భారత్ ప్రతీకార దాడి, పాక్ జవాన్లు హతం
భారత్ ప్రతీకార దాడి, పాక్ జవాన్లు హతం
Published Thu, Nov 24 2016 9:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
న్యూఢిల్లీ: ఓ భారత జవాను తల నరికి, మరో ఇద్దరు జవాన్లను కాల్చి చంపడంతో భారత భద్రతా దళాలు నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాక్ పోస్టులపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో దాదాపు 12మంది పాకిస్తాన్ జవాన్లు మరణించినట్లు తెలుస్తోంది. భారత్ దాడులతో ఒక్కసారిగా షాక్ కు గురైన పాకిస్తాన్ మిలటరి ఇరు దేశాల కమాండర్లు సంప్రదింపులు జరపాలని కోరింది. బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర మధ్య ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ మిలటరీ పోస్టులపై దాడులు చేశాయి. మెషీన్ గన్స్, 120ఎంఎం హెవీ మోటార్లతో పాక్ పోస్టులను తునాతునకలు చేశాయి.
దీంతో కంగుతిన్న పాక్ ఆర్మీ సంప్రదింపులు జరపాలని కోరింది. అయితే ఈ సంప్రదింపులు ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. లెఫ్టినెంట్ జనరల్ రణ్ బీర్ సింగ్ తో మాజ్ జనరల్ సహీర్ షంషాద్ మీర్జా మాట్లాడినట్లు భారత్ ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. భారత దళాలు జరిపిన కాల్పుల్లో పాకిస్తాన్ పౌరులు ప్రయాణిస్తున్న ఓ బస్సుకు మంటలు అంటుకున్నట్లు మీర్జా పేర్కొన్నారని తెలిపింది. మీర్జా వ్యాఖ్యలకు స్పందించిన సింగ్.. భారత్ పై తరచూ కాల్పులకు పాల్పడుతున్న పాకిస్తాన్ పోస్టులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నట్లు సమాధానం ఇచ్చారని చెప్పింది. పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ భారత్ లో చొరబాటుకు సాయం చేస్తున్నారని ఆరోపించినట్లు పేర్కొంది.
ప్రతి మంగళవారం భారత్-పాకిస్తాన్ ఆర్మీ అధికారుల మధ్య సంభాషణలు జరుగుతున్నాయి. పెద్ద స్ధాయిలో కాకపోయినా అప్పటి పరిస్ధితిని బట్టి చర్చలు జరిపే అధికారులు స్ధాయి మారుతోంది. బుధవారం కాల్పులపై స్పందించిన పాకిస్తాన్ హై కమిషన్ భారతీయ డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ వరుసగా మూడో రోజు సమన్లు జారీ చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఎలాంటి ఉద్రిక్తలు లేకపోయినా భారతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సర్తాజ్ అజీజ్ అమృత్ సర్ జరగబోయే హార్ట్ ఆఫ్ ఏసియా సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిసింది.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగించనున్నారు. ఆప్ఘనిస్తాన్ లో శాంతి, భద్రతల స్ధాపనపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో 40 దేశాల పత్రినిధులు పాల్గొంటారు.
Advertisement
Advertisement