మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అఖ్నూర్ సెక్టార్ లోని బతాల్ సమీపంలో ఉన్న జనరల్ రిజర్వ్ ఇంజినీరింగ్ ఫోర్స్(జీఆర్‌ఈఎఫ్) ఆర్మీక్యాంపుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో క్యాంపులో పనిచేసే ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆర్మీ ఎదురుకాల్పులు ప్రారంభించింది. ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఉగ్రదాడుల నేపథ్యంలో అఖ్నూర్ సెక్టార్‌లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.
బతాల్ గ్రామంలో తలదాచుకున్న ఉగ్రవాదులు సోమవారం వేకువజామున ఒక్కసారిగా ఆర్మీ క్యాంపుపై కాల్పులకు తెగబడ్డారు. కాగా, ఉగ్రవాదులును ఏరిపారేసేందుకు ఆర్మీ పటిష్ట చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే ముష్కరులు ఈ దాడికి తెగబడ్డారని అధికారులు భావిస్తున్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్‌వోసీ)కి సరిహద్దుల్లో కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆర్మీ క్యాంపు ఉన్న విషయం తెలిసిందే. ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.