స్వచ్ఛత మనకు అందని మానిపండు.. | World Water Quality Index India Got 120th Rank | Sakshi
Sakshi News home page

స్వచ్ఛత మనకు అందని మానిపండు..

Published Sun, Nov 29 2020 8:48 AM | Last Updated on Sun, Nov 29 2020 10:01 AM

World Water Quality Index India Got 120th Rank - Sakshi

‘స్వచ్ఛ’భారతంలో స్వచ్ఛత ఒక దేవతావస్త్రం. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం తినే తిండి–ఎందులో చూసినా స్వచ్ఛత మనకు అందని మానిపండు. ప్రపంచ జల నాణ్యత సూచిలో మన దేశం అట్టడుగు నుంచి మూడోస్థానంలో ఉంది. మొత్తం 122 దేశాలతో కూడిన ఈ జాబితాలోమనది 120వ స్థానం. మన దేశంలో మనం తాగే నీటి తీరుతెన్నులపై ఒక సంక్షిప్త పరిశీలన.

మన దేశంలో తాగేనీటి కోసం జనాలు అనుదినం అగచాట్లు పడుతూనే ఉన్నారు. నానా తంటాలు పడి తెచ్చుకున్న నీటితో దాహం తీర్చుకుంటే, ఆ నీటిలో స్వచ్ఛత కొరవడి వ్యాధుల బారిన పడుతున్నారు. మన దేశంలోని ఉపరితల, భూగర్భ జలాల్లో దాదాపు 70 శాతం కలుషిత జలాలే. దేశంలోనే అతిపెద్దదైన గంగానది సహా దేశంలోని నదుల నీటిలో విషపూరితమైన ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, రాగి, ఇనుము, పాదరసం, సీసం వంటి భారలోహాలు చేరుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. దేశంలోని చాలాచోట్ల నీటి లభ్యతే అంతంత మాత్రం. ఇక దొరికే నీటిలో చాలా వరకు కలుషితమైనదే కావడంతో నీటికాలుష్యం ప్రజారోగ్య సమస్యగా మారింది. దేశంలోని నదీపరివాహక ప్రాంతాల్లోని గ్రామీణ ప్రజలు చాలామంది నదుల నుంచి సేకరించిన నీటిని నేరుగా తాగునీటిగా ఉపయోగించే పరిస్థితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మన నదుల పరిస్థితి
కేంద్ర జల మండలి పరిశోధనలో తేలిన అంశాల ప్రకారం దేశంలోని ప్రధానమైన నదులేవీ కాలుష్యానికి అతీతంగా లేవు. గంగానదీ జలాల్లో ఐదు ప్రమాదకరమైన భార లోహాలు– క్రోమియం, రాగి, నికెల్, సీసం, ఇనుము పరిమితికి మించి చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. గంగానది సహా దేశంలోని 42 నదులలోని నీరు అత్యంత తీవ్రస్థాయిలో కలుషితమైనట్లు కేంద్ర జలమండలి నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఈ నదుల నీటిలో పరిమితికి మించి ప్రమాదకరమైన భార లోహాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. యమున, గోమతి, అర్కావతి, ఓర్సంగ్, సబర్మతి, సరయు, రాప్తి, వైతరణి, గోదావరి, కావేరి, పెన్నా, నర్మద, తీస్తా, మహానది, బ్రహ్మపుత్ర, సువర్ణరేఖ, నాగావళి వంటి నదులలో సైతం ఈ భార లోహాలు పరిమితికి మించి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. కాలుష్య కాసారాలుగా మారిన ఈ నదుల పరివాహక ప్రాంతాల్లోని సాగుభూముల్లోకి, వాటి ద్వారా తిండిగింజల్లోకి, ఇతర ఆహార పంటల్లోకి ఈ విషపదార్థాలు ప్రమాదకరమైన స్థాయిలో చేరుతున్నాయి. కలుషితమైన నీటి కారణంగా మనం తినే తిండి కూడా కలుషితమవుతోంది. గనులు, తోలు, రబ్బర్, వ్యవసాయంలో మోతాదుకు మించి వాడే పురుగుమందులు, ఎరువులు, నదుల్లో పడవేసే ఘన వ్యర్థాలు వంటివన్నీ ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్వహించిన అధ్యయనం ప్రకారం– దేశవ్యాప్తంగా 3,119 పట్టణాలు, నగరాలలో, కేవలం 209 పట్టణాలు, నగరాలలో వ్యర్థజాలాలను శుద్ధి చేసే సౌకర్యాలు పాక్షికంగా ఉన్నాయి. కేవలం 8 నగరాల్లో మాత్రమే వ్యర్థజలాలను శుద్ధి చేసే సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. దేశంలోని 114 నగరాలు శుద్ధి చేయని వ్యర్థజలాలను, సగం కాలిన శవాలను నేరుగా గంగా నదిలోకి వదిలేస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ప్రతిరోజూ 3835.4 కోట్ల లీటర్ల మురుగు నీరు విడుదలవుతోంది. ఈ నగరాల మురుగునీటి శుద్ధి సామర్థ్యం రోజుకు 1178.6 కోట్ల లీటర్లు మాత్రమే. మిగిలిన మురుగునీరంతా ఆయా నగరాలకు సమీపంలోని నదులకు, ఇతర జలాశయాలకు నేరుగా చేరుకుంటోంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని 28 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడానికి 1429 కేంద్రాలను నెలకొల్పాయి. ఈ కేంద్రాలు దేశంలోని 293 నదులు, 94 సరస్సులు, 94 జలాశయాలు, 23 కాలువలు, 18 డ్రైనేజీలు, 411 బావులలోని నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా, మన దేశం నీటి నాణ్యత విషయంలో ఇంకా అట్టడుగు స్థానాల్లోనే కొనసాగుతుండటం గమనార్హం.

