కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్థాన్కు అలవాటుగా మారిపోయింది
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాకిస్థాన్కు అలవాటుగా మారిపోయింది. సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం ఆగడాలు రోజు రోజుకు శ్రుతిమించుతున్నాయి. తాజాగా మరోసారి పాక్ దళాలు సరిహద్దు వద్ద కాల్పులకు తెగబడ్డాయి. జమ్మూకాశ్మీర్లోని ఫూంచ్ జిల్లా మెన్ధార్ సెక్టార్ వద్ద కాల్పులు జరిపాయి. ఈ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో డారి డాబ్సి ప్రాంతంలోని పిలి, నోయల్ పోస్ట్లపై ఎలాంటి కవ్వింపు లేకుండానే పాకిస్థాన్ దళాలు కాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు.
ఆటోమాటిక్, తేలికపాటి ఆయుధాలతో ఈ దురాగతానికి తెగబడ్డాయని వెల్లడించారు. పాక్ కాల్పులకు ఎదుర్కొనేందుకు భారత సైన్యం కూడా కాల్పులు జరిపింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గౌరవిస్తామని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహాదారు సత్రాజ్ ఆజీజ్ ప్రకటించి రెండు రోజులు గడవక ముందే పాక్ దళాలు కాల్పులకు దిగడం గమనార్హం.