సాక్షి, హైదరాబాద్: మురుగునీటి నిర్వహణ నిమిత్తం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్న డబ్బు ఎటుపోతోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పన్నుల వసూలుపై ఉన్న శ్రద్ధ, ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడంలో కూడా చూపాలని, అప్పుడే నీటి వనరులు కాలుష్య రహితంగా ఉంటాయని వెల్లడించింది. రాజకీయ, అర్థ బలానికి అధికార యంత్రాంగం తలొగ్గకుండా బాధ్యతలు నిర్వర్తిస్తే ఎటువంటి సమస్యలు ఉండవంది. చెరువులు, ఇతర నీటి వనరుల్లోకి మురుగు నీరు వదిలే వారిని చట్ట ప్రకారం నియంత్రించే అధికారమున్నా, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బుధవారం హైకోర్టు వాటర్‌బోర్డు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులను నిలదీసింది. చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదని అభిప్రాయపడింది. జంట నగరాల్లోని చెరువుల్లోకి మురుగు నీరు వస్తున్న పాయింట్లను ఎందుకు గుర్తించలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించింది.
ఈ మార్గాలను గుర్తించి మూసివేస్తే తప్ప ప్రయోజనం ఉండదని, వీటిని మూయకుండా ఉంటే చెరువులను శుద్ధి చేసినా ప్రయోజనం ఉండదని తెలిపింది. మురుగు నీటి నిర్వహణ నిమిత్తం ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల డబ్బును సక్రమంగా వినియోగిస్తే మురుగు నీటి సమస్య ఉండదని తెలిపింది. ఈ విషయంలో అధికారులు సమర్పించిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. తాజా చర్యలతో మరో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. చెరువుల్లోకి మురుగు నీరు చేరవేస్తున్న పాయింట్లను గుర్తించేందుకు మరో వారం గడువునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి పరిధిలోని మల్కం చెరువును ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అంజనాసిన్హా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్, మత్స్యకారుడు సుధాకర్‌లు కూడా వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం మరోసారి విచారించింది.
అలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుంది..
భారీ స్థాయిలో నిర్మించే అపార్ట్‌మెంట్లలో మురుగు శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటే సమస్య తీవ్రత చాలా వరకు తగ్గించవచ్చునని విచారణలో కోర్టు అభిప్రాయపడింది. వ్యాపార సముదాయాలు, చిన్న తరహా పరిశ్రమలు కూడా మురుగు నీటి శుద్ధి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాల్సిన అవసరముందని తెలిపింది. బకెట్లలో గణేశ్ విగ్రహాల నిమజ్జనం గురించి ప్రస్తావన రాగా, ఇది చాలా బాగుంటుందని.. అందరూ దీనిని పాటిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వారవుతారని ధర్మాసనం వెల్లడించింది. తాజా వివరాలతో ప్రభుత్వం నివేదిక ఇవ్వాలంటూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
అధికారమున్నా.. చర్యలు సున్నా!
Published Thu, Oct 25 2018 1:34 AM | Last Updated on Thu, Oct 25 2018 1:34 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment