మలి సంధ్య మలుపులో కాంగ్రెస్
‘ప్రథమ’ కుటుంబపు అదృష్ట, దురదృష్టాలే కాంగ్రెస్ తలరాతను నిర్ణయిస్తుండగా ఆంటోనీ కమిటీని తప్పు పట్టడం అర్థరహితం. ఓటమికి మించిన వ్యక్తిగత విషాదంలో సోనియా మునిగి ఉన్నారు. అది ఆమె తనయుని భవిత. ఆయన ఓటమిలోనే సౌఖ్యాన్ని చూస్తుండి ఉండాలి.
ఒకటి కాదు రెండు కాదు అరడజను అసలు సిసలు ‘నం బర్ వన్’ వార్తా చానళ్లతో విరాజిల్లే జాతీయ మీడియా ఉండ టం మన పూర్వ జన్మ సుకృతం. కాంగ్రెస్ ఓటమికి రాహుల్ గాంధీ బాధ్యత వహించనవసరం లేదని ఆంటోనీ కమిటీ తేలుస్తుందని ఎరగక నోళ్లు తెరిచి, మూయడం మరచేంతటి విశ్లేషక శ్రేష్టులు ఉండటమూ మన భాగ్యమే. కాంగ్రెస్ ఒక స్వతంత్ర పార్టీగా అస్తమించి, ఒక కుటుంబ ప్రైవేట్ లిమి టెడ్ కంపెనీగా మారి దశాబ్దాలు గడిచాయి. అది గ్రహిస్తే కాంగ్రెస్ నుంచి ఏమి ఆశించవచ్చో ఏమి ఆశించరాదో స్పష్టమవుతుంది. కాబట్టి ‘అవుటాఫ్ ఫ్యాషన్’ అయినా కాం గ్రెస్ కంపెనీ మరణ వేదనను అర్థం చేసుకునే శ్రమ తీసుకోక తప్పదు. 1966లో నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు కామరాజ్ నా డార్, రాహుల్ నాయనమ్మ ఇందిరాగాంధీని ప్రధాని పీఠమె క్కించారు. అది ఒక పార్టీగా కాంగ్రెస్ అంతరించిపోవడానికి నాంది కాగలదని ఆయన కలనైనా ఊహించి ఉండరు. 1969 రాష్ట్రపతి ఎన్నికల్లో ఇందిర ‘కింగ్ మేకర్’ కామరాజ్ సహా సీనియర్లందరినీ శంకర‘గిరి’ మాన్యాలు పట్టిం చేశారు.
నాడే కాంగ్రెస్ ఇందిర (నెహ్రూ-గాంధీ) కుటుంబ ప్రైవేట్ లిమి టెడ్ కంపెనీగా మారడం మొదలైంది. 1971 భారత - పాకి స్థాన్ యుద్ధ విజయానికి నాటి జనసంఘ్ అగ్ర నేత వాజ్ పేయీ అంతటి వాడే ఇందిరకు ‘అపర దుర్గ’ కీర్తి కిరీటాన్ని తొడిగారు. బ్యాంకుల జాతీయకరణ వంటి వశీకరణ విద్య లతో ఆమె అప్పటికే ‘సోషలిస్టు’గా పేరు మోశారు. ‘కుడి,’ ‘ఎడమ’లను ఏకకాలంలో మెప్పించిన ఖ్యాతితో, అసాధా రణ జనాకర్షణతో మకుటం లేని రాణిగా వెలిగారు. రాచరి కపు వాసనలు అంటడమంటేనే వంశపారంపర్య పాలన దుగ్ధ, ప్రజాస్వామ్యంపై వెగటు పెరగడమని అర్థం. అం దుకే ఆమె కాంగ్రెస్‌ను వ్యక్తి విధేయత ఇరుసుపై నిలిపారు. ప్రజాస్వామిక వ్యవస్థలు తన ఏకఛత్రాధిపత్యానికి ఆటం కమైనప్పుడు దేశ ప్రజాస్వామ్యాన్నే వ్యక్తి స్వామ్యంగా దిగ జార్చే యత్నం చేశారు (1975-77 అత్యవసర పరిస్థితి).
రాహుల్ నాయనమ్మ హయాంలోనే తమ కుటుంబ సం స్థగా మారిన కాంగ్రెస్‌నే ఆయన తండ్రి రాజీవ్‌గాంధీ ఏలా రు. ఆయన అకాల మరణంతో సోనియాగాంధీకి మొదలైన కష్టకాలం నేటికీ ముగియలేదు. రాహుల్ అభ్యంతరమో లేక త్యాగమో ఏదో ఓ కారణంతో 1991లో వెతుక్కుంటూ వచ్చి న అధికార లక్ష్మిని సోనియా గడప దాటనిచ్చారు. ‘నంబర్ వన్’ కావాలని కలనైనా ఆశించని వీర విధేయుడు పీవీ నర సింహారావును ఆ తల్లి కటాక్షించింది, ఢిల్లీ గద్దెనెక్కించింది. అదే ఆమె దురదృష్టమైంది. పీవీ పార్టీలో దిగువ నుండి ఎదిగివచ్చిన వారు. అధికార దండం ఇందిర, రాజీవ్‌ల చేతు ల్లో ఉన్నా అపర చాణుక్యుడై పార్టీలోను, ప్రభుత్వంలోను ప్రభువుల మాటకు ఎదురు లేకుండా చేసిన వ్యవహార దక్షు డు. సరిగ్గా అందువల్లనే వానప్రస్థం స్వీకరించిన ఆయనను సోనియా ఏరికోరి ప్రధానిని చేశారు. సరిగ్గా అందువల్లనే ఆయన ఆమెను ధిక్కరించి ఐదేళ్లు జోడు గుర్రాల స్వారీ చే యగలిగారు. శాశ్వతంగానే చేజారిందనుకున్న అధికారాన్ని కమలనాధులు అతి భద్రంగా 2004లో కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏకు అప్పగించారు. పార్టీ రాత మారినా సోని యా గీత మారలేదు. అధికార లక్ష్మి ఆమె ఇంటి గడప దాటి లోపలికి రాలేదు.
1991లో చేసిన తప్పును సోనియా 2004లో చేయదల్చుకోలేదు. పార్టీ నేపథ్యమేలేని మన్మో హన్‌సింగ్‌ను ప్రధానిని చేశారు. పార్టీ, ప్రభుత్వమూ సోని యా-రాహుల్ - కో. గా కొనసాగుతుండగానే ఆయన పదేళ్ల పాలన ముగిసింది. 2014 ఎన్నికల్లో దివాలా తీసినది ఆ కుటుంబ సంస్థే. కాకపోతే అది ఒకప్పటి ఘన జాతీయ పార్టీ బోర్డును తగిలించుకుంది. మన దేశ ‘ప్రథమ’ కుటుంబపు అదృష్ట, దురదృష్టాలే... పార్టీ కాని ఆ పార్టీ భవితవ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ఆంటోనీని తప్పు పట్టడం అర్థరహితం.
ఎన్నికల ఘోర పరాభవానికి మించిన వ్యక్తిగత విషా దంలో సోనియా మునిగి ఉన్నారు. అది ఆమె తనయుని భవిత. కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవిలో అసహనంగా కూచున్న రాహుల్ ఓటమిలో సానుకూలతను చూస్తుండాలి. ముళ్ల కిరీ టం మోసే భారం తప్పిందనో లేక వాయిదా పడిందనో ఊరట చెందుతుండాలి. ఆ కుటుంబ విషాదం నీడలు పార్టీ అంతటా ముసురుకున్నాయి. రాహుల్ ఎప్పటికైనా ప్రధాని కాగలడనే ఆశ ఆ పార్టీలో ఎవరికైనా ఉన్నదా అనేది అనుమా నమే. సోనియాకు అత్త జనాకర్షణా లేదు, రాజకీయ చతు రత అంతకన్నా లేదు. కానీ అత్తగారి బాటలో ప్రజా పునాది గల నేతలను దూరం చేసుకున్నారు, పార్టీ నిర్మాణాన్ని కృశించిపోయేలా చేశారు.ఏది ఏమైనా కాంగ్రెస్ నాయకత్వం ఆ ఇంటి గడప దాటే అవకాశం లేదు. దాటితే అది ఇక ఒక పార్టీగా మనగలిగే అవకాశమే లేదు.
పి. గౌతమ్