Water purification
-
మునక్కాడల గింజలతో వాటర్ ప్యూరిఫికేషన్.. ఎలా చేయాలి?
-
స్వచ్ఛత మనకు అందని మానిపండు..
‘స్వచ్ఛ’భారతంలో స్వచ్ఛత ఒక దేవతావస్త్రం. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం తినే తిండి–ఎందులో చూసినా స్వచ్ఛత మనకు అందని మానిపండు. ప్రపంచ జల నాణ్యత సూచిలో మన దేశం అట్టడుగు నుంచి మూడోస్థానంలో ఉంది. మొత్తం 122 దేశాలతో కూడిన ఈ జాబితాలోమనది 120వ స్థానం. మన దేశంలో మనం తాగే నీటి తీరుతెన్నులపై ఒక సంక్షిప్త పరిశీలన. మన దేశంలో తాగేనీటి కోసం జనాలు అనుదినం అగచాట్లు పడుతూనే ఉన్నారు. నానా తంటాలు పడి తెచ్చుకున్న నీటితో దాహం తీర్చుకుంటే, ఆ నీటిలో స్వచ్ఛత కొరవడి వ్యాధుల బారిన పడుతున్నారు. మన దేశంలోని ఉపరితల, భూగర్భ జలాల్లో దాదాపు 70 శాతం కలుషిత జలాలే. దేశంలోనే అతిపెద్దదైన గంగానది సహా దేశంలోని నదుల నీటిలో విషపూరితమైన ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, రాగి, ఇనుము, పాదరసం, సీసం వంటి భారలోహాలు చేరుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. దేశంలోని చాలాచోట్ల నీటి లభ్యతే అంతంత మాత్రం. ఇక దొరికే నీటిలో చాలా వరకు కలుషితమైనదే కావడంతో నీటికాలుష్యం ప్రజారోగ్య సమస్యగా మారింది. దేశంలోని నదీపరివాహక ప్రాంతాల్లోని గ్రామీణ ప్రజలు చాలామంది నదుల నుంచి సేకరించిన నీటిని నేరుగా తాగునీటిగా ఉపయోగించే పరిస్థితులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మన నదుల పరిస్థితి కేంద్ర జల మండలి పరిశోధనలో తేలిన అంశాల ప్రకారం దేశంలోని ప్రధానమైన నదులేవీ కాలుష్యానికి అతీతంగా లేవు. గంగానదీ జలాల్లో ఐదు ప్రమాదకరమైన భార లోహాలు– క్రోమియం, రాగి, నికెల్, సీసం, ఇనుము పరిమితికి మించి చాలా రెట్లు ఎక్కువగా ఉన్నాయి. గంగానది సహా దేశంలోని 42 నదులలోని నీరు అత్యంత తీవ్రస్థాయిలో కలుషితమైనట్లు కేంద్ర జలమండలి నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఈ నదుల నీటిలో పరిమితికి మించి ప్రమాదకరమైన భార లోహాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని ఈ పరిశోధనలో వెల్లడైంది. యమున, గోమతి, అర్కావతి, ఓర్సంగ్, సబర్మతి, సరయు, రాప్తి, వైతరణి, గోదావరి, కావేరి, పెన్నా, నర్మద, తీస్తా, మహానది, బ్రహ్మపుత్ర, సువర్ణరేఖ, నాగావళి వంటి నదులలో సైతం ఈ భార లోహాలు పరిమితికి మించి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. కాలుష్య కాసారాలుగా మారిన ఈ నదుల పరివాహక ప్రాంతాల్లోని సాగుభూముల్లోకి, వాటి ద్వారా తిండిగింజల్లోకి, ఇతర ఆహార పంటల్లోకి ఈ విషపదార్థాలు ప్రమాదకరమైన స్థాయిలో చేరుతున్నాయి. కలుషితమైన నీటి కారణంగా మనం తినే తిండి కూడా కలుషితమవుతోంది. గనులు, తోలు, రబ్బర్, వ్యవసాయంలో మోతాదుకు మించి వాడే పురుగుమందులు, ఎరువులు, నదుల్లో పడవేసే ఘన వ్యర్థాలు వంటివన్నీ ఈ కాలుష్యానికి కారణమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్వహించిన అధ్యయనం ప్రకారం– దేశవ్యాప్తంగా 3,119 పట్టణాలు, నగరాలలో, కేవలం 209 పట్టణాలు, నగరాలలో వ్యర్థజాలాలను శుద్ధి చేసే సౌకర్యాలు పాక్షికంగా ఉన్నాయి. కేవలం 8 నగరాల్లో మాత్రమే వ్యర్థజలాలను శుద్ధి చేసే సౌకర్యాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. దేశంలోని 114 నగరాలు శుద్ధి చేయని వ్యర్థజలాలను, సగం కాలిన శవాలను నేరుగా గంగా నదిలోకి వదిలేస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ప్రతిరోజూ 3835.4 కోట్ల లీటర్ల మురుగు నీరు విడుదలవుతోంది. ఈ నగరాల మురుగునీటి శుద్ధి సామర్థ్యం రోజుకు 1178.6 కోట్ల లీటర్లు మాత్రమే. మిగిలిన మురుగునీరంతా ఆయా నగరాలకు సమీపంలోని నదులకు, ఇతర జలాశయాలకు నేరుగా చేరుకుంటోంది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని 28 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించడానికి 1429 కేంద్రాలను నెలకొల్పాయి. ఈ కేంద్రాలు దేశంలోని 293 నదులు, 94 సరస్సులు, 94 జలాశయాలు, 23 కాలువలు, 18 డ్రైనేజీలు, 411 బావులలోని నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా, మన దేశం నీటి నాణ్యత విషయంలో ఇంకా అట్టడుగు స్థానాల్లోనే కొనసాగుతుండటం గమనార్హం. ప్రమాదకర స్థాయిలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ దేశంలోని నగరాలు, పట్టణాల వద్ద ప్రవహించే నదీ ప్రాంతాల్లో నీటిలో బయెకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) అతి ఎక్కువగా, అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు సేకరించి, పరీక్షించిన శాంపుల్స్ ద్వారా వెల్లడైంది. నీటిలో ప్రతి లీటరుకు బీఓడీ 1–2 మిల్లీగ్రాముల వరకు ఉంటే ఆ నీరు పూర్తిగా స్వచ్ఛమైనది. బీఓడీ ప్రతి లీటరుకు 3–8 మిల్లీగ్రాముల మధ్య ఉంటే, నీరు ఒక మోస్తరు స్వచ్ఛమైనది. బీఓడీ లీటరుకు 8–20 మిల్లీగ్రాముల వరకు ఉంటే, ఆ నీరు ప్రమాదానికి చేరువలో ఉన్నట్లు లెక్క. నీటిలో బీఓడీ ప్రతి లీటరుకు 20 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ఆ నీరు పూర్తిగా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లే లెక్క. బీఓడీ మోతాదు పెరిగే కొద్ది ఆ నీటిలో జలచరాల మనుగడ సాగించడం కష్టమవుతుంది. నీటిలో బీఓడీ పెరుగుదల కారణంగా జలచరాలకు ముప్పు వాటిల్లుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొన్ని ప్రధానమైన నదుల్లో కోలిఫార్మ్ బ్యాక్టీరియా ప్రమాదకర స్థాయిలో ఉంటోంది. గంగ, యమున, గోమతి, ఘాఘరా, చంబల్, మహి, వార్ధా, గోదావరి జలాల్లో కోలిఫార్మ్ బ్యాక్టీరియా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నట్లు నీటి నాణ్యత కేంద్రాల పరిశీలనలో తేలింది. నీటి కాలుష్యంతో తీవ్ర నష్టం దేశంలో పట్టణీకరణ పెరుగుతున్న కొద్ది నీటి వనరుల కాలుష్యం పెరుగుతూ వస్తోంది. ప్రతిరోజూ దాదాపు నాలుగు కోట్ల లీటర్ల వ్యర్థజలాలు నదుల్లోకి, ఇతర జలాశయాల్లోకి చేరుతున్నాయి. మన దేశంలోని నదుల ఎగువ ప్రాంతాల్లో కాలుష్యం పెరిగే కొద్ది దిగువ ప్రాంతాలకు ఆర్థిక నష్టం పెరుగుతూ వస్తోందని, ఫలితంగా ఈ ప్రాంతాల్లోని స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు మూడింట ఒకవంతు పడిపోతోందని ప్రపంచ బ్యాంకు ఒక అధ్యయనంలో తెలిపింది. నదుల దిగువ ప్రాంతాల్లో కాలుష్యం కారణంగా వ్యవసాయ దిగుబడులకు 16 శాతం వరకు, వ్యవసాయ ఆదాయానికి 9 శాతం వరకు నష్టం వాటిల్లుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం నీటి కాలుష్యం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏటా రూ.61 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లుతోంది. అంతేకాదు, నీటి కాలుష్యం వల్ల తలెత్తే ఆరోగ్య సమస్యలతో దేశంలో ఏటా సుమారు నాలుగు లక్షల వరకు అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ మరణాలు ‘కరోనా’ మహమ్మారి కారణంగా సంభవించిన మరణాల కంటే చాలా ఎక్కువ. ‘కలుషితమైన నీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తుండటం వల్ల రైతులు నానా సమస్యలను ఎదుర్కొంటున్నారు. కలుషితమైన నీటి వల్ల మట్టి, అందులో పండే పంటలు కూడా కలుషితమవుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన పరిణామం’ అని సెంటర్ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’ (సీఈఈడబ్ల్యూ) శాస్త్రవేత్త సుమిత్‌కుమార్ గౌతమ్ అభిప్రాయపడుతున్నారు. నీటిలో చేరిన రసాయనాల కారణంగా ఏర్పడుతున్న కాలుష్యం ఒక ఎత్తయితే, నదీతీరాలు ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రత లోపం, జంతు కళేబరాలను, పాడైన ఆహార వ్యర్థాలను యథేచ్ఛగా నదుల్లో పడేస్తూ ఉండటం తదితర కారణాల వల్ల నదుల నుంచి సరఫరా అయ్యే తాగునీటిలో సూక్ష్మజీవుల ఉధృతి పెరుగుతోంది. రక్షిత మంచినీటి సరఫరా లేని ప్రాంతాల్లోని వారు అపరిశుభ్రమైన పరిసరాల్లోని నదులు, చెరువులు, బావుల నీటినే తాగడానికి ఉపయోగిస్తుండటం వల్ల రకరకాల వ్యాధులకు గురవుతున్నారు. నీటి నుంచి వ్యాపించే సూక్ష్మజీవుల వల్ల తలెత్తే డయేరియా, కలరా, డీసెంట్రీ, అమీబియాసిస్, ఫైలేరియా, హెపటైటిస్, టైఫాయిడ్ వంటి వ్యాధులతో దేశంలో ఏటా 3.77 కోట్ల మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధుల కారణంగా ఏటా దాదాపు 15 లక్షల మంది చిన్నారులు అకాల మరణాల పాలవుతున్నారు. ఫ్లోరైడ్ ప్రభావం మరో సమస్య ఉపరితల జలాలు భార లోహాలు, సూక్ష్మజీవుల కారణంగా కలుషితమవుతుంటే, దేశంలోని పలు చోట్ల భూగర్భ జలాలు మోతాదుకు మించిన ఫ్లోరైడ్‌తో ప్రజారోగ్యాన్ని కుదేలు చేస్తున్నాయి. దేశంలోని 19 రాష్ట్రాల్లోని 230 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ మోతాదుకు మించి ఉన్నట్లు వివిధ అధ్యయనాల్లో తేలింది. ఈ ప్రాంతాల్లో దాదాపు 2.50 కోట్ల మందికి పైగా ప్రజలు మోతాదుకు మించిన ఫ్లోరైడ్ నిండిన నీటిని తాగడం వల్ల ఫ్లోరోసిస్ ముప్పు అంచున మనుగడ సాగిస్తున్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నీటిలో ఫ్లోరిన్ పరిమాణం ప్రతి లీటరుకు 1.0–1.5 మిల్లీగ్రాముల వరకు ఉండాలి. ఈ పరిమాణం కంటే తగ్గినా, పెరిగినా ఇబ్బందేనని తొలిసారిగా 1938లో అమెరికాలోని మెలాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్త గెరాల్డ్ కాక్స్ గుర్తించారు. నీటిలో తగిన మోతాదులో ఉండే ఫ్లోరిన్ దంతక్షయాన్ని నివారిస్తుంది. మోతాదుకు మించితే ఫ్లోరోసిస్ జబ్బుకు దారితీస్తుంది. ఈ జబ్బు బారిన పడిన వారిలో దంతాలపై మచ్చలు, ఎముకలు వంకర్లు పోవడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది మామూలుగా నడవడానికి కూడా ఇబ్బంది కలుగుతుంది. నీటిలో ఫ్లోరిన్ మోతాదు ఎక్కువగా ఉంటే ఫ్లోరోసిస్‌తో పాటు ఆస్టియోపొరాసిస్, ఆర్థరైటిస్, ఎముకలు పెళుసుబారడం, కేన్సర్, మెదడు లోపాలు, అల్జీమర్స్ వ్యాధి, థైరాయిడ్ సమస్యలు కూడా తలెత్తుతాయి. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లోని భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ కాలుష్యం అత్యధికంగా ఉంటోంది. బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ కాలుష్యం మోతాదుకు మించి ఉంటోంది. ఫ్లోరిన్ కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు కొన్ని ప్రాంతాల్లో సత్ఫలితాలను ఇస్తున్నాయి. తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ఇదివరకు ఫ్లోరోసిస్ తీవ్రత ఎక్కువగా ఉండేది. గడచిన ఐదేళ్లలో ఈ ప్రాంతంలో కొత్త ఫ్లోరోసిస్ కేసులేవీ నమోదు కాలేదు. ఇటుకల బట్టీలు, అల్యూమినియం, ఉక్కు కర్మాగారాలు, ఫాస్ఫేట్ ఎరువుల కర్మాగారాలకు చెందిన వ్యర్థాలను భూమిలో లోతైన గోతులను తవ్వి, వాటిలో పారవేస్తుంటాయి. వీటి వల్ల పరిసరాల్లోని భూగర్భ జలాల్లో రసాయనిక కాలుష్యం ఏర్పడుతోంది. కొన్ని రకాల ఫాస్ఫేట్ ఎరువుల కర్మాగారాల వ్యర్థాలు భూగర్భంలో చేరుతుండటం వల్ల భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ పరిమాణం మోతాదుకు మించి చేరుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 70 శాతం జనాభాకు మంచినీరు కొళాయిల ద్వారా సరఫరా అవుతుంటే, గ్రామీణ ప్రాంతాల్లో 18.4 శాతం జనాభాకు మాత్రమే కొళాయిల ద్వారా మంచినీటి సరఫరా జరుగుతోంది. కొళాయిల ద్వారా సరఫరా అవుతున్న మంచినీటి నాణ్యతపై కూడా పలుచోట్ల ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. చిట్లిపోయిన పైపుల్లోకి మురుగునీరు చేరడంతో కొన్ని చోట్ల కొళాయిల ద్వారా మురుగునీరు సరఫరా అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, మంచినీటి పైపుల్లోకి మురుగునీరు చేరకుండా డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం, నదులలోకి ఘన వ్యర్థాలు చేరకుండా అరికట్టడం వంటి చర్యలను కట్టుదిట్టంగా చేపడితే తప్ప మన దేశంలోని నీటి నాణ్యత మెరుగుపడే పరిస్థితులు కనిపించడం లేదు. -
నీటి శుద్ధికి బ్యాక్టీరియా...
వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ముల్లును ముల్లుతోనే తీయాలి. ఈ మాటలు చాలాసార్లు మనం వినే ఉంటాం. అయితే నీటిని శుద్ధి చేసేందుకు బ్యాక్టీరియాలను ఉపయోగించవచ్చునన్న ఆలోచన మాత్రం వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసి చూపారు. బ్యాక్టీరియా కారణంగా నీరు కలుషితమవుతుందిగానీ.. శుద్ధి ఎలా జరుగుతుందని ఆలోచిస్తున్నారా? చాలా సింపుల్ అంటున్నారు సింగమనేని శ్రీకాంత్. మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసరైన ఈయన తన విద్యార్థులతో కలిసి బ్యాక్టీరియాతో నిర్మితమైన ఓ ఫిల్టర్‌ను తయారు చేశారు. ఈ ఫిల్టర్‌లో గ్రాఫీన్ ఆౖMð్సడ్, బ్యాక్టీరియల్ నానో సెల్యులోజ్ ఉంటాయి. నీటి శుద్ధీకరణకు వాడే సాధారణ ఫిల్టర్లలో బ్యాక్టీరియా చేరడం వల్ల కొద్దోగొప్పో దుర్వాసన వేస్తూంటాయన్నది మనకు అనుభవమైన విషయం. కానీ కొత్త ఫిల్టర్‌లో మాత్రం ఈ సమస్య ఉండదు. శ్రీకాంత్ గతంలోనూ ఇలాంటి ఫిల్టర్లను బంగారు నానోకణాల సాయంతో చేసినప్పటికీ చౌకైన ప్రత్యామ్నాయం కోసం జరిగిన ప్రయత్నాల్లో గ్రాఫీన్ ఆక్సైడ్, బ్యాక్టీరియా ఫిల్టర్ సిద్ధమైంది. గ్రాఫీన్ ఆక్సైడ్ కారణంగా ఫిల్టర్ సూర్యరశ్మితో వేడెక్కుతుందని, అది చుట్టూ ఉన్న నీటిలోకి ప్రవేశించడం ద్వారా నీటిలోని ఇతర బ్యాక్టీరియాను శుద్ధి చేస్తుందని శ్రీకాంత్ అంటున్నారు. -
శుద్ధ మోసం.. మాయాజలం
ఆలేరు : నీటిశుద్ధి పేరిట దోపిడీ జరుగుతోంది. విచ్చలవిడిగా వెలుస్తున్న నీటిశుద్ధి కేంద్రాలు(ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల)పై అధికారుల నిఘా కరువైంది. దీంతో వాటర్ప్లాంట్ల వారు సరఫరా చేసిందే శుద్ధనీరు అన్నట్లుగా ఉంది. వాటర్ప్లాంట్ల యాజమాన్యాలు భార ప్రమాణాల(బీఎస్ఐ) నిబంధనలు పాటించకుండా మినరల్ వాటర్ పేరుతో మాయాజాలం చేస్తున్నారు. 20లీటర్ల నీటికి రూ.10–20 వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల యాదగిరిగుట్టలో ఓ వాటర్‌ప్లాంట్ ద్వారా పోస్తున్న నీటిలో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో అట్టి వాటర్ ప్లాంట్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే నీటి వ్యాపారానికి కళ్లెం వేయాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. నిబంధనలకు నీళ్లు.. నిబంధనల ప్రకారం వాటర్ప్లాంట్లలో ఎయిర్ కండిషనర్‌తో పాటు కెమికల్ ల్యాబ్ మైక్రోబయాలజీ ల్యాబ్, ఫిల్లింగ్ గది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిబంధనలకు అనుగుణంగా ప్లాంట్ అంతా స్టెయిన్లెస్ స్టీల్‌తో ఉండాలి. ఇవేకాకుండా అధికారులు ప్రతి 3 నెలలకొక్కసారి ఆయా ప్లాంట్లలో నీటి నమూనాలను సేకరించి పలు రకాల పరీక్షలు నిర్వహించాలి. సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్‌లు ఇవ్వడం కానీ అంతకు ముందు ఉంటే కొనసాగించడం వంటివి చేస్తారు. ప్లాంట్ నిర్వాహణతో పాటు ప్యాకెట్లు, బాటిళ్లకు కూడా ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అధికారలు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఈ నిబంధనలేవీ పాటించకుండా వాటర్ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. జరుగుతుందిలా.. రంగులేని నీరు కాస్తంత తియ్యగా ఉంటే చాలు. శుద్ది నీరు తయారీ కేంద్రం నడిపేస్తున్నారు. నిబంధనల మేరకు నీటిని శుభ్రం చేయకుండానే అమ్మకాలు చేస్తున్నారు. రూ.10 పెట్టి డబ్బా నీటిని కొంటే 2 రోజుల్లోనే అందులో చిన్నచిన్న క్రీములు తయారవుతున్నాయి. అసలు ఈ నీటిని శుద్ది చేస్తున్నారో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటిని శుద్ది చేయకుండానే కొన్ని ప్లాంట్ల వ్యాపారులు నీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. సురక్షితం కాని నీటిని తాగడం ద్వారా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. కలరా, టైపాయిడ్, పచ్చ కామెర్లు, మూత్రపిండ వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశముంది. రక్షణ కవచాలతో.. ప్లాంట్‌లోని కార్మికులు తమ చేతులకు స్పిరిట్ రాసుకొని గ్లౌస్ తొడుక్కొని పనిచేయాల్సి ఉంటుంది. శరీరానికి ఆప్రాన్లను ధరించాలి. అయితే ఇవేవీ ప్లాంట్లలో కనిపించవు. ఖరీదైన పరికరాలను సమకూర్చడంలో యాజమాన్యాలు నిబంధనలకు తిరోధకలిస్తున్నాయి. సాధారణ జలాన్ని శుద్ద జలంగా మార్చే ప్రక్రియలో పలు దశల్లో నిర్వహిస్తున్న పరీక్షలు సక్రమంగా లేకుంటే అనార్థాలు తప్పవు. తయారు చేయాల్సిన పద్ధతి ముందుగా బోరులో నీటిలో ట్యాంకులోకి పంపి క్లోరినేషన్ చేయాలి. కొంత సమయం తరువాత శాండ్ ఫిల్టర్‌లో శుభ్రం చేయాలి. తరువాత కార్బన్ ఫిల్టర్స్, మైక్రాన్ ఫిల్టర్స్‌లో శుభ్రం చేసి రివర్స్ అస్మాసిస్ చేయాలి. మినరల్స్‌ను జతచేసి ఓజోనైజేషన్ జరపాలి. ఆల్ట్రా వైయోలెట్ రేడియేషన్ ద్వారా శుద్దిచేసి నమూనాలు తీయాలి. నమూనాలను మైక్రోబయాలజీ, కెమిస్ట్ ప్రయోగశాలల్లో పరీక్షించాలి. ఆ తరువాత క్యాన్లలోకి, బాటిళ్లలోకి తీసుకోవాలి. ఫిర్యాదు చేయండిలా.. ప్రమాణాలు పాటించని సంస్థలపై ప్రివెన్షన్ ఆప్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1954 ప్రకారం కేసులు నమోదు చేయాలి. 3 నెలలకొక్కసారి ప్లాంట్లను తనిఖీ చేసి గుర్తింపులేని వాటిని రద్దు చేసేలా జిల్లా ఫుడ్ ఇన్సెపెక్టర్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. నిబంధనలకు విరుద్దంగా.. ♦ అపరిశుభ్ర వాతావరణం, వంటగదులు, తాత్కాలిక షెడ్లలో నీటిని తయారుచేస్తున్నారు. క్యాన్లు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. నీటిని శుభ్రపరుస్తున్న ఆనవాళ్లు కనబడడం లేదు. అపరిశుభ్రంగా ఉన్న క్యాన్లలోనే నీటిని పడుతున్నారు. ♦ వాహనాల్లో నీటిని తరలించేటప్పుడు క్యాన్లకు ఎండ తగలకుండా టార్పాలిన్ పట్టతో ప్రత్యేక ఏర్పాటు చేయాలి. కానీ ఇవేవి పట్టడం లేదు. ♦ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అనుమతిలేని నీటిని వాడుతున్నారు. ♦ క్యాన్లపై తయారీ కేంద్రాల చిరునామాలు, ఫోన్‌నెంబర్లు ప్రచురించడం లేదు. ♦ అధికారులు ఈ నీటి నమూనాలను సేకరించి పరీక్షా కేంద్రాలకు పంపడం లేదు. ♦ అధికారుల తనిఖీలు లేవు. ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదు. సమతుల్యత ఉండాలి నీటిలో ఉండాల్సిన ఖనిజాలు, నీటి పరిణామానికి సమతుల్యంగా ఉండాలి. మోతాదు మించితే వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. మెగ్నిషియం, బేరియం, అల్యుమినియం తదితర ఖనిజాల స్థాయి ఎక్కువైతే రోగాలు సంభవిస్తాయి. సాధారణ నీటిని శుద్ధజలంగా మార్చే ప్రక్రియ పక్కాగా జరగాలి. నీటి ఆమ్ల స్వభావ పరీక్షలకు సంబంధించి కనీష్ట స్థాయి లేకుంటే అల్సర్లు సంభవిస్తాయి.– డా. కె ప్రభాకర్, ఆలేరు -
చిటికెలో మురుగునీరు శుద్ధి!
