P. Gautam
-
మలి సంధ్య మలుపులో కాంగ్రెస్
‘ప్రథమ’ కుటుంబపు అదృష్ట, దురదృష్టాలే కాంగ్రెస్ తలరాతను నిర్ణయిస్తుండగా ఆంటోనీ కమిటీని తప్పు పట్టడం అర్థరహితం. ఓటమికి మించిన వ్యక్తిగత విషాదంలో సోనియా మునిగి ఉన్నారు. అది ఆమె తనయుని భవిత. ఆయన ఓటమిలోనే సౌఖ్యాన్ని చూస్తుండి ఉండాలి. ఒకటి కాదు రెండు కాదు అరడజను అసలు సిసలు ‘నం బర్ వన్’ వార్తా చానళ్లతో విరాజిల్లే జాతీయ మీడియా ఉండ టం మన పూర్వ జన్మ సుకృతం. కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ బాధ్యత వహించనవసరం లేదని ఆంటోనీ కమిటీ తేలుస్తుందని ఎరగక నోళ్లు తెరిచి, మూయడం మరచేంతటి విశ్లేషక శ్రేష్టులు ఉండటమూ మన భాగ్యమే. కాంగ్రెస్ ఒక స్వతంత్ర పార్టీగా అస్తమించి, ఒక కుటుంబ ప్రైవేట్ లిమి టెడ్ కంపెనీగా మారి దశాబ్దాలు గడిచాయి. అది గ్రహిస్తే కాంగ్రెస్ నుంచి ఏమి ఆశించవచ్చో ఏమి ఆశించరాదో స్పష్టమవుతుంది. కాబట్టి ‘అవుటాఫ్ ఫ్యాషన్’ అయినా కాం గ్రెస్ కంపెనీ మరణ వేదనను అర్థం చేసుకునే శ్రమ తీసుకోక తప్పదు. 1966లో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నా డార్, రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీని ప్రధాని పీఠమె క్కించారు. అది ఒక పార్టీగా కాంగ్రెస్ అంతరించిపోవడానికి నాంది కాగలదని ఆయన కలనైనా ఊహించి ఉండరు. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో ఇందిర ‘కింగ్ మేకర్’ కామరాజ్ సహా సీనియర్లందరినీ శంకర‘గిరి’ మాన్యాలు పట్టిం చేశారు. నాడే కాంగ్రెస్ ఇందిర (నెహ్రూ-గాంధీ) కుటుంబ ప్రైవేట్ లిమి టెడ్ కంపెనీగా మారడం మొదలైంది. 1971 భారత - పాకి స్థాన్ యుద్ధ విజయానికి నాటి జనసంఘ్ అగ్ర నేత వాజ్ పేయీ అంతటి వాడే ఇందిరకు ‘అపర దుర్గ’ కీర్తి కిరీటాన్ని తొడిగారు. బ్యాంకుల జాతీయకరణ వంటి వశీకరణ విద్య లతో ఆమె అప్పటికే ‘సోషలిస్టు’గా పేరు మోశారు. ‘కుడి,’ ‘ఎడమ’లను ఏకకాలంలో మెప్పించిన ఖ్యాతితో, అసాధా రణ జనాకర్షణతో మకుటం లేని రాణిగా వెలిగారు. రాచరి కపు వాసనలు అంటడమంటేనే వంశపారంపర్య పాలన దుగ్ధ, ప్రజాస్వామ్యంపై వెగటు పెరగడమని అర్థం. అం దుకే ఆమె కాంగ్రెస్‌ను వ్యక్తి విధేయత ఇరుసుపై నిలిపారు. ప్రజాస్వామిక వ్యవస్థలు తన ఏకఛత్రాధిపత్యానికి ఆటం కమైనప్పుడు దేశ ప్రజాస్వామ్యాన్నే వ్యక్తి స్వామ్యంగా దిగ జార్చే యత్నం చేశారు (1975-77 అత్యవసర పరిస్థితి). రాహుల్ నాయనమ్మ హయాంలోనే తమ కుటుంబ సం స్థగా మారిన కాంగ్రెస్‌నే ఆయన తండ్రి రాజీవ్‌గాంధీ ఏలా రు. ఆయన అకాల మరణంతో సోనియాగాంధీకి మొదలైన కష్టకాలం నేటికీ ముగియలేదు. రాహుల్ అభ్యంతరమో లేక త్యాగమో ఏదో ఓ కారణంతో 1991లో వెతుక్కుంటూ వచ్చి న అధికార లక్ష్మిని సోనియా గడప దాటనిచ్చారు. ‘నంబర్ వన్’ కావాలని కలనైనా ఆశించని వీర విధేయుడు పీవీ నర సింహారావును ఆ తల్లి కటాక్షించింది, ఢిల్లీ గద్దెనెక్కించింది. అదే ఆమె దురదృష్టమైంది. పీవీ పార్టీలో దిగువ నుండి ఎదిగివచ్చిన వారు. అధికార దండం ఇందిర, రాజీవ్‌ల చేతు ల్లో ఉన్నా అపర చాణుక్యుడై పార్టీలోను, ప్రభుత్వంలోను ప్రభువుల మాటకు ఎదురు లేకుండా చేసిన వ్యవహార దక్షు డు. సరిగ్గా అందువల్లనే వానప్రస్థం స్వీకరించిన ఆయనను సోనియా ఏరికోరి ప్రధానిని చేశారు. సరిగ్గా అందువల్లనే ఆయన ఆమెను ధిక్కరించి ఐదేళ్లు జోడు గుర్రాల స్వారీ చే యగలిగారు. శాశ్వతంగానే చేజారిందనుకున్న అధికారాన్ని కమలనాధులు అతి భద్రంగా 2004లో కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏకు అప్పగించారు. పార్టీ రాత మారినా సోని యా గీత మారలేదు. అధికార లక్ష్మి ఆమె ఇంటి గడప దాటి లోపలికి రాలేదు. 1991లో చేసిన తప్పును సోనియా 2004లో చేయదల్చుకోలేదు. పార్టీ నేపథ్యమేలేని మన్మో హన్‌సింగ్‌ను ప్రధానిని చేశారు. పార్టీ, ప్రభుత్వమూ సోని యా-రాహుల్ - కో. గా కొనసాగుతుండగానే ఆయన పదేళ్ల పాలన ముగిసింది. 2014 ఎన్నికల్లో దివాలా తీసినది ఆ కుటుంబ సంస్థే. కాకపోతే అది ఒకప్పటి ఘన జాతీయ పార్టీ బోర్డును తగిలించుకుంది. మన దేశ ‘ప్రథమ’ కుటుంబపు అదృష్ట, దురదృష్టాలే... పార్టీ కాని ఆ పార్టీ భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ఆంటోనీని తప్పు పట్టడం అర్థరహితం. ఎన్నికల ఘోర పరాభవానికి మించిన వ్యక్తిగత విషా దంలో సోనియా మునిగి ఉన్నారు. అది ఆమె తనయుని భవిత. కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవిలో అసహనంగా కూచున్న రాహుల్ ఓటమిలో సానుకూలతను చూస్తుండాలి. ముళ్ల కిరీ టం మోసే భారం తప్పిందనో లేక వాయిదా పడిందనో ఊరట చెందుతుండాలి. ఆ కుటుంబ విషాదం నీడలు పార్టీ అంతటా ముసురుకున్నాయి. రాహుల్ ఎప్పటికైనా ప్రధాని కాగలడనే ఆశ ఆ పార్టీలో ఎవరికైనా ఉన్నదా అనేది అనుమా నమే. సోనియాకు అత్త జనాకర్షణా లేదు, రాజకీయ చతు రత అంతకన్నా లేదు. కానీ అత్తగారి బాటలో ప్రజా పునాది గల నేతలను దూరం చేసుకున్నారు, పార్టీ నిర్మాణాన్ని కృశించిపోయేలా చేశారు.ఏది ఏమైనా కాంగ్రెస్ నాయకత్వం ఆ ఇంటి గడప దాటే అవకాశం లేదు. దాటితే అది ఇక ఒక పార్టీగా మనగలిగే అవకాశమే లేదు. పి. గౌతమ్ -
అఫ్ఘాన్ ఎన్నికల్లో తాలిబన్ విజయం!
తాలిబన్లపై విజయంగా కీర్తించిన అఫ్ఘాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు దేశాన్ని జాతిపరమైన అంతర్యుద్ధంలోకి ఈడ్చే ముప్పు ఏర్పడింది. ఘనీ విజయాన్ని ప్రత్యర్థి అబ్దుల్లా తిరస్కరించారు. సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామంటూ సంఘర్షణలకు నాంది పలికారు. ‘అఫ్ఘాన్ ఎన్నికల్లో అమెరికా కూడా విజేతే.’ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అఫ్ఘానిస్థాన్ అధ్యక్ష ఎన్నికలపై ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన విశేష కథనానికి శీర్షిక అది. అఫ్ఘాన్ అధ్యక్షునిగా అష్రాఫ్ ఘనీ అహ్మదాజీ గెలుపొంది నట్టు తెలుస్తుండగా నేడు అదే పత్రిక... ఎన్నికల ఫలితాలు జాతి పరమైన అంతర్యుద్ధానికి దారి తీస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది! అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ హుటాహుటిన కాబూల్‌కు పయనమయ్యారు కూడా. అమెరికా ‘గెలుపు’ గెలుపేనని తేలేసరికి దానికిలా గంగవైలెందుకెత్తున్నట్టు? అమెరికాను బతిమాలి, బెదిరించి, బ్లాక్మెయిల్ చేసి ముప్పుతిప్పలు పెట్టిన నేటి అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రతినిధి జుల్మాయీ రసూల్ గెలుపు గండం మొదటి రౌండ్లోనే తొలగిపోయింది. రసూల్ మూడో అభ్యర్థిగా నిలవడంతో మాజీ ఆర్థిక మంత్రి, ప్రపంచ బ్యాంకు మాజీ అధికారి అష్రాఫ్ ఘనీ అహ్మదాజీ, అమెరికా మద్దతుదారుగా పేరు మోసిన అబ్దుల్లా అబ్దుల్లాల మధ్య రెండో రౌండు ఎన్నికలు తప్పవని తేలినప్పుడే... రొట్టె విరిగి ఎటు పడ్డా అది తన చేతిలోనే కదాని అమెరికా నిశ్చింతగా కూచుంది. కానీ కథ అడ్డం తిరిగింది. ఇద్దరూ ‘గెలిచి’ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నిద్రపట్టకుండా చేశారు. రెండో రౌండు ఎన్నికల వరకు వస్తే అధ్యక్ష పదవి అబ్దుల్లాకు మరో మారు మొహం చాటేయక తప్పదని అఫ్ఘాన్‌లోని భిన్న జాతుల జనాభాపరమైన పొందికను బట్టి ఎవరైనా ఊహించగలదే. అదే జరిగింది. జనాభాలో 42 శాతం గా ఉన్న పష్తూన్ల ఓట్లు మొదటి రౌండులో అనేక మంది పష్తూన్ అభ్యర్థుల మధ్య చీలిపోక తప్పలేదు. 27 శాతం జనాభాగా ఉన్న తజిక్‌ల ఏకైక అభ్యర్థి అబ్దుల్లా. రెండో రౌండు ఎన్నికల్లో అబ్దుల్లాకు ప్రత్యర్థిగా ఘనీ, రసూల్లలోఎవరు నిలిస్తే వారికి రెండో వారు మద్దతునిచ్చుకునేలా కర్జాయ్ ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. అబ్దుల్లా ఉపాధ్యక్ష అభ్యర్థిగా తజిక్ అట్టా మొహ్మద్ నూర్‌ను నిల పగా, ఘనీ తెలివిగా జనాభాలో 9 శాతంగా ఉన్న ఉజ్బెక్ కమాండర్ రషీద్ దోస్తుమ్ను నిలిపారు. కాబట్టి ఘనీకి 56 శాతం, అబ్దుల్లాకు 44 శాతం ఓట్లు రావడంలో ఆశ్చర్యం లేదు. ఎవరికి వారే శక్తి కొలది రిగ్గింగు చేసిన వారే. కానీ మొదటి దఫా ఎన్నికల్లో 46 శాతం ఓట్లతో మొదటి స్థానంలో తానే నిలిచానని, (31.6 శాతం) ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచిన ఘనీ కంటే 10 లక్షల ఓట్లు తనకు ఎక్కువ లభించాయని అబ్దుల్లా నేడు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగు, అక్రమాలు జరిగాయంటూ గుండెలు బాదుకుంటున్నారు. అందుకే ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు పూర్తయినా ఘనీ ఎన్నిైకను ప్రాథమిక ఫలితంగానే ప్రకటించింది. అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు సాగి స్తోంది. అయితే అబ్దుల్లా తానే గెలిచానని మంగళవారం ప్రకటించారు. తన గెలుపును అంగీకరించకపోతే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. దీంతో బరాక్ ఒబామా ఇద్దరు అభ్యర్థులలో ఎవరు రాజ్యాంగేతర పద్ధతులకు, హింసాకాండకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. అలాంటిదేదైనా జరిగితే అఫ్ఘాన్‌కు అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తామని బెదిరింపును జోడించారు. అధ్యక్షులవారి ఆందోళన సంగతి ఎలా ఉన్నా... అమెరికా సేనల ఉపసంహరణ తదుపరి అఫ్ఘాన్‌లోని యుద్ధ ప్రభువులంతా, తెగలన్నీ ఎవరికి వారే అధికారంలో వాటాల కోసం, స్వంత జాగీర్ల ప్రకటన కోసం సిద్ధమవుతున్నారు. అబ్దుల్లా ‘తిరుగుబాటు’ జాతుల, తెగల సంఘర్షణలకు నాంది మాత్రమే. రాజకీయ జూదంలో చేయితిరిగిన కిలాడి కర్జాయ్ ఇప్పటికే ఘనీతో పొత్తు కలుపుకున్నారు. రెండో రౌండు ఎన్నికల్లో తన నమ్మకమైన మిత్రుడు గుల్బుదిన్ హెక్మత్యార్ మద్దతును కూడా సమకూర్చి పెట్టారు. అన్నిటికీ మించి ఘనీ ఇటు పాకిస్థాన్‌తో చేయి కలుపుతూనే అటు తాలిబన్లతో అధికారాన్ని పంచుకోడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. అందుకే 2009 ఎన్నికల్లో ఎలాగైనా కర్జాయ్‌కి ప్రధానిగా నియమించాలని యత్నించిన ఘనీపైన అమెరికా అనుమానాలు పెంచుకుంది. అందుకే అబ్దుల్లాపై ఆశలు పెట్టుకుంది. ఒబామా హూంకరింపులు చూడ్డానికి అబ్దుల్లాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టినవిగా కనబడుతున్నాయి. ఎన్నికల కమిషన్ తేల్చిన ఫలితం ఉండగా... ఇద్దరు అభ్యర్థులు కలిసి ఒక ఒప్పందానికి రావాలని సెలవిస్తున్నారు. ఎప్పటిలాగే ఓడినా గెలిచానని అనిపించుకోవడం కోసం అమెరికా ప్రయత్నాలు విఫలం కాక మానవు. కాకపోతే నిరంతర యుద్ధ బీభత్సం చవి చూస్తున్న దేశాన్ని జాతి పరమైన అంతర్గత యుద్ధంలోకి ఈడ్చే దుస్సాహసం అది చేస్తోంది. ఇదంతా తాలిబన్లకు వినోదంగా ఉంది. పి. గౌతమ్ -
నాణ్యతలో పోటీ పడుతున్నాం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాటర్ ప్యూరిఫయర్ల తయారీలో ఉన్న శ్రేష్ట్ ఇండస్ట్రీస్ విస్తరణపై దృష్టిసారించింది. మార్చికల్లా మరో 35 ఔట్లెట్లను తెరవనుంది. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి తెలంగాణ, సీమాంధ్రలో ఇప్పటికే 10 సొంత, 5 ఫ్రాంచైజీ స్టోర్లున్నాయి. గృహోపకరణాల విక్రయ రంగంలో ఉన్న మూడు సంస్థలతో ఈ నెలలోనే ఒప్పందం చేసుకుంటున్నామని శ్రేష్ట్ ఆర్వో సీఎండీ పి.గౌతమ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో విస్తరించిన తర్వాత కర్నాటక, తమిళనాడు, కేరళ మార్కెట్లలో అడుగు పెడతామని పేర్కొన్నారు. దక్షిణాది బ్రాండ్‌గా నిలవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇతర బ్రాండ్లకు ధీటుగా నాణ్యమైన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకు వస్తున్నట్టు చెప్పారు. ఇక ధర 20 శాతం తక్కువగా నిర్ణయిస్తున్నట్టు తెలిపారు. బ్రాండింగ్, మార్కెటింగ్‌కు మార్చికల్లా రూ.5 కోట్ల దాకా వ్యయం చేస్తామన్నారు. సర్వీసింగ్‌కు సొంత టీమ్.. శ్రేష్ట్ ఆర్వో ప్రస్తుతం గృహ విభాగంలో నెలకు 600 ఆర్వో, 2 వేల గ్రావిటీ ప్యూరిఫయర్లు విక్రయిస్తోంది. వాణిజ్య భవనాలు, కార్యాలయాల్లో నెలకు 30 ప్యూరిఫికేషన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తోంది. ఎన్ఎస్ఎఫ్/ఎఫ్‌డీఏ అనుమతించిన విడిభాగాలనే ప్యూరిఫయర్ల తయారీలో వినియోగిస్తున్నామని గౌతమ్ పేర్కొన్నారు. యూఎస్ సాంకేతిక పరిజ్ఞానంతో తైవాన్‌లో తయారైన విడిభాగాలను దిగుమతి చేసుకుని హైదరాబాద్‌లోని నాచారం వద్ద ఉన్న ప్లాంటులో అసెంబ్లింగ్ చేస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులు రానప్పటికీ కస్టమర్ల వద్దకు మూడు నెలలకోసారి సర్వీసింగ్ సిబ్బంది వెళ్తున్నారని పేర్కొన్నారు. ఏడాదిపాటు సర్వీసింగ్ ఉచితమని చెప్పారు. సిబ్బంది కంపెనీ సొంత ఉద్యోగులని వివరించారు. కొత్త విభాగాల్లోకి.. ప్రస్తుతం 4 గ్రావిటీ, 20 ఆర్వో ప్యూరిఫయర్లతోపాటు నీటి గాఢతను తగ్గించే సాఫ్ట్నర్లను కంపెనీ విక్రయిస్తోంది. త్వరలో గ్రావిటీ యూవీ ప్యూరిఫయర్‌ను మార్కెట్లోకి తేనుంది. అలాగే గృహ వినియోగానికి ఉపయుక్తంగా ఉండే సాఫ్ట్నర్లను అభివృద్ధి చేసే పనిలో ఉంది. మురుగు నీటి శుద్ధి విభాగంలోకి ప్రవేశించనుంది. మార్కెట్ తీరుకు అనుగుణంగా ఉత్పత్తులను పరిచయం చేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉచితంగా మంచినీటిని అందించేందుకు టర్నోవర్‌లో 2 శాతం వెచ్చిస్తోంది. -
చైనాకు హాంకాంగ్ ‘గుండె దడ’
హాంకాంగ్ ప్రజాస్వామిక ఉద్యమం చైనాకు ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్‌లో ప్రజల అసంతృప్తి ఆసరాగా అమెరికా నడిపిన ‘విప్లవం’ దాన్ని బెంబేలెత్తిస్తోంది. క్రిమియాలోలా ప్రజాభిప్రాయ సేకరణతో స్వతంత్రం ప్రకటించుకుంటుందేమోనని భయపడుతోంది. ‘ప్రజాస్వామ్యాన్ని కోరడమంటే పులిని తోలు వలిచి ఇచ్చేయమనడమే.’ మంగళవారం హాంకాంగ్‌లో వెల్లువెత్తిన ఐదు లక్షలకు పైగా ప్రజలు చైనాను అదే కోరారు. పులికి కోపం రాదా మరి? హాంకాంగ్ ప్రజాస్వామిక ఉద్యమంపై చైనా మండిపాటుకు అర్థం ఉంది. 1997 జూలై 1న బ్రిటన్ 99 ఏళ్ల లీజు ముగియడంతో హాంకాంగ్‌ను తిరిగి చైనాకు అప్పగించిం ది. ఆ వార్షిక ‘వేడుక’కు హాజరైన చైనా ఉపాధ్యక్షుడు లి యువాన్‌చావో... హాంకాంగ్ ప్రజలకు సార్వత్రిక ఓటు హక్కును కల్పించి మరీ 2017 ఎన్నికలను నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. పనిలో పనిగా ‘ప్రజాభిప్రాయ సేకరణ,’ ‘ప్రజాస్వామ్య యాత్ర’ వంటి పిచ్చి వేషాలేయొద్దని హెచ్చరిం చారు. ఇచ్చిందేదో పుచ్చుకుని సరిపెట్టుకోవడం మంచిదని చెప్పి పోయారు. హాంకాంగ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమం పుట్టలో ఏ ‘ఉక్రెయిన్ పాము’ పొంచి ఉందోనని కమ్యూనిస్టు నాయకత్వం భయపడుతోంది. ప్రజల అసంతృప్తిని ఒడుపుగా వాడుకుని అమెరికా ఉక్రెయిన్‌లో ప్రదర్శించిన ‘ప్రజాస్వామిక విప్లవ’ ప్రహసనాన్ని తలచుకొని దడుచుకుంటోంది. అలాంటి ‘విప్లవ’ గండం చైనాలో కాలు మోపితే... హాంకాంగ్ ప్రత్యేక పాలిత ప్రాంతం నుంచే కాదు తైవాన్, టిబెట్, క్సింజియాంగ్, ఇన్నర్ మంగోలియా, మకావుల నుంచి కూడా ‘పులి తోలు’కు ముప్పు తప్పదేమోనని భయం. దానికి ‘క్రిమియా గుండె దడ’ తోడయింది. రష్యా ప్రజాభిప్రాయ సేకరణతో క్రిమియా స్వతంత్ర దేశమైన తీరు దానికి మింగుడు పడలేదు. అది న్యాయ సమ్మతమే అయితే.. తైవాన్, హాంకాంగ్‌లు అదే బాట పడితే ఎసరు వచ్చేది చైనాకే. అయినా మింగలేక కక్కలేక నోరు నొక్కుకుని అది రష్యాకు మద్దతుగా నిలిచింది. చైనా అనుకున్నంతా అయింది. గత నెలలో ప్రజాస్వామికవాదులు దాదాపు అంత పనీ చేశారు! చైనాకు వ్యతిరేకంగా ఏ నిరసన ప్రదర్శనకైనా పోటీగా చైనా అనుకూల ప్రదర్శనలను లేవనెత్తే పని చేయడం కోసం బీజింగ్ హెడ్‌క్వార్టర్స్‌గా ‘యునెటైడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్మెం ట్’ను స్థాపించారు. అది హాంకాంగ్‌లో ‘కేర్ ఫర్ యూత్ గ్రూప్ అసోసియేషన్’ వంటి ముసుగు సంస్థలను నడుపుతోంది. 1989 జూన్ 4 తియనాన్మెన్ స్క్వేర్ ప్రజాస్వామిక ఉద్యమ 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ప్రజాస్వామిక ప్రదర్శనలకు పొటీగా అవీ పోటీ ప్రదర్శనలకు, ఘర్షణలకు దిగాయి. ముదిరి పాకాన పడుతున్న హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమంపై కమ్యూనిస్టు అధినేత క్సీ జింగ్ పింగ్ అప్పటికే మూడో కన్ను తెరిచారు. ‘గతంలో హాంకాంగ్ విషయంలో చైనా ఎక్కువగా రాజీపడి, మెతకగా వ్యవహరించింది. దాన్ని బలహీనతగా భావిస్తున్నారు’ అంటూ ఆయన ‘శ్వేత పత్రాన్ని’ విడుదల చేశారు. 2017లో హాంకాంగ్‌లో ఎన్నికలు జరగటం తథ్యం. అయితే అవి హాంకాంగ్ ‘మౌలిక చట్టం’ లేదా మినీ రాజ్యాంగం ప్రకారమే జరుగుతాయని అది స్పష్టం చేసింది. అది 1997లో నాటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు, చైనా అధినేత డెంగ్ జియావో పింగ్‌కు మధ్య కుదిరిన అవగాహన మేరకు తయారైనది. బ్రిటన్ ప్రజాస్వామ్య దేశమైనప్పుడు దాని పాలనలోని హాంకాంగ్‌లో ఉన్నది ప్రజాస్వామ్యం కాక మరేమవుతుంది? మాట ప్రకారం హాంకాంగ్‌కు మరెవరికీ ఇవ్వనంత స్వయం ప్రతిపత్తిని ఇచ్చాం. కాబట్టి మినీ రాజ్యం గంలోనిది ప్రజాస్వామ్యం కాకుండా ఎలా పోతుందనేది చైనా పాయింటు. హాంకాంగ్‌కు బ్రిటన్ తన దేశంలోలా ప్రజాస్వా మిక హక్కులను ఇచ్చిందీ లేదు. ప్రజాస్వామిక సంస్థలను నిర్మించిందీ లేదు. అందుకే ‘ఒక్క దేశం రెండు వ్యవస్థలు’ అంటూ డెగ్ ఠక్కున స్వయంప్రతిపత్తికి అంగీకరించారు. ఆ మినీ రాజ్యాంగం ప్రకారం ఓట్లు వేసేది ప్రజలే. కానీ అభ్యర్థులను నిర్ణయించేది కేంద్రం, అంటే కమ్యూనిస్టు పార్టీ. అందుకే ప్రజలు నిర్ణయించే అభ్యర్థులతో, అలవాటుగా మారిన అక్రమాలకు, రిగ్గింగులకు తావు లేని ఎన్నికలను నిర్వహించాలంటూ ఎనిమిది లక్షల మంది ధైర్యంగా అనధికార ప్రజాభిప్రాయ సేకరణలో తీర్పు చెప్పారు. 72 లక్షల జనాభా లో అది చిన్న భాగమే. కానీ శక్తివంతమైన భద్రతా విభాగం ఏజెంట్లు హాంకాంగ్‌లోని ప్రతి కీలక నిర్మాణంలో చొరబడి ఉన్నారు. వారి చేతుల్లో అపరిమితమైన నిధులున్నాయి. మత గురువులు, జర్నలిస్టులు, లాయర్లు, వ్యాపారవేత్తలు, విద్యా వేత్తలు, రాజకీయవేత్తలే వారి ప్రధాన లక్ష్యం. అపరిమిత నిధు లతో ఏం చేయగలరో ఎవరైనా ఊహించవచ్చు. ఇక హాంకాంగ్ ఆర్థిక, రాజకీయాలను శాసించే ఐదుగురు కుబేరులు, వారి వెనుక ఉన్న మాఫియా కింగ్‌ల మందీ మార్బలం ఉండగా ప్రజాస్వామ్యం కోసం వీధులకెక్కేవారిని చూస్తే చైనా గుండె ద డ పెరగడం సహజమే. పి. గౌతమ్ -
‘పైపులైను’లో రెండు కత్తుల బంధం
ఉక్రెయిన్ సంక్షోభం ఫలితంగా రష్యా, చైనాల మధ్య రెండు దశాబ్దాలుగా నలుగుతున్న భారీ గ్యాస్ పైప్‌లైన్ ఒప్పందం కొలిక్కి వచ్చింది. విరుద్ధ ప్రయోజనాలను కలిగిన ప్రత్యర్థి దేశాల మధ్య ఈ ఒప్పందంతో దీర్ఘకాలిక ఆర్థిక, సైనిక, వ్యూహాత్మక బంధానికి రంగం సిద్ధమైంది. అపనమ్మకం, అవిశ్వాసం అంతర్జాతీయ సంబంధాలకు మారుపేరుగా మారిన కాలంలో... ఒక్క ఒరలో ఇమడని కత్తుల్లాంటి ప్రపంచాధిపత్య శక్తులు రష్యా, చైనాల మధ్య దీర్ఘకాలిక ద్వైపాక్షిక ‘సమగ్ర వ్యూహాత్మక సమన్వయ భాగస్వామ్య ఒప్పందం’ కుదిరి, సుదీర్ఘ మైత్రికి పునాదులు పడటం విడ్డూరమే. అయితే ఆ ఖ్యాతి మాత్రం... చైనాను ఏకాకిని చేసే ‘ఆసియా వ్యూహాన్నీ’, రష్యా తోక కత్తిరించే ‘యూరోపియన్ వ్యూహాన్నీ’ ఏక కాలంలో అమలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాదే. ఉక్రెయిన్ కొరివితో తల గోక్కున్నది చాలక ఆయన... ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడే స్థితి నుంచి బయటపడాలని యూరోపియన్ దేశాలకు ఆదేశాలు జారీ చేశారు. వాటికి ఈయూలోనే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అవి అమలవుతాయో లేదో గానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ముందుచూపుతో వ్యవహరించారు. 20 ఏళ్లుగా చైనాతో తెగకుండా, ముడిపడకుండా ఉన్న లక్ష కోట్ల డాలర్ల భారీ గ్యాస్ పైప్‌లైన్ ఒప్పందం కుదుర్చుకోడానికి సిద్ధమయ్యారు. ఈ నెల మే 20న చైనా వెళ్లిన పుతిన్ సంతకాలు చేయడం మినహా ఒప్పందాన్ని దాదాపు ఖరారు చేసుకున్నారు. ఈయూ దేశాలకు సరఫరా చేస్తున్నట్టే గ్యాస్ ధరను చమురు ధరతో ముడిపెట్టే పద్ధతిలో ఎల్పీజీని కొనడానికి చైనా ఇంతకాలంగా ససేమిరా అంటోంది. చైనా ప్రధాన షరతులన్నిటికీ అంగీకరించడానికి పుతిన్ నేడు సిద్ధమయ్యారు. రష్యా ప్రభుత్వ సంస్థ ‘గాజ్ప్రోమ్’ సైబీరియాలోని నాలుగు గ్యాస్ క్షేత్రాల నుంచి 2018 నుంచి రోజుకు 375 కోట్ల చదరపు ఘనపు అడుగుల గ్యాస్‌ను చైనాకు కనీసం 30 ఏళ్ల పాటూ సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈయూ దేశాలకు వెయ్యి క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సగటున 380 డాలర్ల ధరకు విక్రయిస్తుండగా చైనాకు 350 డాలర్ల ధరకే అందించనున్నట్టు సమాచారం. పైగా ఈ ఒప్పందం ప్రపంచంలో ‘గ్యాసో యువాన ్ల’ శకానికి తెరదీసింది. రష్యాకు చెల్లింపులన్నీ చైనా యువాన్లలోనే జరుగుతాయి. రష్యా ఇక గ్యాసో యువాన్ల దిగుమతులకు ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. అంటే చైనా, హాంకాంగ్‌ల నుంచి దిగుమతులకు రష్యా దారులు తెరుచుకుంటాయి. హాంకాంగ్‌లోని అంతర్జాతీయ బ్యాంకులన్నీ ఇప్పటికే యువాన్లలో చెల్లింపులు జరుపుతూ దానికి డాలర్, యూరోల సరసన అంతర్జాతీయ మారక ద్రవ్యంగా పీట వేశాయి. చైనా నుంచి వచ్చే రాబడులు ఆర్థిక తిరోగమనంలో ఉన్న రష్యా వృద్ధి బాటపట్టడానికి తోడ్పడతాయి. అంతకు మించి అది సైబీరియాను భారీ అంతర్జాతీయ గ్యాస్ కేంద్రంగా మార్చనుంది. చైనాకు నిర్మిస్తున్న పైపులైను ద్వారానే జపాన్, దక్షిణ కొరియాలకు గ్యాస్ సరఫరా చేయడానికి ఇప్పటికే ఒప్పందాలు కుదిరాయి. సైబీరియా తూర్పు కొసన ఉన్న సఖాలిన్ గ్యాస్ క్షేత్రం నుంచి ఆ రెండు అమెరికా మిత్ర దేశాలకు రష్యా గ్యాస్ సరఫరా చేస్తోంది. ఆ పాత పైప్లైన్లను నూతన నిర్మాణంతో అనుసంధానించడమే గాక, దక్షిణ కొరియా ద్వారా నైరుతి ఆసియానంత టినీ రష్యా తన గ్యాస్ వలలోకి తేనుంది. ఉక్రేనియన్ సంక్షోభంలో రష్యాను ఏకాకిని చేయడంలో జపాన్ సహా ఏ ఒక్క ఆసియా దేశం అమెరికాకు మద్దతు పలకక పోవడంలో విడ్డూరం లేదు! ప్రపంచాధిపత్య శక్తిగా ఎదగాలని తపిస్తున్న చైనా, ఇంకా అగ్రరాజ్యాన్ననే భావిస్తున్న రష్యా విడివిడిగా ఆసియాపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ వచ్చాయి. చైనా, జపాన్ తదితర దేశాలతో కయ్యానికి కాలు దువ్వి దారికి రప్పించుకునే వ్యూహం అనుసరిస్తోంది. ఆ దేశాలతో గ్యాస్ బంధం పటిష్టం చేసుకుని చైనా, అమెరికాలకు వ్యతిరేకంగా రష్యా కూటమిని నిర్మించే దూరదృష్టితో రష్యా పావులు కదుపుతోంది. అలాగే చైనా అజర్బైజాన్, తుర్క్‌మెనిస్థాన్‌లతో నెయ్యం నెరపుతోంది. ఇలా ఉండగా అమెరికా ఆసియాలో చైనాను ఏకాకిని చేసే ఆసియా వ్యూహాన్ని మొదలు పెట్టింది. అది చాలదని ‘ఉక్రెయిన్’ దుస్సాహసానికి పాల్పడింది. దీంతో భావి ప్రత్యర్థులు ఒద్దికగా కలిసి కాపురం చేయడానికి సిద్ధపడక తప్పలేదు. రష్యా, చైనాకు సరఫరా చేయబోయే గ్యాస్ ఆ దేశం మొత్తం గ్యాస్, చమురు దిగుమతుల్లో 30 శాతం. అంటే కనీసం మూడు దశాబ్దాల పాటూ ఒకరి పిలక ఒకరికి చిక్కిందనే అర్థం. కాబట్టే 2018 నాటికి సిద్ధం కానున్న రష్యన్ ‘స్టార్‌వార్’ క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-500ల కోసం బేరసారాలు మొదలయ్యాయి. ఆలోగా అత్యాధునికమైన సుఖోయ్ సు-35 జెట్‌ఫైటర్ల అమ్మకం తుది దశకు చేరింది. చైనా ఏవియేషన్ పరిశ్రమలో రష్యా భాగస్వామి కాబోతోంది. ఇక వాణిజ్య ఒప్పందాల గురించి చెప్పనవసరం లేదు. ఒబామా జోడు గుళ్ల తుపాకీ తుస్సుమన్నా ఇష్టంలేని పెళ్లికి రష్యా, చైనాలను ఠక్కున ఒప్పించేసింది పి. గౌతమ్ -
అల్జీరియా ‘ముబారక్’కు మళ్లీ పట్టం
చమురు, వాయు నిక్షేపాల పెన్నిధి అల్జీరియాకు అధ్యక్షునిగా బౌటెఫ్లికా నాలుగోసారి ‘ఎన్నికయ్యారు.’ రెండేళ్లుగా మంచం పట్టినా ఆయన పాలన సాగిపోతోందంటే అది... అల్జీరియా ప్రజాస్వామ్య ప్రహసంలో కీలక పాత్రధారులైన సైనిక నేతలు, అమెరికా, ఈయూల మహిమే. ‘నా తరం చరమాంకానికి చేరింది. దేశానికి మేం చేయగలిగిందేదో చేశాం. ఇక ఈ దేశం మీ చేతుల్లోనే, మీ యువతరం చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి.’ ఇలాంటి మాటలు ఏ దేశాధినేత నోటి నుంచైనా రావడం విన్నారా? 2012లో అల్జీరియా అధ్యక్షుడు అబ్దెలజీజ్ బౌటెఫ్లికా (77) అన్న మాటలివి. కడుపులో క్యాన్సర్‌ను దాచుకున్న ఆయన రెండేళ్ల నుంచి ఎవరికీ కనిపించలేదు. ఈ నెల 17న ఇలా ఓటేసి, అలా నాలుగో దఫా అధ్యక్షునిగా ఎన్నిక య్యారు. ఎలానైతేనేం పోలైన 51.7 శాతం ఓట్లలో 81.53 శాతం ఓట్ల భారీ ఆధిక్యతను సాధించారు (2009లో అది 90.24 శాతం!). అల్జీరియా ప్రజాస్వామ్య విషాదాంత హాస్య నాటకానికి ఇంతకు మించిన ఉపోద్ఘాతం అనవసరం. ఇక రిగ్గింగు, అక్రమాలను పట్టించుకోనవసరం లేదు. ‘అధికారం’ (లె పొవాయర్) అని పిలిచే అధికార ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’ (ఎన్ఎల్ఎఫ్) 2012లో కూడా ఇలాగే పార్లమెంటును అస్మదీయులతో నింపింది. ఆ ఎన్నికలను జాతీయ ఎన్నికల కమిషన్ సైతం విశ్వసనీయత, పారదర్శ కత లేనివిగా ప్రకటించింది. ‘ప్రజాస్వామ్య స్థాపన’ కోసం పక్కనే ఉన్న లిబియాను వల్లకాడుగా మార్చిన అమెరికా, ఈయూల కళ్లకు నాటి ఎన్నికలు ప్రజాస్వామ్యీకరణ దిశగా ‘నిర్ణయాత్మకమైన ముందడుగు’గా కనిపించాయి! 1991లో ‘ఇస్లామిక్ సాల్వేషన్ ఫ్రంట్’కు (ఐఎస్ఎఫ్) భారీ ఆధిక్యతను కట్టబెట్టి ప్రజలు ‘ఘోరమైన తప్పు’ చేశా రని మాజీ వలస యజమాని ఫ్రాన్స్, అమెరికా తీర్పు చెప్పాయి. సైన్యంతో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చి, ఐఎస్ఎఫ్ను నిషేధించాయి. అల్జీరియాను ‘ఇస్లామిజం ము ప్పు’ నుంచి కాపాడాయి. అలా రాజేసిన అంతర్యుద్ధంలో (1991-2002) రెండు లక్షల మంది బలైపోయారు. వారి సమాధులపైనే ఒకప్పటి ఈజిప్ట్ నియంత హోస్నీ ముబారక్ తరహా ‘అరబ్బు ప్రజాస్వామ్యం’ పుట్టుకొచ్చింది. ఆ ప్రహస నంలో 1999 నుంచి బౌటెఫ్లికా ఘట్టం నడుస్తోంది. 2008 లోనే ఎన్నిసార్లైనా అధ్యక్ష పీఠాన్ని ఎక్కడానికి వీలు కల్పిం చేలా ఆయన రాజ్యాంగాన్ని సవరించారు. ప్రపంచ మానవ హక్కుల సంస్థ ‘అథారిటేరియనిజం ఇండెక్స్’ ప్రకారం అక్క డున్నది నియంతృత్వమే. పత్రికా స్వేచ్ఛ సూచీపై దానికి లభించిన పాయింట్లు ఘనమైన గుండు సున్న! 1962లో స్వాతంత్య్రం పొందిన అల్జీరియా 1980 లలో వేగంగా వలసవాద ఆర్థిక సంకెళ్లను తెంచుకుని స్వావ లంబన దిశగా సాగింది. ఆఫ్రికాలోనే అత్యంత పారిశ్రామిక దేశంగా ఎదిగింది. అలీనోద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. ఆ స్వతంత్ర ఆర్థిక, రాజకీయ విధానాలు గిట్టకే పాశ్చాత్య దేశాలు వలస కాలపు సైనిక నాయకుల సహాయం తో దేశాన్ని అస్థిరతకు గురిచేశాయి. ప్రపంచ చమురు నిల్వ లలో 17వ స్థానం, సహజవాయు నిల్వలలో 9వ స్థానంలో ఉన్న దేశాన్ని దివాలా తీయించాయి. 1991లో తీసుకున్న ఐఎంఎఫ్ అప్పుకు నాలుగేళ్లలో... అసలుకు ఏడు రెట్ల వడ్డీ లను (9 వేల కోట్ల డాలర్లు) రాబట్టారు. అల్జీరియాను అరబ్బు ప్రపంచంలోని ‘అత్యంత సుస్థిర రాజకీయ వ్య వస్థ‘గా మార్చారు. రెండేళ్లుగా మంచంపై ఉన్నా బౌటెఫ్లికా ‘పాలన’ సాగిందంటే సైన్యం మహిమే. బౌటెఫ్లికాపై పాశ్చాత్య ప్రజాస్వామ్య ప్రభువులకు ఎందుకంత ప్రీతో ‘దిగుమతులు-దిగుమతుల’ ఆర్థిక వ్యవ స్థగా అల్జీరియాకు లభించిన బిరుదును చూస్తే సరిపో తుంది. 2000లో 930 కోట్ల డాలర్లుగా ఉన్న దిగుమతులు 2010 నాటికి 4,725 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఇక నేటి ఆ దేశ పారిశ్రామిక ఉత్పత్తి జీడీపీలో 5 శాతం. చమురు, సహజ వాయువులు గాక ఇతర రంగాల్లోని ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులలో (ఎఫ్‌డీఐ) మధ్యధరా ప్రాంత దేశాల్లో అట్ట డుగు స్థానం దానిదే. నిరుద్యోగం 30 శాతానికి చేరి ప్రజా సేవలన్నవే లేని అల్జీరియా మరో చమురు సంపన్న దరిద్ర దేశం. ట్యునీషియా, ఈజిప్ట్ నియంతృత్వాలను కూల్చిన అరబ్బు విప్లవ ప్రభావంతో 2011-12 మధ్య దేశంలో ప్రజా స్వామికోద్యమం, ఆందోళనలు పెల్లుబికాయి. చమురు, గ్యాస్ ఎగుమతుల నుంచే 75 శాతం ప్రభుత్వ రాబడికి ఆధారపడ్డ బౌటెఫ్లికా.. విదేశీమారక నిల్వలతో ఆ అసంతృ ప్తిని చల్లార్చారు. సబ్సిడీలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యో గుల వేతనాల పెంపుదల వంటి చిట్కాలు ప్రయోగించారు. చమురు, సహజవాయు క్షేత్రాలను కనిపెట్టిన వారికే వాటిపై 100 శాతం యాజమాన్యం కట్టబెట్టేయడానికి బౌటెఫ్లికా 2005లోనే చట్టాన్ని చేశారు. సైనిక నేతల హితబోధతో 49 శాతం యాజమాన్యంతో సరిపుచ్చారు. బౌటెఫ్లికా చల్లగుం డాలే గానీ ‘తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత’ రోజులు రాక మానవు. అందుకే అమెరికా, ఈయూల దౌత్యవేత్తలు, బహు ళజాతి కంపెనీలు అల్జీర్స్‌కు తీర్థయాత్ర సాగిస్తున్నారు. పి. గౌతమ్