పాక్‌కు దీటైన జవాబు
భారత్ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పాక్ సైనికుల మృతి
► ఎల్వోసీ వెంట పాక్ ఆర్మీ పోస్టు ధ్వంసం
► పుల్వామాలో ఆర్మీ శిబిరంపై గ్రనేడ్ దాడి.. జవానుకు గాయాలు
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లోని నియం త్రణ రేఖ వెంట కాల్పుల మోత కొన సాగుతోంది. ఎలాంటి కవ్వింపు లేకుండా శని వారం ఉదయం నుంచి పాకిస్తాన్ బలగాలు కొనసాగిస్తున్న కాల్పుల్ని భారత భద్రతా దళాలు దీటుగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్ పోస్టులే లక్ష్యంగా శనివారం రాత్రి, ఆదివారం భారత్ జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు పాకిస్తాన్ సైనికులు మరణించగా, మరో ఐదు గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 16 మంది గాయపడ్డారు.
పాకి స్తాన్‌లోని పూంచ్ జిల్లా హజీరా సెక్టార్‌లోని సరిహద్దు గ్రామాల్లో ఈ మరణాలు సంభవిం చాయి. టెట్రినోట్ సెక్టార్‌లోని బహైరా, అబ్బాస్‌పూర్‌లోని సత్వాల్, దక్కీ చాఫర్, చత్రీలోని పొలాస్ ప్రాంతాల్లో పాకిస్తాన్‌కు నష్టం వాటిల్లినట్లు భారత ఆర్మీ వర్గాలు అనధికారికంగా పేర్కొన్నాయి. కాల్పుల్లో ఏడుగురు పాకిస్తానీ సైనికులు గాయపడ్డారని, వారిలో ముగ్గురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం. భారత్‌లోని చక్కా ద బాగ్, ఖారీ కమారా సెక్టార్లకు ఆవలివైపున పాకిస్తాన్ ‘24 ఫ్రాంటియన్ ఫోర్స్’ యూనిట్‌కు చెందిన సైనికులుగా వీరిని గుర్తించారు.
భారత దళాల ఎదురుదాడిలో పాకిస్తాన్ ఆర్మీ పోస్టు పూర్తిగా ధ్వంసమైంది. అంతకుముందు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘించడంతో భారత్‌కు చెందిన ఆర్మీ జవాన్ మహమ్మద్ షౌకత్, అతని భార్య సఫియా బీ మరణించారు. పూంచ్ జిల్లా కర్మారా గ్రామంలోని వారి ఇంటిపై శనివారం 120 ఎంఎం మోర్టార్ షెల్ పడడంతో ప్రాణాలు కోల్పోయారు. వారి ఇద్దరు కుమార్తెలతో పాటు, మరొకరు గాయపడ్డారు. శనివారం ఉదయం నుంచి పాక్ బలగాలు ఎల్వోసీ వెంట కవ్వింపుకు పాల్పడుతూనే ఉన్నాయి.
వరుసగా రెండో రోజూ భారత్‌కు పాక్ నిరసన
నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజూ భారత డిప్యూటీ హై కమిషనర్‌కు పాకిస్తాన్ నిరసన తెలిపింది. ఎలాంటి కవ్వింపు లేకుండా భారత్ జరిపిన కాల్పుల్లో పౌరులు మరణించడంపై భారత డిప్యూటీ హైకమిషనర్ జేపీ సింగ్‌కు నిరసన తెలిపామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. భారత దళాల కాల్పుల్లో శనివారం ముగ్గురు పౌరులు మరణించారని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఆరోపించారు. దీంతో మృతిచెందిన పౌరుల సంఖ్య ఐదుకు చేరిందని, వారిలో నలుగురు మహిళలున్నారని ఆయన చెప్పారు. పూంచ్, క్రిష్ణఘట్టి సెక్టార్లలో మొదటగా పాకిస్తాన్ దళాలే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని, వాటిని భారత దళాలు ప్రతిఘటించాయని నిన్నటి సమావేశంలో పాక్‌కు జేపీ సింగ్ స్పష్టం చేశారు.
వనీని పాక్ పొగడటంపై భారత్ నిరసన
ఉగ్రవాది బుర్హాన్ వనీని పాకిస్తాన్ పొగడటాన్ని భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఇస్తున్న మద్దతును, ప్రోత్సాహాన్ని అందరూ ఖండించాలని విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ట్వీట్ చేశారు. వనీని పొగుడుతూ శనివారం పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ ట్వీట్ చేశారు. కాగా జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా త్రాల్ ప్రాంతంలో భద్రతాదళాల శిబిరంపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడిలో ఒక సీఆర్‌పీఎఫ్ జవాను గాయపడ్డాడు. త్రాల్ పట్టణంలోని అరిబల్ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని పోలీసు అధికారులు తెలిపారు. గాయపడ్డ సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వారు వెల్లడించారు. ఈ దాడికి బాధ్యులమని పేర్కొంటూ ఇంతవరకూ ఏ ప్రకటనా వెలువడలేదని చెప్పారు.