
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్ర శిబిరాల్లో 250 ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు నక్కి ఉన్నారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. చొరబాట్లు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి రవాణాతోపాటు సరిహద్దుల ఆవలి నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ ఆందోళన కలిగిస్తోందని డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. చలికాలం రానున్నందున 12 వేల అడుగుల ఎత్తులో గస్తీ విధుల నిర్వహణ మరింత కఠిన తరం కానుందన్నారు. నిఘా వ్యవస్థలను బలోపేతం చేశామన్నారు.
ఇద్దరు ఉగ్రవాదులు హతం
అనంత్‌నాగ్ జిల్లా పొష్‌క్రీరి ప్రాంతంలో భద్రతా బలగాలతో ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిని డనిష్ భట్, బషరత్ నబీగా గుర్తించారు.