
ఆందోళన కారుడిని అడ్డుకుంటున్న పోలీసులు
రంగారెడ్డి, యాచారం(ఇబ్రహీంపట్నం): ఫార్మా కంపెనీ ఏర్పాటుపై నక్కర్తమేడిపల్లిలో కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం బుధవారం అష్టదిగ్బంధంలో జరిగింది. ప్రతిపక్షాల ఆందోళన, ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని అడ్డుకుంటాయనే నిఘా వర్గాల సమాచారం మేరకు గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి నుంచి నక్కర్తమేడిపల్లి గ్రామాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రతిపక్ష నాయకులు, గట్టిగా ప్రశ్నించే రైతుల కదలికలపై నిఘా పెట్టారు. యాచారం నుంచి నక్కర్తమేడిపల్లి మీదుగా నానక్‌నగర్, తాడిపర్తి వరకు పోలీసులు నిఘా పెట్టారు.
యాచారం మండల కేంద్రంలోని గాండ్లగూడెం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి నక్కర్తమేడిపల్లి గ్రామం రూట్లో వెళ్లే ప్రతి వాహనాన్నీ నిలిపి తనిఖీలు నిర్వహించారు. వారి గుర్తింపు కార్డులు చూసిన తర్వాతే వదిలిపెట్టారు. ఫార్మాసిటీ వద్దని, సంతృప్తికర రీతిలో పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నక్కర్తమేడిపల్లిలో ప్రతిపక్షాలు, రైతులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాయి. వందలాది మంది ర్యాలీగా ప్రజాభిప్రాయ సేకరణ సభకు వెళ్లేందుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. సమావేశానికి స్థానికేతరులు హాజరయ్యారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక దశలో నక్కర్తమేడిపల్లి గ్రామస్తులు మా భూములు పోతున్నాయి, మాకు జరిగే నష్టంపై సమావేశంలో అభిప్రాయం తెలియజేద్దామంటే స్థానికేతరుల పెత్తనం ఏంటని కొందరిని చితకబాదారు. ఉద్రిక్తత పరిస్థితుల నెలకొనడంతో పోలీసులు స్థానికేతరులను పంపించారు.
కలెక్టర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు..
జిల్లా కలెక్టర్ కాన్వాయిను నక్కర్తమేడిపల్లి గ్రామస్తులు మార్గమధ్యలో అడ్డుకున్నారు. పరిహారం ఖరారులో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేస్తూ కాన్వాయికి అడ్డుతగిలారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అరెస్టులు చేయడానికి ప్రయత్నించారు. రైతులను అరెస్టులు చేయడానికి డీసీఎం వాహనం తీసుకురావడంతో మరింత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు కొద్ది సేపు పోలీసులతో తీవ్ర వాగ్వాదాలకు దిగారు. రైతులనే అరెస్టులు చేసి ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం ఎలా నిర్వహిస్తారని మండిపడ్డారు.
స్థానికేతరులతో లొల్లి!
ప్రజాభిప్రాయ సేకరణ సమావేశ ప్రాంగణం పూర్తిగా నిండిపోవడంతో నక్కర్తమేడిపల్లి వాసులు ఆగ్రహానికి గురయ్యారు. స్థానికేతరులను పంపించండి అంటూ సభా వేదిక ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన, ధర్నా నిర్వహించడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
నక్కర్తమేడిపల్లి సర్పంచ్ అరెస్టు
గ్రామస్తులకు మద్దతుగా నిలిచిన నక్కర్తమేడిపల్లి సర్పంచ్ భాషాను పోలీసులు అరెస్టు చేశారు. స్థానికేతరులను సభ నుంచి బయటకు పంపించాలని గ్రామస్తులు డిమాండ్‌కు సర్పంచ్ మద్దతు పలికి ఆందోళనకు దిగడంతో బలవంతంగా అరెస్టు చేసి పోలీసు వాహనంలో ఎక్కించారు. సర్పంచ్‌తో పాటు గ్రామానికి మరో 20 మంది ప్రతిపక్ష నాయకులు, రైతులను అరెస్టు చేసి తాడిపర్తి వైపు తీసుకెళ్లారు. సర్పంచ్‌ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న వాహనం పిల్లిపల్లిలో ఓ వ్యవసాయ బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరి రైతులకు తీవ్ర గాయాలు కాగా కందుకూరు ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా ప్రజాభిప్రాయ సభకు వస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పు భాషాలతో పాటు మరికొంత బీజేపీ శ్రేణులను పోలీసులు కొద్ది సేపు అడ్డుకున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.మధుసూదన్‌రెడ్డి, మరికొంత మంది సీపీఎం శ్రేణులను సైతం అడ్డుకున్నారు. అనంతరం సభా ప్రాంగణంలోకి పంపించారు. ఫార్మాకు అనుకూలంగా కొంతమంది నాయకులు మాట్లాడుతుండగా రైతులు ఫార్మావద్దని నినాదాలు చేశారు. నక్కర్తమేడిపల్లికి చెందిన ఓ యువకుడు ఆందోళన సమయంలో ఓ పోలీస్ అధికారి వద్ద ఉన్న పిస్టల్ లాక్కోని పరుగులు పెట్టాడు. పోలీసులు ఆ యువకుడి వద్ద పిస్టల్‌ను లాక్కున్నారు.
చల్లా ప్రసంగంతో అరుపులు, కేకలు
ఫార్మాసిటీ ఏర్పాటు విధివిధానాలు, రైతులకు పరిహారం, 2013– భూసేకరణ చట్టం, ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఏర్పడే లాభ, నష్టాలపై కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ప్రసంగం అకట్టుకుంది. వంశీచంద్‌రెడ్డి ప్రసంగం చేస్తున్నంత సేపు రైతులు కేకలు, ఈలలేస్తూ మద్దతు పలికారు. హైదరాబాద్ ఫార్మాసిటీ పేరును రంగారెడ్డి ఫార్మాసిటీగా మార్చాలని, అసైన్డ్, పట్టా భూములకు సమాన పరిహారం ఇవ్వాలని చేసిన డిమాండ్‌కు అధికార పక్ష ఎమ్మెల్యేలు, రైతులు మద్దతు పలికారు. ఎమ్మెల్యే ప్రస్తవించిన కొన్ని ప్రశ్నలకు కలెక్టర్ రఘునందన్‌రావు సమాధానాలిచ్చారు. అరగంట సేపు ఆయన ప్రసంగించడంతో అధికార పార్టీ కార్యకర్తలు పలుమార్లు అడ్డు తగిలారు.