పారిశ్రామిక అవసరాల కోసం వాడే నీరు కలుషితమై చెరువులు, నదుల వంటి జలవనరుల్లో కలిసిపోతుంటాయి. ఈ మురుగు నీటి శుద్ధికి టెక్నాలజీలన్నీ మళ్లీ రసాయనాలపైనే ఆధారపడుతాయి. రసాయనాల ప్రమేయం లేకుండా మురుగు నీటి శుద్ధి చేసేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న స్కాలీన్ టెక్నాలజీస్ కంపెనీ వినూత్న ఆవిష్కరణ చేసింది. దాని పేరే ఎఫ్పీస్టార్! ఇదో యంత్రం. రేడియో తరంగాలను సృష్టిస్తుంది. తగిన స్థాయిలో వీటిని వాడినప్పుడు మురుగునీటిలోని చెత్త ఓ చోట పేరుకుపోతుంది. దాన్ని తొలగించాక మిగిలిన నీటిని సాధారణ పద్ధతుల్లో దశల వారీగా ఫిల్టర్ చేస్తే చాలు.. స్వచ్ఛమైన నీరు అందుబాటులోకి వస్తుంది. ఎనిమిదేళ్ల శ్రమ.. ఎఫ్పీ స్టార్ ఆలోచన వెనుక బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్త రాజా విజయ్‌కుమార్ ఎనిమిదేళ్ల శ్రమ దాగి ఉంది. స్కాలీన్ టెక్నాలజీస్ కంపెనీ ఈయనదే. ఎఫ్పీ స్టార్ యంత్రం తయారీలో ఆయనకు స్ఫూర్తినిచ్చిన విషయం ఏమిటో తెలుసా... రక్తం గడ్డ కట్టే లక్షణం. రక్తంలోని ఫైబ్రినిన్లు గుంపులుగా ఒక దగ్గరకు చేరి.. చివరకు రక్తస్రావాన్ని ఆపేస్తాయి. ఎఫ్పీ స్టార్ పనిచేసేదీ అచ్చు ఇలాగే. ఇందులో మురుగు నీటిలోకి 30 వేల నుంచి 1.2 లక్షల వోల్టుల తీవ్రతతో కూడిన రేడియో తరంగాలను ప్రసరింపజేస్తారు. దీంతో సేంద్రియ వ్యర్థాలను చిన్న ముక్కలుగా విడగొట్టడంతో పాటు గుంపులుగా ఒకదగ్గరకు చేరేలా చేస్తారు. వీటిని సులువుగా వడపోస్తే సరిపోతుంది. ‘ఏ పదార్థానికైనా ఒక సహజ పౌనఃపున్యం ఉంటుంది. ఆ స్థాయికి తగ్గ రేడియో తరం గాలను ప్రయోగించినప్పుడు అవి అన్నీ ఒకదగ్గరకు చేరతాయి.’’అని స్కాలీన్ టెక్నాలజీస్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఒమెన్ థామస్ తెలిపారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి కాని రసాయనాలు కూడా ఇందులో సులువుగా వేరవుతాయి. మొత్తం ప్రక్రియను ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా కంప్యూటర్ నుంచి నియంత్రించొచ్చు. రేడియో తరంగాలతో మురుగును ఢీకొట్టించే బూమ్ ట్యూబ్‌లు సైజును బట్టి ఒకొక్కటి రోజుకు 75 వేల లీటర్ల మురుగును శుద్ధి చేయగలగదని ఒమెన్ ‘సాక్షి’కి తెలిపారు. ఈరోడ్, కొడగుల్లో ఏర్పాటు.. తమిళనాడులోని ఈరోడ్‌లో రెండు ఎఫ్పీ స్టార్ యూనిట్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. పారిశ్రామికవాడల నుంచి కావేరీ నదిలోకి కలుస్తున్న కలుషిత జలాలను శుద్ధి చేసేం దుకు ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. 2 యూనిట్ల ద్వారా రోజుకు దాదాపు 2.4 లక్షల నీరు శుద్ధి అవుతోంది. కర్ణాటకలోని కొడగు ప్రాంతంలోని కాఫీ తయారీ కంపెనీలోనూ దీన్ని వాడుతున్నారు. కాఫీ గింజల తయారీలో ఏర్పడే కలుషిత నీటిలో దాదాపు 2.5 లక్షల లీటర్లను రోజూ శుద్ధి చేస్తున్నారు. విజయ్‌కుమార్ నేతృత్వంలోని స్కాలీన్ టెక్నాలజీస్ ఇళ్లల్లో వాడుకునే ఇంకో యంత్రాన్ని కూడా తయారు చేసింది. అక్వారియా అని పిలిచే ఈ యంత్రం గాలిని శుద్ధి చేసి.. అందులోని తేమను తాగునీటిగా మార్చి అందజేస్తుంది. అక్వారియాతో తయారయ్యే నీరు స్వచ్ఛంగా ఉంటుందని చెబుతున్నారు. రోజుకు దాదాపు 30 లీటర్ల నీటిని తయారు చేయగల ఈ యంత్రం ఖరీదు దాదాపు రూ.80 వేలు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
అయినా...తీరు మారలేదు!
జలమండలిలో అర్హతలేని కంపెనీకే ‘ఫెర్రిక్ ఆలం’ సరఫరా టెండర్? సిటీబ్యూరో: జలమండలిలో పటాన్చెరు నిర్వహణ డివిజన్ పరిధిలో నీటి శుద్ధికి వినియోగించే రూ.1.23 కోట్ల విలువైన ఫెర్రిక్‌ఆలం సరఫరా టెండరును గతంలో సరఫరా చేసిన అనుభవం, అర్హత, పీసీబీ గుర్తింపు లేని కంపెనీకే కట్టబెట్టేందుకు అధికారులు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సదరు టెండరుకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలపై దుమారం చెలరేగడంతో ఆర్థిక బిడ్లు తెరిచే ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాము చేసిన పొరపాట్లు బయటికి పొక్కకుండా ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు సమాచారం.వివాదం సద్దుమణిగాక తాము అనుకున్న కంపెనీకే సరఫరా టెండరును కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుండడం గమనార్హం. ఈవిషయంలో లెక్కకు మిక్కిలి ఫిర్యాదులందినా అధికారులు వెనక్కి తగ్గకపోవడం గమనార్హం. టెండరు నిబంధనల ప్రకారం గతంలో 61.87 లక్షల విలువైన ఆలంను సరఫరా చేసిన కంపెనీకి మాత్రమే ఈ టెండరులో పాల్గొనే అర్హత ఉంటుంది. కానీ అధికారులు ఓ అర్హత లేని కంపెనీకి ఈ టెండరును కట్టబెట్టేందుకు ఈ నిబంధనను పక్కనబెట్టడం సంచలనం సష్టిస్తోంది. ఈవ్యవహారంలో బోర్డు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అనుభవం,అర్హత గల కంపెనీకి మాత్రమే ఆలం సరఫరా టెండరును కట్టబెట్టాలని కార్మికసంఘాలు కోరుతున్నాయి. -
మిఠీనది పరిరక్షణకు బీఎంసీ కసరత్తు
- జలశుద్ధీకరణ కేంద్రం నిర్మాణానికి ఆమోదం - నదిపై అక్రమంగా వెలసిన కట్టడాలు, పరిశ్రమలపై చర్యలు సాక్షి, ముంబై: మిఠీనది పరిరక్షణ, జలాల శుద్ధికి మహానగర పాలక సంస్థ (బీఎంసీ) శ్రీకారం చుట్టింది. నదిలో పెరిగిపోయిన కాలుష్యకారకాలను తక్షణమే తొలగించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నదిపై జల శుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మీఠీనది పరిరక్షణ చర్యలు చేపట్టాలని, కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని బీఎంసీకి ఆర్నెళ్ల కిందటే మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నోటీసు జారీ చేసింది. ఇందుకు స్పందించిన బీఎంసీ పరిపాలన విభాగం ఈ మేరకు జలశుద్ధీకరణ కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించింది. మిఠీనదిలోకి ఎక్కడెక్కడి నుంచి మురికి కాల్వలు, నాలాలు వచ్చి కలుస్తున్నాయో, జల శుద్ధీకరణ కేంద్రం ఎక్కడ నిర్మించాలనే విషయాలను అధ్యయనం చేయడానికి ఐటీఐకి చెందిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ కమిటీ బీఎంసీ పరిపాలన విభాగానికి సూచనలు చేయనుంది. కుచించుకుపోయిన నది మీఠీనదిలోకి నగరం, శివారు ప్రాంతాల్లోని అనేక మురికి కాల్వలు, నాలాలు వచ్చి కలుస్తాయి. నగర ప్రజలు దైనందిన పనులకు వాడే నీటితోపాటు పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాలు కూడా ఇందులోనే కలువడంతో నది కాలుష్యకాసారంగా మారింది. ఫలితంగా 2005 జూలై 26న కురిసిన భారీ వర్షాలకు నగరంతోపాటు శివారు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. అప్పట్లో వచ్చిన వరదలకు 200పైగా మంది చనిపోయారు. ఆస్తి నష్టం కూడా భారీగా సంభవించింది. ఈ ఘటనతో కళ్లు తెరిచిన ప్రభుత్వం వరదలకు ప్రధాన కారణాలను అధ్యయనం చేసేందుకు చితలే కమిటీని నియమించింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ఈ కమిటీ మిఠీనది కుచించుకుపోవడంతో వర్షపు