డైలీ చెక్‌! | Sensor System in Water Purifying Machines in Hyderabad | Sakshi
Sakshi News home page

డైలీ చెక్‌!

Published Thu, Feb 20 2020 8:35 AM | Last Updated on Thu, Feb 20 2020 8:35 AM

Sensor System in Water Purifying Machines in Hyderabad - Sakshi

మురుగు శుద్ధి కేంద్రం

సాక్షి సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలోజలమండలి నిర్వహిస్తున్న 18మురుగుశుద్ధి కేంద్రాల్లో నీటి నాణ్యతను పరిశీలించేందుకు అత్యాధునిక సెన్సర్ల ఏర్పాటుకు వాటర్‌ బోర్డు శ్రీకారంచుట్టింది. ఔటర్‌ పరిధిలో రోజువారీగా వెలువడుతున్న  2800 మిలియన్‌లీటర్ల మురుగు నీటిలో జలమండలి సుమారు 750 మిలియన్‌ లీటర్ల నీటిని 18 మరుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేస్తుంది. అయితే శుద్ధి చేసిన నీటికి సంబంధించి నాణ్యత, రంగు, వాసన, గాఢత, కరిగిన ఘనపదార్థాలు, భార లోహాల ఆనవాళ్లు,రసాయనిక ఆనవాళ్లు , కాఠిన్యత, నీటిలో బురద రేణువుల శాతం, బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్, కెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్,  నీటిలో కరిగిన ఆక్సిజన్‌ శాతం, విద్యుత్‌ వాహకత తదితరాలను సెన్సర్ల ద్వారా పరీక్షించి రోజువారీగా ఆన్‌లైన్‌లో ఖైరతాబాద్‌లోనిజలమండలి ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు నీటిశుద్ధి జరుగుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెన్సర్ల ఏర్పాటుకు ఆసక్తిగల  సంస్థలను జలమండలి ఆన్‌లైన్‌ లో బహిరంగ ప్రకటన ద్వారా ఆహ్వానించింది. ఈ విధానాన్ని ఆన్‌లైన్‌ కంటిన్యూయస్‌  మానిటరింగ్‌ సిస్టం (ఓసీ ఈఎంఎస్‌) గా పిలుస్తారు.  సెన్సర్ల నిర్వహణ బాధ్యతలను సైతం ఐదేళ్ల పాటు సదరు సంస్థలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్‌టీపీలో సెన్సర్ల ఏర్పాటుకు సుమారు రూ.25 లక్షలు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. తుది వ్యయాన్ని ఖరారు చేసేందుకు జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ప్రాజెక్టు, సాంకేతిక  విభాగం డైరెక్టర్లు, ఎస్టీపీ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్, ఐటీ విభాగం జనరల్‌ మేనేజర్, ఎస్టీపీ డివిజన్‌ జీఎంలు ఉంటారు. ఈ విధానం సఫలీకృతం ఐతే సమీప భవిష్యత్‌లో సీవరేజి మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఔటర్‌ పరిధిలో జలమండలి నిర్మించ తలపెట్టిన 65 ఎస్‌టీపీలకు సెన్సర్‌లు ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. 

మురుగు శుద్ధి మహా మాస్టర్‌ ప్లాన్‌..
మహానగరం నలుచెరుగులా ఉన్న గృహ, వాణిజ్య, పారిశ్రామిక వాడల నుంచి నిత్యం వెలువడుతోన్న వ్యర్థజలాలను శుద్ధిచేసేందుకు జలమండలి సీవరేజి మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధంచేసింది. ఈ ప్రణాళికలో ముందుగా నగరం నలుమూలలా నిత్యం 2133 మిలియన్‌ లీటర్ల మురుగు జలాలను శుద్ధిచేసేందుకు 65 చోట్ల మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ)నిర్మించాలని సంకల్పించింది. ఇందుకు ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లతో కలిసి జలమండలి అధికారులు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తిచారు. ఎస్టీపీల నిర్మాణానికి సుమారు రూ.5 వేల కోట్ల వ్యయం అవుతుందని జలమండలి ప్రాథమికంగా అంచనావేసింది. నిర్మాణానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను షా కన్సల్టెన్సీ సంస్థ సిద్ధం చేసింది. ఈ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. మరో మూడు నెలల్లో ఈ పనులకు మోక్షం లభించనుంది.

సాకారం కానున్న మురుగు మాస్టర్‌ప్లాన్‌..
ప్రస్తుతం మహానగరం ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు శరవేగంగా విస్తరించింది. మొత్తంగా 1450 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీవరేజి మాస్టర్‌ప్లాన్‌ అమలుకానుంది. కోటిన్నరకు పైగా జనాభా..లక్షలాది గృహ, వాణిజ్య, సముదాయాలతో అలరారుతోంది. ప్రస్తుతం మహానగరంలో నిత్యం సుమారు 2800 మిలియన్‌ లీటర్ల మురుగుజలాలు ఉత్పన్నమౌతున్నాయి. ఇందులో జలమండలి ప్రస్తుతానికి 750 మిలియన్‌ లీటర్ల వ్యర్థజలాలను శుద్ధిచేసి మూసీలోకి వదిలిపెడుతోంది. మిగతా జలాలు సమీప చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాలు, మూసీని ముంచెత్తుతున్నాయి.  

మురుగు అవస్థలకుచరమగీతం
గ్రేటర్‌ నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఔటర్‌రింగ్‌ రోడ్డు పరిధి వరకు సమగ్ర మురుగునీటి మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేశాం. దీంతో శివారువాసులకు మురుగునీటి అవస్థలు తప్పనున్నాయి. ఎస్‌టీపీలకు సెన్సర్ల ఏర్పాటు ద్వారా నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించి శుద్ధిచేసిన నీటిని గార్డెనింగ్, పారిశ్రామిక, నిర్మాణరంగ అవసరాలకు వినియోగించేందుకు అవకాశముంటుంది. గ్రేటర్‌లో పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణం పెంపొందించడం, మూసీతోపాటు చెరువులు, కుంటలు తదితర విలువైన జలవనరులు కాలుష్యం బారిన పడకుండా కాపాడవచ్చు.   – ఎం.దానకిశోర్,    జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement