
న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి స్థాపన కోసం సరిహద్దుల నిర్వహణలో పరస్పరం అంగీకరించిన ప్రొటోకాల్స్ అన్నీ పాటించి తీరాలని చైనాకి భారత్ మిలటరీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎక్కువ బాధ్యత తీసుకోవాలని గట్టిగా చెప్పింది. వాస్తవాధీన రేఖ వెంబడి వివాదాస్పద ప్రాంతాల్లో చైనా తమ సైన్యాన్ని ఉపసంహరిస్తున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనిక చర్చలు 15 గంటల సేపు సుదీర్ఘంగా సాగాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా చెబుతున్న కొత్త సరిహద్దులపై ఆందోళన వ్యక్తం చేసిన భారత సైనిక బృందం, మే 5కి ముందు నాటి పరిస్థితుల్నే కొనసాగించాలని, ఆ నిబంధనలకు అనుగుణంగా పెట్రోలింగ్ నిర్వహించాలని గట్టిగా చెప్పింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు నాలుగో దఫా కమాండర్ స్థాయి చర్చల్లో పురోగతి సాధించినట్టుగా చైనా వెల్లడించింది.
రేపు లద్దాఖ్‌కు రాజ్‌నాథ్
వివాదాస్పద ప్రాంతాల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేలా భారత్, చైనా పరస్పరం అంగీకారానికి వచ్చిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం లద్దాఖ్‌కు వెళ్లనున్నారు. సరిహద్దుల్లో పరిస్థితుల్ని పర్యవేక్షించనున్నారు.
భారత సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలు
తూర్పు లద్దాఖ్‌లో చైనా సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో త్రివిధ దళాలకు రక్షణ శాఖ బుధవారం ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. రూ.300 కోట్లతో అత్యవసరమైన కార్యకలాపాలకు అవసరమైన ఆయుధాలు కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. ఎన్ని ఆయుధాలు కొనాలన్న దానిపై ఎలాంటి పరిమితి లేదు. అయితే, మొత్తం ఖర్చు మాత్రం రూ.300 కోట్లు దాటకూడదు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment