సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఏటీఎంలలో డబ్బులు తీసుకుంటారు. కానీ నగరానికి ఆనుకుని ఉన్న కనకపురలో నీళ్లు తీసుకోవచ్చు. ఇదేదో అద్భుతం కాదు కానీ, గ్రామీణులకు స్వచ్ఛమైన నీటిని అందించే ఈ ప్రయత్నాన్ని అభినందించక తప్పదు. డాలర్ ముందు రూపాయి రోజు రోజుకు చిన్నబోతున్నా, అదే రూపాయితో పది లీటర్ల మినరల్ వాటర్‌ను ఎంచక్కా పట్టుకోవచ్చు. పైగా ఈ నీటి కోసం చాంతాడంత క్యూలలో నిల్చుకోవాల్సిన అవసరం లేదు. మిషన్‌లో రూపాయి వేసి, పది లీటర్ల నీటిని కింద పట్టుకోవచ్చు.
అందుకే కనకపుర వాసులు వీటిని వాటర్ ఏటీఎంలని అంటున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డీకే. శివకుమార్, ఇటీవల లోక్‌సభ ఉప ఎన్నికలో గెలిచిన ఆయన సోదరుడు సురేశ్ కలసి కనకపుర నియోజక వర్గంలో ఇలాంటి 33 నీటి కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి రూ.13 లక్షల వరకు ఖర్చయింది. కరువు కారణంగా కనకపురలో నీటి మట్టం 1,300 అడుగుల లోతుకు పడిపోయింది. ఉప ఎన్నికలకు ముందే సురేశ్ వీటి ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ‘నీటి నాణ్యత చాలా బాగుంది. నిన్నటి వరకు మేము బోరు నీటిని తాగేవారం. ఆ నీరు కలుషితమైనదే కాకుండా చాలా కఠినంగా కూడా ఉండేది.
మా కుటుంబంలో అయిదు మంది ఉన్నాం. వంటకు, తాగడానికి రోజుకు 20 లీటర్ల నీరు అవసరమవుతుంది’ అని జయమ్మ అనే కార్మికురాలు పేర్కొన్నారు. ఆమె ఓ పెద్ద పాత్రను తీసుకొచ్చి ఓ కియోస్క్‌లో రెండు రూపాయి నాణేలు వేసి 20 లీటర్ల నీటిని పట్టుకెళ్లింది. శివకుమార్ ఏమంటారంటే...‘ప్రధాని, ముఖ్యమంత్రి, ఇతర నాయకులు మినరల్ వాటర్ తాగ గలుగుతున్నప్పుడు, పేదలు ఎందుకు తాగకూడదు. అందుకనే...ఈ నీటి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసి, బీపీఎల్ కుటుంబాలకు శుద్ధమైన నీటని అందిస్తున్నాం’.
నీటికీ ఏటీఎంలు..!
Published Thu, Sep 5 2013 6:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement
Advertisement