ప్రమాదకర స్థాయిలో బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌
దేశంలోని నగరాలు, పట్టణాల వద్ద ప్రవహించే నదీ ప్రాంతాల్లో నీటిలో బయెకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీఓడీ) అతి ఎక్కువగా, అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు సేకరించి, పరీక్షించిన శాంపుల్స్‌ ద్వారా వెల్లడైంది. నీటిలో ప్రతి లీటరుకు బీఓడీ 1–2 మిల్లీగ్రాముల వరకు ఉంటే ఆ నీరు పూర్తిగా స్వచ్ఛమైనది. బీఓడీ ప్రతి లీటరుకు 3–8 మిల్లీగ్రాముల మధ్య ఉంటే, నీరు ఒక మోస్తరు స్వచ్ఛమైనది. బీఓడీ లీటరుకు 8–20 మిల్లీగ్రాముల వరకు ఉంటే, ఆ నీరు ప్రమాదానికి చేరువలో ఉన్నట్లు లెక్క. నీటిలో బీఓడీ ప్రతి లీటరుకు 20 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఆ నీరు పూర్తిగా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లే లెక్క. బీఓడీ మోతాదు పెరిగే కొద్ది ఆ నీటిలో జలచరాల మనుగడ సాగించడం కష్టమవుతుంది. నీటిలో బీఓడీ పెరుగుదల కారణంగా జలచరాలకు ముప్పు వాటిల్లుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొన్ని ప్రధానమైన నదుల్లో కోలిఫార్మ్‌ బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. గంగ, యమున, గోమతి, ఘాఘరా, చంబల్, మహి, వార్ధా, గోదావరి జలాల్లో కోలిఫార్మ్‌ బ్యాక్టీరియా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు నీటి నాణ్యత కేంద్రాల పరిశీలనలో తేలింది. 

నీటి కాలుష్యంతో తీవ్ర నష్టం
దేశంలో పట్టణీకరణ పెరుగుతున్న కొద్ది నీటి వనరుల కాలుష్యం పెరుగుతూ వస్తోంది. ప్రతిరోజూ దాదాపు నాలుగు కోట్ల లీటర్ల వ్యర్థజలాలు నదుల్లోకి, ఇతర జలాశయాల్లోకి చేరుతున్నాయి. మన దేశంలోని నదుల ఎగువ ప్రాంతాల్లో కాలుష్యం పెరిగే కొద్ది దిగువ ప్రాంతాలకు ఆర్థిక నష్టం పెరుగుతూ వస్తోందని, ఫలితంగా ఈ ప్రాంతాల్లోని స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మూడింట ఒకవంతు పడిపోతోందని ప్రపంచ బ్యాంకు ఒక అధ్యయనంలో తెలిపింది. నదుల దిగువ ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా వ్యవసాయ దిగుబడులకు 16 శాతం వరకు, వ్యవసాయ ఆదాయానికి 9 శాతం వరకు నష్టం వాటిల్లుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం నీటి కాలుష్యం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా రూ.61 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. అంతేకాదు, నీటి కాలుష్యం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో దేశంలో ఏటా సుమారు నాలుగు లక్షల వరకు అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మరణాలు ‘కరోనా’ మహమ్మారి కారణంగా సంభవించిన మరణాల కంటే చాలా ఎక్కువ. ‘కలుషితమైన నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తుండటం వల్ల రైతులు నానా సమస్యలను ఎదుర్కొంటున్నారు. కలుషితమైన నీటి వల్ల మట్టి, అందులో పండే పంటలు కూడా కలుషితమవుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం’ అని సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌’ (సీఈఈడబ్ల్యూ) శాస్త్రవేత్త సుమిత్‌కుమార్‌ గౌతమ్‌ అభిప్రాయపడుతున్నారు.
 
నీటిలో చేరిన రసాయనాల కారణంగా ఏర్పడుతున్న కాలుష్యం ఒక ఎత్తయితే, నదీతీరాలు ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రత లోపం, జంతు కళేబరాలను, పాడైన ఆహార వ్యర్థాలను యథేచ్ఛగా నదుల్లో పడేస్తూ ఉండటం తదితర కారణాల వల్ల నదుల నుంచి సరఫరా అయ్యే తాగునీటిలో సూక్ష్మజీవుల ఉధృతి పెరుగుతోంది. రక్షిత మంచినీటి సరఫరా లేని ప్రాంతాల్లోని వారు అపరిశుభ్రమైన పరిసరాల్లోని నదులు, చెరువులు, బావుల నీటినే తాగడానికి ఉపయోగిస్తుండటం వల్ల రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. నీటి నుంచి వ్యాపించే సూక్ష్మజీవుల వల్ల తలెత్తే డయేరియా, కలరా, డీసెంట్రీ, అమీబియాసిస్, ఫైలేరియా, హెపటైటిస్, టైఫాయిడ్‌ వంటి వ్యాధులతో దేశంలో ఏటా 3.77 కోట్ల మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధుల కారణంగా ఏటా దాదాపు 15 లక్షల మంది చిన్నారులు అకాల మరణాల పాలవుతున్నారు. 

ఫ్లోరైడ్‌ ప్రభావం మరో సమస్య
ఉపరితల జలాలు భార లోహాలు, సూక్ష్మజీవుల కారణంగా కలుషితమవుతుంటే, దేశంలోని పలు చోట్ల భూగర్భ జలాలు మోతాదుకు మించిన ఫ్లోరైడ్‌తో ప్రజారోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. దేశంలోని 19 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరిన్‌ మోతాదుకు మించి ఉన్నట్లు వివిధ అధ్యయనాల్లో తేలింది. ఈ ప్రాంతాల్లో దాదాపు 2.50 కోట్ల మందికి పైగా ప్రజలు మోతాదుకు మించిన ఫ్లోరైడ్‌ నిండిన నీటిని తాగడం వల్ల ఫ్లోరోసిస్‌ ముప్పు అంచున మనుగడ సాగిస్తున్నారు.  బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) నీటిలో ఫ్లోరిన్‌ పరిమాణం ప్రతి లీటరుకు 1.0–1.5 మిల్లీగ్రాముల వరకు ఉండాలి. ఈ పరిమాణం కంటే తగ్గినా, పెరిగినా ఇబ్బందేనని తొలిసారిగా 1938లో అమెరికాలోని మెలాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్త గెరాల్డ్‌ కాక్స్‌ గుర్తించారు. నీటిలో తగిన మోతాదులో ఉండే ఫ్లోరిన్‌ దంతక్షయాన్ని నివారిస్తుంది. మోతాదుకు మించితే ఫ్లోరోసిస్‌ జబ్బుకు దారితీస్తుంది. ఈ జబ్బు బారిన పడిన వారిలో దంతాలపై మచ్చలు, ఎముకలు వంకర్లు  పోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది మామూలుగా నడవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. నీటిలో ఫ్లోరిన్‌ మోతాదు ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్‌తో పాటు ఆస్టియోపొరాసిస్, ఆర్థరైటిస్, ఎముకలు పెళుసుబారడం, కేన్సర్, మెదడు లోపాలు, అల్జీమర్స్‌ వ్యాధి, థైరాయిడ్‌ సమస్యలు కూడా తలెత్తుతాయి.

దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లోని భూగర్భ జలాల్లో ఫ్లోరిన్‌ కాలుష్యం అత్యధికంగా ఉంటోంది. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరిన్‌ కాలుష్యం మోతాదుకు మించి ఉంటోంది. ఫ్లోరిన్‌ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కొన్ని ప్రాంతాల్లో సత్ఫలితాలను ఇస్తున్నాయి. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఇదివరకు ఫ్లోరోసిస్‌ తీవ్రత ఎక్కువగా ఉండేది. గడచిన ఐదేళ్లలో ఈ ప్రాంతంలో కొత్త ఫ్లోరోసిస్‌ కేసులేవీ నమోదు కాలేదు. 

ఇటుకల బట్టీలు, అల్యూమినియం, ఉక్కు కర్మాగారాలు, ఫాస్ఫేట్‌ ఎరువుల కర్మాగారాలకు చెందిన వ్యర్థాలను భూమిలో లోతైన గోతులను తవ్వి, వాటిలో పారవేస్తుంటాయి. వీటి వల్ల పరిసరాల్లోని భూగర్భ జలాల్లో రసాయనిక కాలుష్యం ఏర్పడుతోంది. కొన్ని రకాల ఫాస్ఫేట్‌ ఎరువుల కర్మాగారాల వ్యర్థాలు భూగర్భంలో చేరుతుండటం వల్ల భూగర్భ జలాల్లో ఫ్లోరిన్‌ పరిమాణం మోతాదుకు మించి చేరుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 70 శాతం జనాభాకు మంచినీరు కొళాయిల ద్వారా సరఫరా అవుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో 18.4 శాతం జనాభాకు మాత్రమే కొళాయిల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోంది. కొళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీటి నాణ్యతపై కూడా పలుచోట్ల ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. చిట్లిపోయిన పైపుల్లోకి మురుగునీరు చేరడంతో కొన్ని చోట్ల కొళాయిల ద్వారా మురుగునీరు సరఫరా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, మంచినీటి పైపుల్లోకి మురుగునీరు చేరకుండా డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, నదులలోకి ఘన వ్యర్థాలు చేరకుండా అరికట్టడం వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపడితే తప్ప మన దేశంలోని నీటి నాణ్యత మెరుగుపడే పరిస్థితులు కనిపించడం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement