పొరుగుదేశం పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్లోని మెందర్ సెక్టర్ నియంత్రణ రేఖ వద్ద ఈ రోజు ఉదయం భారత దళాలపై పాక్ దళాలు కాల్పులు జరిపాయని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ ఆర్.కే.కలియా మంగళవారం ఇక్కడ వెల్లడించారు. భారత దళాలు వెంటనే అప్రమత్తమై ప్రతిగా కాల్పులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఇరువైపుల కాల్పులు కొనసాగుతున్నాయన్నారు.
2003లో భారత్, పాక్ దేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పొరుగుదేశం అతిక్రమించిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఈ ఆదివారం నుంచి పూంచ్ జిల్లా సరిహద్దు సమీపంలోని నియంత్రణ రేఖ వద్ద పాక్ దళాలు జరుపున్న తీరును ఆయన విశదీకరించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పాక్ దళాలు భారత దళాలపై కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని కలియా వివరించారు.