చైనాకు హాంకాంగ్ ‘గుండె దడ’
హాంకాంగ్ ప్రజాస్వామిక ఉద్యమం చైనాకు ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్‌లో ప్రజల అసంతృప్తి ఆసరాగా అమెరికా నడిపిన ‘విప్లవం’ దాన్ని బెంబేలెత్తిస్తోంది. క్రిమియాలోలా ప్రజాభిప్రాయ సేకరణతో స్వతంత్రం ప్రకటించుకుంటుందేమోనని భయపడుతోంది.
‘ప్రజాస్వామ్యాన్ని కోరడమంటే పులిని తోలు వలిచి ఇచ్చేయమనడమే.’ మంగళవారం హాంకాంగ్‌లో వెల్లువెత్తిన ఐదు లక్షలకు పైగా ప్రజలు చైనాను అదే కోరారు. పులికి కోపం రాదా మరి? హాంకాంగ్ ప్రజాస్వామిక ఉద్యమంపై చైనా మండిపాటుకు అర్థం ఉంది. 1997 జూలై 1న బ్రిటన్ 99 ఏళ్ల లీజు ముగియడంతో హాంకాంగ్‌ను తిరిగి చైనాకు అప్పగించిం ది. ఆ వార్షిక ‘వేడుక’కు హాజరైన చైనా ఉపాధ్యక్షుడు లి యువాన్‌చావో... హాంకాంగ్ ప్రజలకు సార్వత్రిక ఓటు హక్కును కల్పించి మరీ 2017 ఎన్నికలను నిర్వహిస్తామని పునరుద్ఘాటించారు. పనిలో పనిగా ‘ప్రజాభిప్రాయ సేకరణ,’ ‘ప్రజాస్వామ్య యాత్ర’ వంటి పిచ్చి వేషాలేయొద్దని హెచ్చరిం చారు. ఇచ్చిందేదో పుచ్చుకుని సరిపెట్టుకోవడం మంచిదని చెప్పి పోయారు. హాంకాంగ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాస్వామిక ఉద్యమం పుట్టలో ఏ ‘ఉక్రెయిన్ పాము’ పొంచి ఉందోనని కమ్యూనిస్టు నాయకత్వం భయపడుతోంది. ప్రజల అసంతృప్తిని ఒడుపుగా వాడుకుని అమెరికా ఉక్రెయిన్‌లో ప్రదర్శించిన ‘ప్రజాస్వామిక విప్లవ’ ప్రహసనాన్ని తలచుకొని దడుచుకుంటోంది. అలాంటి ‘విప్లవ’ గండం చైనాలో కాలు మోపితే... హాంకాంగ్ ప్రత్యేక పాలిత ప్రాంతం నుంచే కాదు తైవాన్, టిబెట్, క్సింజియాంగ్, ఇన్నర్ మంగోలియా, మకావుల నుంచి కూడా ‘పులి తోలు’కు ముప్పు తప్పదేమోనని భయం. దానికి ‘క్రిమియా గుండె దడ’ తోడయింది. రష్యా ప్రజాభిప్రాయ సేకరణతో క్రిమియా స్వతంత్ర దేశమైన తీరు దానికి మింగుడు పడలేదు. అది న్యాయ సమ్మతమే అయితే.. తైవాన్, హాంకాంగ్‌లు అదే బాట పడితే ఎసరు వచ్చేది చైనాకే. అయినా మింగలేక కక్కలేక నోరు నొక్కుకుని అది రష్యాకు మద్దతుగా నిలిచింది. చైనా అనుకున్నంతా అయింది. గత నెలలో ప్రజాస్వామికవాదులు దాదాపు అంత పనీ చేశారు!
చైనాకు వ్యతిరేకంగా ఏ నిరసన ప్రదర్శనకైనా పోటీగా చైనా అనుకూల ప్రదర్శనలను లేవనెత్తే పని చేయడం కోసం బీజింగ్ హెడ్‌క్వార్టర్స్‌గా ‘యునెటైడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్‌మెం ట్’ను స్థాపించారు. అది హాంకాంగ్‌లో ‘కేర్ ఫర్ యూత్ గ్రూప్ అసోసియేషన్’ వంటి ముసుగు సంస్థలను నడుపుతోంది. 1989 జూన్ 4 తియనాన్మెన్ స్క్వేర్ ప్రజాస్వామిక ఉద్యమ 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ప్రజాస్వామిక ప్రదర్శనలకు పొటీగా అవీ పోటీ ప్రదర్శనలకు, ఘర్షణలకు దిగాయి. ముదిరి పాకాన పడుతున్న హాంకాంగ్ ప్రజాస్వామ్య ఉద్యమంపై కమ్యూనిస్టు అధినేత క్సీ జింగ్ పింగ్ అప్పటికే మూడో కన్ను తెరిచారు. ‘గతంలో హాంకాంగ్ విషయంలో చైనా ఎక్కువగా రాజీపడి, మెతకగా వ్యవహరించింది. దాన్ని బలహీనతగా భావిస్తున్నారు’ అంటూ ఆయన ‘శ్వేత పత్రాన్ని’ విడుదల చేశారు. 2017లో హాంకాంగ్‌లో ఎన్నికలు జరగటం తథ్యం. అయితే అవి హాంకాంగ్ ‘మౌలిక చట్టం’ లేదా మినీ రాజ్యాంగం ప్రకారమే జరుగుతాయని అది స్పష్టం చేసింది. అది 1997లో నాటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్‌కు, చైనా అధినేత డెంగ్ జియావో పింగ్‌కు మధ్య కుదిరిన అవగాహన మేరకు తయారైనది. బ్రిటన్ ప్రజాస్వామ్య దేశమైనప్పుడు దాని పాలనలోని హాంకాంగ్‌లో ఉన్నది ప్రజాస్వామ్యం కాక మరేమవుతుంది? మాట ప్రకారం హాంకాంగ్‌కు మరెవరికీ ఇవ్వనంత స్వయం ప్రతిపత్తిని ఇచ్చాం. కాబట్టి మినీ రాజ్యం గంలోనిది ప్రజాస్వామ్యం కాకుండా ఎలా పోతుందనేది చైనా పాయింటు. హాంకాంగ్‌కు బ్రిటన్ తన దేశంలోలా ప్రజాస్వా మిక హక్కులను ఇచ్చిందీ లేదు. ప్రజాస్వామిక సంస్థలను నిర్మించిందీ లేదు. అందుకే ‘ఒక్క దేశం రెండు వ్యవస్థలు’ అంటూ డెగ్ ఠక్కున స్వయంప్రతిపత్తికి అంగీకరించారు.
ఆ మినీ రాజ్యాంగం ప్రకారం ఓట్లు వేసేది ప్రజలే. కానీ అభ్యర్థులను నిర్ణయించేది కేంద్రం, అంటే కమ్యూనిస్టు పార్టీ. అందుకే ప్రజలు నిర్ణయించే అభ్యర్థులతో, అలవాటుగా మారిన అక్రమాలకు, రిగ్గింగులకు తావు లేని ఎన్నికలను నిర్వహించాలంటూ ఎనిమిది లక్షల మంది ధైర్యంగా అనధికార ప్రజాభిప్రాయ సేకరణలో తీర్పు చెప్పారు. 72 లక్షల జనాభా లో అది చిన్న భాగమే. కానీ శక్తివంతమైన భద్రతా విభాగం ఏజెంట్లు హాంకాంగ్‌లోని ప్రతి కీలక నిర్మాణంలో చొరబడి ఉన్నారు. వారి చేతుల్లో అపరిమితమైన నిధులున్నాయి. మత గురువులు, జర్నలిస్టులు, లాయర్లు, వ్యాపారవేత్తలు, విద్యా వేత్తలు, రాజకీయవేత్తలే వారి ప్రధాన లక్ష్యం. అపరిమిత నిధు లతో ఏం చేయగలరో ఎవరైనా ఊహించవచ్చు. ఇక హాంకాంగ్ ఆర్థిక, రాజకీయాలను శాసించే ఐదుగురు కుబేరులు, వారి వెనుక ఉన్న మాఫియా కింగ్‌ల మందీ మార్బలం ఉండగా ప్రజాస్వామ్యం కోసం వీధులకెక్కేవారిని చూస్తే చైనా గుండె ద డ పెరగడం సహజమే.
పి. గౌతమ్