ఆలేరు : నీటిశుద్ధి పేరిట దోపిడీ జరుగుతోంది. విచ్చలవిడిగా వెలుస్తున్న నీటిశుద్ధి కేంద్రాలు(ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ల)పై అధికారుల నిఘా కరువైంది. దీంతో వాటర్‌ప్లాంట్ల వారు సరఫరా చేసిందే శుద్ధనీరు అన్నట్లుగా ఉంది. వాటర్‌ప్లాంట్ల యాజమాన్యాలు భార ప్రమాణాల(బీఎస్‌ఐ) నిబంధనలు పాటించకుండా మినరల్ వాటర్ పేరుతో మాయాజాలం చేస్తున్నారు. 20లీటర్ల నీటికి రూ.10–20 వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల యాదగిరిగుట్టలో ఓ వాటర్‌ప్లాంట్ ద్వారా పోస్తున్న నీటిలో పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో అట్టి వాటర్ ప్లాంట్‌ను అధికారులు సీజ్ చేశారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే నీటి వ్యాపారానికి కళ్లెం వేయాల్సిన అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు.
నిబంధనలకు నీళ్లు..
నిబంధనల ప్రకారం వాటర్‌ప్లాంట్‌లలో ఎయిర్ కండిషనర్‌తో పాటు కెమికల్ ల్యాబ్ మైక్రోబయాలజీ ల్యాబ్, ఫిల్లింగ్ గది, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నిబంధనలకు అనుగుణంగా ప్లాంట్ అంతా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో ఉండాలి. ఇవేకాకుండా అధికారులు ప్రతి 3 నెలలకొక్కసారి ఆయా ప్లాంట్లలో నీటి నమూనాలను సేకరించి పలు రకాల పరీక్షలు నిర్వహించాలి. సంతృప్తికరంగా ఉంటేనే లైసెన్స్‌లు ఇవ్వడం కానీ అంతకు ముందు ఉంటే కొనసాగించడం వంటివి చేస్తారు. ప్లాంట్ నిర్వాహణతో పాటు ప్యాకెట్లు, బాటిళ్లకు కూడా ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అధికారలు పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఈ నిబంధనలేవీ పాటించకుండా వాటర్ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు.
జరుగుతుందిలా..
రంగులేని నీరు కాస్తంత తియ్యగా ఉంటే చాలు. శుద్ది నీరు తయారీ కేంద్రం నడిపేస్తున్నారు. నిబంధనల మేరకు నీటిని శుభ్రం చేయకుండానే అమ్మకాలు చేస్తున్నారు. రూ.10 పెట్టి డబ్బా నీటిని కొంటే 2 రోజుల్లోనే అందులో చిన్నచిన్న క్రీములు తయారవుతున్నాయి. అసలు ఈ నీటిని శుద్ది చేస్తున్నారో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నీటిని శుద్ది చేయకుండానే కొన్ని ప్లాంట్ల వ్యాపారులు నీటిని విక్రయిస్తున్నట్లు సమాచారం. సురక్షితం కాని నీటిని తాగడం ద్వారా అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. కలరా, టైపాయిడ్, పచ్చ కామెర్లు, మూత్రపిండ వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశముంది.
రక్షణ కవచాలతో..
ప్లాంట్‌లోని కార్మికులు తమ చేతులకు స్పిరిట్ రాసుకొని గ్లౌస్ తొడుక్కొని పనిచేయాల్సి ఉంటుంది. శరీరానికి ఆప్రాన్‌లను ధరించాలి. అయితే ఇవేవీ ప్లాంట్లలో కనిపించవు. ఖరీదైన పరికరాలను సమకూర్చడంలో యాజమాన్యాలు నిబంధనలకు తిరోధకలిస్తున్నాయి. సాధారణ జలాన్ని శుద్ద జలంగా మార్చే ప్రక్రియలో పలు దశల్లో నిర్వహిస్తున్న పరీక్షలు సక్రమంగా లేకుంటే అనార్థాలు తప్పవు.
తయారు చేయాల్సిన పద్ధతి
ముందుగా బోరులో నీటిలో ట్యాంకులోకి పంపి క్లోరినేషన్ చేయాలి. కొంత సమయం తరువాత శాండ్ ఫిల్టర్‌లో శుభ్రం చేయాలి. తరువాత కార్బన్ ఫిల్టర్స్, మైక్రాన్ ఫిల్టర్స్‌లో శుభ్రం చేసి రివర్స్ అస్మాసిస్ చేయాలి. మినరల్స్‌ను జతచేసి ఓజోనైజేషన్ జరపాలి. ఆల్ట్రా వైయోలెట్ రేడియేషన్ ద్వారా శుద్దిచేసి నమూనాలు తీయాలి. నమూనాలను మైక్రోబయాలజీ, కెమిస్ట్ ప్రయోగశాలల్లో పరీక్షించాలి. ఆ తరువాత క్యాన్‌లలోకి, బాటిళ్లలోకి తీసుకోవాలి.
ఫిర్యాదు చేయండిలా..
ప్రమాణాలు పాటించని సంస్థలపై ప్రివెన్షన్ ఆప్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ 1954 ప్రకారం కేసులు నమోదు చేయాలి. 3 నెలలకొక్కసారి ప్లాంట్లను తనిఖీ చేసి గుర్తింపులేని వాటిని రద్దు చేసేలా జిల్లా ఫుడ్ ఇన్సెపెక్టర్లకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
నిబంధనలకు విరుద్దంగా..
♦ అపరిశుభ్ర వాతావరణం, వంటగదులు, తాత్కాలిక షెడ్లలో నీటిని తయారుచేస్తున్నారు. క్యాన్లు ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారు. నీటిని శుభ్రపరుస్తున్న ఆనవాళ్లు కనబడడం లేదు. అపరిశుభ్రంగా ఉన్న క్యాన్‌లలోనే నీటిని పడుతున్నారు.
♦ వాహనాల్లో నీటిని తరలించేటప్పుడు క్యాన్‌లకు ఎండ తగలకుండా టార్పాలిన్ పట్టతో ప్రత్యేక ఏర్పాటు చేయాలి. కానీ ఇవేవి పట్టడం లేదు.
♦ ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అనుమతిలేని నీటిని వాడుతున్నారు.
♦ క్యాన్‌లపై తయారీ కేంద్రాల చిరునామాలు, ఫోన్‌నెంబర్లు ప్రచురించడం లేదు.
♦ అధికారులు ఈ నీటి నమూనాలను సేకరించి పరీక్షా కేంద్రాలకు పంపడం లేదు.
♦ అధికారుల తనిఖీలు లేవు. ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోవడం లేదు.
సమతుల్యత ఉండాలి
నీటిలో ఉండాల్సిన ఖనిజాలు, నీటి పరిణామానికి సమతుల్యంగా ఉండాలి. మోతాదు మించితే వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. మెగ్నిషియం, బేరియం, అల్యుమినియం తదితర ఖనిజాల స్థాయి ఎక్కువైతే రోగాలు సంభవిస్తాయి. సాధారణ నీటిని శుద్ధజలంగా మార్చే ప్రక్రియ పక్కాగా జరగాలి. నీటి ఆమ్ల స్వభావ పరీక్షలకు సంబంధించి కనీష్ట స్థాయి లేకుంటే అల్సర్లు సంభవిస్తాయి.– డా. కె ప్రభాకర్, ఆలేరు
Comments
Please login to add a commentAdd a comment