అల్జీరియా ‘ముబారక్’కు మళ్లీ పట్టం
చమురు, వాయు నిక్షేపాల పెన్నిధి అల్జీరియాకు అధ్యక్షునిగా బౌటెఫ్లికా నాలుగోసారి ‘ఎన్నికయ్యారు.’ రెండేళ్లుగా మంచం పట్టినా ఆయన పాలన సాగిపోతోందంటే అది... అల్జీరియా ప్రజాస్వామ్య ప్రహసంలో కీలక పాత్రధారులైన సైనిక నేతలు, అమెరికా, ఈయూల మహిమే.
‘నా తరం చరమాంకానికి చేరింది. దేశానికి మేం చేయగలిగిందేదో చేశాం. ఇక ఈ దేశం మీ చేతుల్లోనే, మీ యువతరం చేతుల్లోనే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి.’ ఇలాంటి మాటలు ఏ దేశాధినేత నోటి నుంచైనా రావడం విన్నారా? 2012లో అల్జీరియా అధ్యక్షుడు అబ్దెలజీజ్ బౌటెఫ్లికా (77) అన్న మాటలివి. కడుపులో క్యాన్సర్‌ను దాచుకున్న ఆయన రెండేళ్ల నుంచి ఎవరికీ కనిపించలేదు. ఈ నెల 17న ఇలా ఓటేసి, అలా నాలుగో దఫా అధ్యక్షునిగా ఎన్నిక య్యారు. ఎలానైతేనేం పోలైన 51.7 శాతం ఓట్లలో 81.53 శాతం ఓట్ల భారీ ఆధిక్యతను సాధించారు (2009లో అది 90.24 శాతం!). అల్జీరియా ప్రజాస్వామ్య విషాదాంత హాస్య నాటకానికి ఇంతకు మించిన ఉపోద్ఘాతం అనవసరం. ఇక రిగ్గింగు, అక్రమాలను పట్టించుకోనవసరం లేదు.
‘అధికారం’ (లె పొవాయర్) అని పిలిచే అధికార ‘నేషనల్ లిబరేషన్ ఫ్రంట్’ (ఎన్‌ఎల్‌ఎఫ్) 2012లో కూడా ఇలాగే పార్లమెంటును అస్మదీయులతో నింపింది. ఆ ఎన్నికలను జాతీయ ఎన్నికల కమిషన్ సైతం విశ్వసనీయత, పారదర్శ కత లేనివిగా ప్రకటించింది. ‘ప్రజాస్వామ్య స్థాపన’ కోసం పక్కనే ఉన్న లిబియాను వల్లకాడుగా మార్చిన అమెరికా, ఈయూల కళ్లకు నాటి ఎన్నికలు ప్రజాస్వామ్యీకరణ దిశగా ‘నిర్ణయాత్మకమైన ముందడుగు’గా కనిపించాయి!
1991లో ‘ఇస్లామిక్ సాల్వేషన్ ఫ్రంట్’కు (ఐఎస్‌ఎఫ్) భారీ ఆధిక్యతను కట్టబెట్టి ప్రజలు ‘ఘోరమైన తప్పు’ చేశా రని మాజీ వలస యజమాని ఫ్రాన్స్, అమెరికా తీర్పు చెప్పాయి. సైన్యంతో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూల్చి, ఐఎస్‌ఎఫ్‌ను నిషేధించాయి. అల్జీరియాను ‘ఇస్లామిజం ము ప్పు’ నుంచి కాపాడాయి. అలా రాజేసిన అంతర్యుద్ధంలో (1991-2002) రెండు లక్షల మంది బలైపోయారు. వారి సమాధులపైనే ఒకప్పటి ఈజిప్ట్ నియంత హోస్నీ ముబారక్ తరహా ‘అరబ్బు ప్రజాస్వామ్యం’ పుట్టుకొచ్చింది. ఆ ప్రహస నంలో 1999 నుంచి బౌటెఫ్లికా ఘట్టం నడుస్తోంది. 2008 లోనే ఎన్నిసార్లైనా అధ్యక్ష పీఠాన్ని ఎక్కడానికి వీలు కల్పిం చేలా ఆయన రాజ్యాంగాన్ని సవరించారు. ప్రపంచ మానవ హక్కుల సంస్థ ‘అథారిటేరియనిజం ఇండెక్స్’ ప్రకారం అక్క డున్నది నియంతృత్వమే.
పత్రికా స్వేచ్ఛ సూచీపై దానికి లభించిన పాయింట్లు ఘనమైన గుండు సున్న!
1962లో స్వాతంత్య్రం పొందిన అల్జీరియా 1980 లలో వేగంగా వలసవాద ఆర్థిక సంకెళ్లను తెంచుకుని స్వావ లంబన దిశగా సాగింది. ఆఫ్రికాలోనే అత్యంత పారిశ్రామిక దేశంగా ఎదిగింది. అలీనోద్యమంలో చురుకైన పాత్రను పోషించింది. ఆ స్వతంత్ర ఆర్థిక, రాజకీయ విధానాలు గిట్టకే పాశ్చాత్య దేశాలు వలస కాలపు సైనిక నాయకుల సహాయం తో దేశాన్ని అస్థిరతకు గురిచేశాయి. ప్రపంచ చమురు నిల్వ లలో 17వ స్థానం, సహజవాయు నిల్వలలో 9వ స్థానంలో ఉన్న దేశాన్ని దివాలా తీయించాయి. 1991లో తీసుకున్న ఐఎంఎఫ్ అప్పుకు నాలుగేళ్లలో... అసలుకు ఏడు రెట్ల వడ్డీ లను (9 వేల కోట్ల డాలర్లు) రాబట్టారు. అల్జీరియాను అరబ్బు ప్రపంచంలోని ‘అత్యంత సుస్థిర రాజకీయ వ్య వస్థ‘గా మార్చారు. రెండేళ్లుగా మంచంపై ఉన్నా బౌటెఫ్లికా ‘పాలన’ సాగిందంటే సైన్యం మహిమే.
బౌటెఫ్లికాపై పాశ్చాత్య ప్రజాస్వామ్య ప్రభువులకు ఎందుకంత ప్రీతో ‘దిగుమతులు-దిగుమతుల’ ఆర్థిక వ్యవ స్థగా అల్జీరియాకు లభించిన బిరుదును చూస్తే సరిపో తుంది. 2000లో 930 కోట్ల డాలర్లుగా ఉన్న దిగుమతులు 2010 నాటికి 4,725 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఇక నేటి ఆ దేశ పారిశ్రామిక ఉత్పత్తి జీడీపీలో 5 శాతం. చమురు, సహజ వాయువులు గాక ఇతర రంగాల్లోని ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులలో (ఎఫ్‌డీఐ) మధ్యధరా ప్రాంత దేశాల్లో అట్ట డుగు స్థానం దానిదే. నిరుద్యోగం 30 శాతానికి చేరి ప్రజా సేవలన్నవే లేని అల్జీరియా మరో చమురు సంపన్న దరిద్ర దేశం. ట్యునీషియా, ఈజిప్ట్ నియంతృత్వాలను కూల్చిన అరబ్బు విప్లవ ప్రభావంతో 2011-12 మధ్య దేశంలో ప్రజా స్వామికోద్యమం, ఆందోళనలు పెల్లుబికాయి.
చమురు, గ్యాస్ ఎగుమతుల నుంచే 75 శాతం ప్రభుత్వ రాబడికి ఆధారపడ్డ బౌటెఫ్లికా.. విదేశీమారక నిల్వలతో ఆ అసంతృ ప్తిని చల్లార్చారు. సబ్సిడీలు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యో గుల వేతనాల పెంపుదల వంటి చిట్కాలు ప్రయోగించారు. చమురు, సహజవాయు క్షేత్రాలను కనిపెట్టిన వారికే వాటిపై 100 శాతం యాజమాన్యం కట్టబెట్టేయడానికి బౌటెఫ్లికా 2005లోనే చట్టాన్ని చేశారు. సైనిక నేతల హితబోధతో 49 శాతం యాజమాన్యంతో సరిపుచ్చారు. బౌటెఫ్లికా చల్లగుం డాలే గానీ ‘తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత’ రోజులు రాక మానవు. అందుకే అమెరికా, ఈయూల దౌత్యవేత్తలు, బహు ళజాతి కంపెనీలు అల్జీర్స్‌కు తీర్థయాత్ర సాగిస్తున్నారు.
పి. గౌతమ్