అఫ్ఘాన్ ఎన్నికల్లో తాలిబన్ విజయం! | afghanisthan election to win the Taliban | Sakshi
Sakshi News home page

అఫ్ఘాన్ ఎన్నికల్లో తాలిబన్ విజయం!

Published Thu, Jul 10 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM

అఫ్ఘాన్ ఎన్నికల్లో తాలిబన్ విజయం!

అఫ్ఘాన్ ఎన్నికల్లో తాలిబన్ విజయం!

తాలిబన్లపై విజయంగా కీర్తించిన అఫ్ఘాన్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు దేశాన్ని జాతిపరమైన అంతర్యుద్ధంలోకి ఈడ్చే ముప్పు ఏర్పడింది. ఘనీ విజయాన్ని ప్రత్యర్థి అబ్దుల్లా తిరస్కరించారు. సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పరుస్తామంటూ సంఘర్షణలకు నాంది పలికారు.
 
‘అఫ్ఘాన్ ఎన్నికల్లో అమెరికా కూడా విజేతే.’ ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అఫ్ఘానిస్థాన్ అధ్యక్ష ఎన్నికలపై ‘న్యూయార్క్ టైమ్స్’ ప్రచురించిన విశేష కథనానికి శీర్షిక అది. అఫ్ఘాన్ అధ్యక్షునిగా అష్రాఫ్ ఘనీ అహ్మదాజీ గెలుపొంది నట్టు తెలుస్తుండగా నేడు అదే పత్రిక... ఎన్నికల ఫలితాలు జాతి పరమైన అంతర్యుద్ధానికి దారి తీస్తాయేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది! అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ హుటాహుటిన కాబూల్‌కు పయనమయ్యారు కూడా. అమెరికా ‘గెలుపు’ గెలుపేనని తేలేసరికి దానికిలా గంగవైలెందుకెత్తున్నట్టు? అమెరికాను బతిమాలి, బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేసి ముప్పుతిప్పలు పెట్టిన నేటి అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ ప్రతినిధి జుల్మాయీ రసూల్ గెలుపు గండం మొదటి రౌండ్‌లోనే తొలగిపోయింది. రసూల్ మూడో అభ్యర్థిగా నిలవడంతో మాజీ ఆర్థిక మంత్రి, ప్రపంచ బ్యాంకు మాజీ అధికారి అష్రాఫ్ ఘనీ అహ్మదాజీ, అమెరికా మద్దతుదారుగా పేరు మోసిన అబ్దుల్లా అబ్దుల్లాల మధ్య రెండో రౌండు ఎన్నికలు తప్పవని తేలినప్పుడే... రొట్టె విరిగి ఎటు పడ్డా అది తన చేతిలోనే కదాని  అమెరికా నిశ్చింతగా కూచుంది.  కానీ కథ అడ్డం తిరిగింది. ఇద్దరూ ‘గెలిచి’ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నిద్రపట్టకుండా చేశారు.

 రెండో రౌండు ఎన్నికల వరకు వస్తే అధ్యక్ష పదవి అబ్దుల్లాకు మరో మారు మొహం చాటేయక తప్పదని అఫ్ఘాన్‌లోని భిన్న జాతుల జనాభాపరమైన పొందికను బట్టి ఎవరైనా ఊహించగలదే. అదే జరిగింది. జనాభాలో 42 శాతం గా ఉన్న పష్తూన్‌ల ఓట్లు మొదటి రౌండులో అనేక మంది పష్తూన్ అభ్యర్థుల మధ్య చీలిపోక తప్పలేదు. 27 శాతం జనాభాగా ఉన్న తజిక్‌ల ఏకైక అభ్యర్థి అబ్దుల్లా. రెండో రౌండు ఎన్నికల్లో అబ్దుల్లాకు ప్రత్యర్థిగా ఘనీ, రసూల్‌లలోఎవరు నిలిస్తే వారికి రెండో వారు  మద్దతునిచ్చుకునేలా కర్జాయ్ ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నారు. అబ్దుల్లా ఉపాధ్యక్ష అభ్యర్థిగా తజిక్ అట్టా మొహ్మద్ నూర్‌ను నిల పగా, ఘనీ తెలివిగా జనాభాలో 9 శాతంగా ఉన్న ఉజ్బెక్ కమాండర్ రషీద్ దోస్తుమ్‌ను నిలిపారు. కాబట్టి ఘనీకి 56 శాతం, అబ్దుల్లాకు 44 శాతం ఓట్లు రావడంలో ఆశ్చర్యం లేదు. ఎవరికి వారే శక్తి కొలది రిగ్గింగు చేసిన వారే. కానీ మొదటి దఫా ఎన్నికల్లో 46 శాతం ఓట్లతో మొదటి స్థానంలో తానే నిలిచానని, (31.6 శాతం) ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచిన ఘనీ కంటే 10 లక్షల ఓట్లు తనకు ఎక్కువ లభించాయని అబ్దుల్లా నేడు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగు, అక్రమాలు జరిగాయంటూ గుండెలు బాదుకుంటున్నారు. అందుకే ఎన్నికల కమిషన్ ఓట్ల లెక్కింపు పూర్తయినా ఘనీ ఎన్నిైకను ప్రాథమిక ఫలితంగానే ప్రకటించింది. అక్రమాల ఆరోపణలపై దర్యాప్తు సాగి స్తోంది. అయితే అబ్దుల్లా తానే గెలిచానని మంగళవారం ప్రకటించారు. తన గెలుపును అంగీకరించకపోతే సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

 దీంతో బరాక్ ఒబామా ఇద్దరు అభ్యర్థులలో ఎవరు రాజ్యాంగేతర పద్ధతులకు, హింసాకాండకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. అలాంటిదేదైనా జరిగితే అఫ్ఘాన్‌కు అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తామని బెదిరింపును జోడించారు. అధ్యక్షులవారి ఆందోళన సంగతి ఎలా ఉన్నా... అమెరికా సేనల ఉపసంహరణ తదుపరి అఫ్ఘాన్‌లోని యుద్ధ ప్రభువులంతా, తెగలన్నీ ఎవరికి వారే అధికారంలో వాటాల కోసం, స్వంత జాగీర్ల ప్రకటన కోసం సిద్ధమవుతున్నారు. అబ్దుల్లా ‘తిరుగుబాటు’ జాతుల, తెగల సంఘర్షణలకు నాంది మాత్రమే. రాజకీయ జూదంలో చేయితిరిగిన కిలాడి కర్జాయ్ ఇప్పటికే ఘనీతో పొత్తు కలుపుకున్నారు. రెండో రౌండు ఎన్నికల్లో తన నమ్మకమైన మిత్రుడు గుల్బుదిన్ హెక్మత్యార్ మద్దతును కూడా సమకూర్చి పెట్టారు. అన్నిటికీ మించి ఘనీ ఇటు పాకిస్థాన్‌తో చేయి కలుపుతూనే అటు తాలిబన్లతో అధికారాన్ని పంచుకోడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. అందుకే 2009 ఎన్నికల్లో ఎలాగైనా కర్జాయ్‌కి ప్రధానిగా నియమించాలని యత్నించిన ఘనీపైన అమెరికా అనుమానాలు పెంచుకుంది. అందుకే అబ్దుల్లాపై ఆశలు పెట్టుకుంది. ఒబామా హూంకరింపులు చూడ్డానికి అబ్దుల్లాకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టినవిగా కనబడుతున్నాయి. ఎన్నికల కమిషన్ తేల్చిన ఫలితం ఉండగా... ఇద్దరు అభ్యర్థులు కలిసి ఒక ఒప్పందానికి రావాలని సెలవిస్తున్నారు. ఎప్పటిలాగే ఓడినా గెలిచానని అనిపించుకోవడం కోసం అమెరికా ప్రయత్నాలు విఫలం కాక మానవు. కాకపోతే నిరంతర యుద్ధ బీభత్సం చవి చూస్తున్న దేశాన్ని జాతి పరమైన అంతర్గత యుద్ధంలోకి ఈడ్చే దుస్సాహసం అది చేస్తోంది. ఇదంతా తాలిబన్లకు వినోదంగా ఉంది.

 పి. గౌతమ్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement