యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారంటూ ప్రధాని మోదీ చేసిన ...
కాంగ్రెస్ ఎద్దేవా
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారంటూ ప్రధాని మోదీ చేసిన అరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ‘బాధ్యతాయుత పదవిలో ఉన్నారు.. కనీసం అప్పుడప్పుడైనా నిజాలు మాట్లాడండి’ అంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ మోదీకి వ్యంగ్యంగా సూచించారు. ‘కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చింది సోనియాగాంధీనే కనుక ప్రజలకు అవసరమైన విధానాలు, పథకాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆమె కోరడం సహజమే.
అంతేకానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతీ విషయంలో ఆమె జోక్యం చేసుకున్నారన్నది పచ్చి అబద్ధం’ అన్నారు. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ, రైతులకు రుణమాఫీ.. ఇవన్నీ సోనియా గాంధీ సూచనల మేరకే వచ్చాయని వివరించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని కాంగ్రెస్ ఇంకా జీర్ణించుకోలేదన్న మోదీ వ్యాఖ్యపై స్పందిస్తూ.. ‘ఓటమి జీర్ణక్రియపై ప్రభావం చూపుతుందని నాకు తెలియదు. అలా అయితే, జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచి వారికి ఈ సమస్య ఉండి ఉండాలి’ అని చురకంటించారు.