నీరు సాఫీగా వెళ్లడం లేదని, దీంతోపాటు నదికి ఇరువైపులా మట్టిపోసి అందులో వెలసిన అక్రమ కట్టడాలే వరదముప్పునకు ప్రధాన కారణంగా తేల్చి చెప్పింది. అప్పటి నుంచి మిఠీనది అభివృద్ధి అంశం తెరమీదకు వచ్చింది. సుమారు 500 పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు ఈ నదిలో సుమారు 500పైగా పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు వచ్చి చేరుతున్నాయని కాలుష్యనియంత్రణ మండలి విడుదల చేసిన జాబితాలో స్పష్టం చేసింది. ఇందులో నుంచి ఏ పరిశ్రమ నుంచి ఎంతమేర కలుషిత నీరు చేరుతుందనేది పరిశీలించాల్సి ఉంది. ఆ తరువాత ఆయా యజమానులపై చర్యలు తీసుకుంటామని బీఎంసీ డిప్యూటీ కమిషనర్ అశోక్ ఖైరే వెల్లడించారు. అదే విధంగా మిఠీనదిని ఆక్రమించుకొని రెండు వైపులా వెలసిన అక్రమ కట్టాడాలు, పరిశ్రమలపై చర్యలు తీసుకొనున్నట్లు చెప్పారు. మీఠినది పరిరక్షణకు అవసరమైన అన్నిచర్యలను తీసుకొంటామని ఆయన చెప్పారు. -
నాణ్యతలో పోటీ పడుతున్నాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్ ప్యూరిఫయర్ల తయారీలో ఉన్న శ్రేష్ట్ ఇండస్ట్రీస్ విస్తరణపై దృష్టిసారించింది. మార్చికల్లా మరో 35 ఔట్లెట్లను తెరవనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి తెలంగాణ, సీమాంధ్రలో ఇప్పటికే 10 సొంత, 5 ఫ్రాంచైజీ స్టోర్లున్నాయి. గృహోపకరణాల విక్రయ రంగంలో ఉన్న మూడు సంస్థలతో ఈ నెలలోనే ఒప్పందం చేసుకుంటున్నామని శ్రేష్ట్ ఆర్వో సీఎండీ పి.గౌతమ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో విస్తరించిన తర్వాత కర్నాటక, తమిళనాడు, కేరళ మార్కెట్లలో అడుగు పెడతామని పేర్కొన్నారు. దక్షిణాది బ్రాండ్‌గా నిలవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇతర బ్రాండ్లకు ధీటుగా నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు. ఇక ధర 20 శాతం తక్కువగా నిర్ణయిస్తున్నట్టు తెలిపారు. బ్రాండింగ్, మార్కెటింగ్‌కు మార్చికల్లా రూ.5 కోట్ల దాకా వ్యయం చేస్తామన్నారు. సర్వీసింగ్‌కు సొంత టీమ్.. శ్రేష్ట్ ఆర్వో ప్రస్తుతం గృహ విభాగంలో నెలకు 600 ఆర్వో, 2 వేల గ్రావిటీ ప్యూరిఫయర్లు విక్రయిస్తోంది. వాణిజ్య భవనాలు, కార్యాలయాల్లో నెలకు 30 ప్యూరిఫికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఎన్ఎస్ఎఫ్/ఎఫ్‌డీఏ అనుమతించిన విడిభాగాలనే ప్యూరిఫయర్ల తయారీలో వినియోగిస్తున్నామని గౌతమ్ పేర్కొన్నారు. యూఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో తైవాన్‌లో తయారైన విడిభాగాలను దిగుమతి చేసుకుని హైదరాబాద్‌లోని నాచారం వద్ద ఉన్న ప్లాంటులో అసెంబ్లింగ్ చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు రానప్పటికీ కస్టమర్ల వద్దకు మూడు నెలలకోసారి సర్వీసింగ్ సిబ్బంది వెళ్తున్నారని పేర్కొన్నారు. ఏడాదిపాటు సర్వీసింగ్ ఉచితమని చెప్పారు. సిబ్బంది కంపెనీ సొంత ఉద్యోగులని వివరించారు. కొత్త విభాగాల్లోకి.. ప్రస్తుతం 4 గ్రావిటీ, 20 ఆర్వో ప్యూరిఫయర్లతోపాటు నీటి గాఢతను తగ్గించే సాఫ్ట్నర్లను కంపెనీ విక్రయిస్తోంది. త్వరలో గ్రావిటీ యూవీ ప్యూరిఫయర్‌ను మార్కెట్లోకి తేనుంది. అలాగే గృహ వినియోగానికి ఉపయుక్తంగా ఉండే సాఫ్ట్నర్లను అభివృద్ధి చేసే పనిలో ఉంది. మురుగు నీటి శుద్ధి విభాగంలోకి ప్రవేశించనుంది. మార్కెట్ తీరుకు అనుగుణంగా ఉత్పత్తులను పరిచయం చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా మంచినీటిని అందించేందుకు టర్నోవర్‌లో 2 శాతం వెచ్చిస్తోంది.