
పాక్ ఆర్మీ దుందుడుకు చర్య
శ్రీనగర్: నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్ముకశ్మీర్‌లోని రజౌరి జిల్లా నౌషేరా సెక్టార్‌లో పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి.
సోమవారం ఉదయం నుంచి పాక్ సైన్యం కాల్పులు జరపుతుండటంతో.. అప్రమత్తమైన భారత భద్రతా సిబ్బంది వారికి ధీటుగా బదులిస్తోంది అని రక్షణశాఖ అధికారి మనీష్‌మెహతా తెలిపారు. భారత ఆర్మీ పోస్ట్‌లను లక్ష్యంగా చేసుకొని పాక్ కాల్పులకు పాల్పడుతోందని ఆయన వెల్లడించారు. పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఈ నెలలో ఇది ఆరోసారి కావడం గమనార‍్హం.