శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపిన ఉగ్రవాది స్కెచ్(ఫొటో)ను పోలీసులు విడుదల చేశారు. స్కెచ్ ఆధారంగా ఉగ్రవాది సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డు సైతం ప్రకటించారు. రియాసి ఎస్పీ- 9205571332, రియాసి ఏఎస్పీ- 9419113159, ఎస్‌హెచ్‌ఓ పౌని- 7051003214 ఫోన్ నంబర్ల ద్వారా సమాచారం అందించాలని పోలీసులు కోరారు.
రాస్నో-పౌని-త్రెయాత్ ప్రాంతాల్లో 11 భద్రతా బలగాల బృందాలతో ఉగ్రవాదులు వేట కొనసాగుతోంది. ఈ ఉగ్రదాడి వెనకాల లష్కరే తోయిబా ఉగ్రసంస్థ ఉన్నట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నుంచి ఎన్‌ఐఏ ఫొరెన్సిక్ టీం ఆధారాలు సేకరిస్తోంది.
ఆదివారం 53 మంది యాత్రికులతో ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు మృతి చెందగా.. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. యాత్రికుల బస్సు .. శివ్ కోరి నుంచి కాత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయానికి తిరిగి వస్తున్న సమయంలో ఉగ్రవాదులు దాడులతో విరుచుకుపడ్డారు. బస్సులో ఉత్తరపదేశ్, రాజస్తాన్, ఢిల్లీకి చెందిన యాత్రికులు ఉన్నారు. కాల్పులు జరగటంతో యాత్రికుల బస్సు లోయలోకి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment