
శ్రీనగర్: నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి నివసిస్తున్న ప్రజల రక్షణ కోసం భారత ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది. దాయాది దేశం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించి దాడులు జరిపినప్పుడల్లా సైన్యంతో పాటు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటువంటి పరిస్థితి తల్తెతకుండా ఉండేందుకు సరిహద్దుల్లో నివసిస్తున్న కుటుంబాల కోసం దాదాపు 14వేలకు పైగా బంకర్లను భారత ప్రభుత్వం నిర్మిస్తుంది. తద్వారా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు, కాల్పులు జరిగినప్పుడు అక్కడి ప్రజలు బంకర్లలో రక్షణ పొందవచ్చు.
కశ్మీర్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో వీటి నిర్మాణం జరుగుతుందని భారత రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. సరిహద్దుల్లో కాల్పులు జరిగిన ప్రతిసారి అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారని పూంచ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ రాహుల్ యాదవ్ తెలిపారు. బంకర్ల నిర్మాణం ద్వారా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించవచ్చని ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నప్పుడు అక్కడి ప్రజలను బంకర్లకు తరలించనున్నారు.
కాగా, 60 మిలియన్ డాలర్లతో నిర్మిస్తున్న ఈ బంకర్ల నిర్మాణం గతేడాది జూన్‌లో ప్రారంభించినట్టు ప్రభుత్వ ఇంజనీర్‌లు తెలిపారు. వీటిని చాలా దృఢంగా నిర్మిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు పేర్నొన్నారు. సాధారణంగా చేపట్టే ఇళ్ల నిర్మాణం కన్నా ఇవి పది రెట్లు మందంగా ఉంటాయని అన్నారు. వాటితో పోల్చితే 10 రెట్లు ఎక్కువ స్టీలు వీటి నిర్మాణంలో ఉపయోగిస్తున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment