జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో దుర్గం చెరువు వద్ద కొనసాగుతున్న సుందరీకరణ పనులు
సాక్షి,సిటీబ్యూరో : గ్రేటర్ పరిధిలోని చెరువులను దశలవారీగా పరిరక్షించి, సుందర తటాకాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించిన జీహెచ్‌ఎంసీ సమయాభావం, నిధుల కొరత నేపథ్యంలో సదరు పనులను ప్రైవేట్‌కు అప్పగించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పీపీపీ పద్ధతిలో చెరువుల్లోని మురుగునీటిని ప్రక్షాళన చేసి సుందర తటాకాలుగా తీర్చిదిద్దేందుకు ముందుకు వచ్చే సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తారు. పనులు పూర్తి చేసి పిక్నిక్ స్పాట్స్‌గా తీర్చిదిద్దే సంస్థలకే కొన్నేళ్లపాటు నిర్వహణ బాధ్యతలను కూడా అప్పగించడంతోపాటు, అక్కడ ఏర్పాటు చేసే జలక్రీడలు, బోటింగ్, వినోద కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తారు. నిర్ణీత వ్యవధి ముగిశాక తిరిగి అవి జీహెచ్‌ఎంసీ పరమవుతాయి. తద్వారా ఓ వైపు చెరువుల కబ్జాను నిరోధించడంతోపాటు పరిసరాల ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందజేయవచ్చునని భావిస్తున్నారు.
గ్రేటర్ పరిధిలో కబ్జాకు గురైనవి పోను మిగిలిన దాదాపు 170 చెరువులను పిక్నిక్ స్పాట్స్‌గా అభివృద్ధి చేస్తామని జీహెచ్‌ఎంసీ ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు ఆయా చెరువుల్లో గుర్రపుడెక్క పెరిగి దోమల తీవ్రతతో పరిసరాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మునిసిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌కు అందిన ఫిర్యాదుతో సరూర్‌నగర్ చెరువుతోపాటు మరో 10 చెరువులను అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇందుకు అవసరమైన రూ. 287 కోట్ల నిధుల ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేసినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఇందులో మూడు చెరువులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్) కింద అభివృద్ధి చేసేందుకు వివిధ సంస్థలు ముందుకు రావడంతో, వాటికి సంబంధించిన నిధులతో మీరాలం చెరువు, ఉప్పల్ నల్లచెరువు, తదితర చెరువులను అభివృద్ధి చేస్తామని మేయర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని చెరువుల అభివృద్ధికి భారీగా నిధులు కావాల్సి ఉండటం.. పనులు పూర్తిచేసేందుకుసమయం పట్టనుండటంతో పీపీపీ కింద అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చేవారికి అవకాశం కల్పిస్తామన్నారు.
ప్రక్షాళన ఇలా..
చెరువులోని గుర్రపుడెక్క, మురికినీటిని పూర్తిగా తోడేస్తారు. ప్రక్షాళన అనంతరం చెరువులు తిరిగి కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటారు.డ్రైనేజీ లైన్లను దారి మళ్లిస్తారు. ఎస్టీపీలను నిర్మిస్తారు. కేవలం వర్షపునీరు మాత్రమే చెరువులో చేరేలా ఏర్పాటు చేస్తారు.
సుందరీకరణ ఇలా..
చెరువుల కట్టలను పటిష్టం చేయడంతోపాటు చెరువు చుట్టూ వాకింగ్‌ట్రాక్, సైకిల్‌ట్రాక్ ఏర్పాటు చేస్తారు. మొక్కలు పెంచుతారు. పిల్లల ఆటసామాగ్రి, బోటింగ్ సదుపాయాలతో పిక్నిక్‌స్పాట్స్‌గా తీర్చిదిద్దుతారు. కెఫ్‌టేరియా, పార్కింగ్ తదితర సదుపాయాలు కల్పిస్తారు.
ఓయూ రింగ్ రోడ్డుపైనా దృష్టి..
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న మోహిని చెరువును సైతం త్వరలో అభివృద్ధిచేయనున్నారు. ఈ పనులను జీహెచ్‌ఎంసీ స్వయంగా చేపట్టనుంది. దీంతోపాటు ఓయూలోని రహదారి గుండా వాహనాల రాకపోకలను నిరోధించి, ప్రత్యేకంగా ప్రహరీ తదితర ఏర్పాట్లతోపాటు ప్రస్తుతం ఓయూ రోడ్డుగుండా వెళ్తున్నవారు ఆయా ప్రాంతాలకు చేరుకునేందుకు చుట్టూ రింగ్ రోడ్డు నిర్మించాలనే యోచనలోనూ ఉన్నారు. సేకరణ అవసరమైతే.. అక్కడ నివాసాలుంటున్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు.
సదుపాయాలు ఇవీ
1.చెరువు/సరస్సు స్థలం మేరప్రహరీ /ఫెన్సింగ్ ఏర్పాటు.
2. ప్రహరీ లోపల చెరువు ఒడ్డునఅందమైన పచ్చిక, ఫౌంటెన్లుతదితర సుందరీకరణ పనులు.
3. నడక మార్గాల ఏర్పాటు.
4. వివిధ రకాల మొక్కలతో పచ్చదనం .
5. కూర్చునేందుకు బెంచీలు..కుర్చీలు.. తదితర ఏర్పాట్లు.
6. పార్కింగ్ సదుపాయం.
7. రాత్రివేళల్లో ప్రత్యేక లైటింగ్.
8. స్నాక్స్, టీ/కాఫీల కెఫ్టేరియా
9. వాననీరు వెళ్లేందుకు బైపాస్ డ్రెయిన్లు
10. టాయ్‌లెట్లు.. తదితర సదుపాయాలు.
Comments
Please login to add a commentAdd a comment