నాణ్యతలో పోటీ పడుతున్నాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్ ప్యూరిఫయర్ల తయారీలో ఉన్న శ్రేష్ట్ ఇండస్ట్రీస్ విస్తరణపై దృష్టిసారించింది. మార్చికల్లా మరో 35 ఔట్‌లెట్లను తెరవనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి తెలంగాణ, సీమాంధ్రలో ఇప్పటికే 10 సొంత, 5 ఫ్రాంచైజీ స్టోర్లున్నాయి. గృహోపకరణాల విక్రయ రంగంలో ఉన్న మూడు సంస్థలతో ఈ నెలలోనే ఒప్పందం చేసుకుంటున్నామని శ్రేష్ట్ ఆర్‌వో సీఎండీ పి.గౌతమ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
ఈ రెండు రాష్ట్రాల్లో విస్తరించిన తర్వాత కర్నాటక, తమిళనాడు, కేరళ మార్కెట్లలో అడుగు పెడతామని పేర్కొన్నారు. దక్షిణాది బ్రాండ్‌గా నిలవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇతర బ్రాండ్లకు ధీటుగా నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు. ఇక ధర 20 శాతం తక్కువగా నిర్ణయిస్తున్నట్టు తెలిపారు. బ్రాండింగ్, మార్కెటింగ్‌కు మార్చికల్లా రూ.5 కోట్ల దాకా వ్యయం చేస్తామన్నారు.
సర్వీసింగ్‌కు సొంత టీమ్..
శ్రేష్ట్ ఆర్‌వో ప్రస్తుతం గృహ విభాగంలో నెలకు 600 ఆర్‌వో, 2 వేల గ్రావిటీ ప్యూరిఫయర్లు విక్రయిస్తోంది. వాణిజ్య భవనాలు, కార్యాలయాల్లో నెలకు 30 ప్యూరిఫికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఎన్‌ఎస్‌ఎఫ్/ఎఫ్‌డీఏ అనుమతించిన విడిభాగాలనే ప్యూరిఫయర్ల తయారీలో వినియోగిస్తున్నామని గౌతమ్ పేర్కొన్నారు. యూఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో తైవాన్‌లో తయారైన విడిభాగాలను దిగుమతి చేసుకుని హైదరాబాద్‌లోని నాచారం వద్ద ఉన్న ప్లాంటులో అసెంబ్లింగ్ చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు రానప్పటికీ కస్టమర్ల వద్దకు మూడు నెలలకోసారి సర్వీసింగ్ సిబ్బంది వెళ్తున్నారని పేర్కొన్నారు. ఏడాదిపాటు సర్వీసింగ్ ఉచితమని చెప్పారు. సిబ్బంది కంపెనీ సొంత ఉద్యోగులని వివరించారు.
కొత్త విభాగాల్లోకి..
ప్రస్తుతం 4 గ్రావిటీ, 20 ఆర్‌వో ప్యూరిఫయర్లతోపాటు నీటి గాఢతను తగ్గించే సాఫ్ట్‌నర్లను కంపెనీ విక్రయిస్తోంది. త్వరలో గ్రావిటీ యూవీ ప్యూరిఫయర్‌ను మార్కెట్లోకి తేనుంది. అలాగే గృహ వినియోగానికి ఉపయుక్తంగా ఉండే సాఫ్ట్‌నర్లను అభివృద్ధి చేసే పనిలో ఉంది. మురుగు నీటి శుద్ధి విభాగంలోకి ప్రవేశించనుంది. మార్కెట్ తీరుకు అనుగుణంగా ఉత్పత్తులను పరిచయం చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా మంచినీటిని అందించేందుకు టర్నోవర్‌లో 2 శాతం వెచ్చిస్తోంది.