడు, పరిటాల

నోటీసులు ఇచ్చినా ఆగడం లేదు...
రాతి క్వారీల్లో పనులు నిలుపుదల చేయాలని పొల్యూషన్‌ కంట్రోలు బోర్డు ఆదేశించడంతో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చాం. పీసీబీ ఆదేశాలను బేఖాతర్‌ చేస్తూ క్వారీలను నడుపుతున్నారు. క్వారీలను నిలిపేందుకు నాకు ఇబ్బందులున్నాయి.
    – వైఎస్‌ బాబు, మైనింగ్‌ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement