సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్‌లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అఫ్గానిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో జమ్మూలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా సంస్థలు హెచ్చరికలతో హైఅలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్, కాందహార్‌లో తాలిబన్ల పొలిటికల్ కమిషన్ హెడ్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్, ఇతర నాయకులతతోనూ భేటీ అయిన నేపథ్యంలో ఈ అలర్ట్ జారీ అయింది. అంతేకాదు అన్ని రాష్ట్రాలు భద్రతా చర‍్యలు చేపట్టాలని తీవ్రవాద వ్యతిరేక విభాగాలను కూడా అప్రమత్తం చేయాలని నిఘా అధికారులు హెచ్చరించారు.
జమ్మూ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలపై లభించిన సమాచారం ఆధారంగా నిఘా సంస్థలు అధికారులను అప్రమత్తం చేశాయి. ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే, సమర్ధవంతంగా తిప్పికొట్టేలా ఈ సమాచారాన్ని రాష్ట్ర నిఘా, భద్రతా సంస్థలతో పంచుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. సోషల్ మీడియాలో నిఘా ఉంచాలని కూడా ఆదేశించినట్టు ప్రకటించారు. ఆగస్టు మూడో వారంలో కందహార్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహ్మద్ (జేఈఎం) నాయకులు, తాలిబాన్ నాయకుల సమావేశ మైనట్టు తమ దృష్టికి వచ్చిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సందర‍్భంగా ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలకు జేఈఎం తాలిబన్ మద్దతుకోరిందనీ, పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించాయి.
కాగా అఫ్గానిస్తాన్‌ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాతనుంచీ వేలాది మంది వేలాదిమంది దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో అనేక హృదయవిదాకరదృశ్యాలు ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టాయి. ఈ క్రమంలో గురువారం కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి సంచలనం రేపింది. మరోవైపు ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్‌కేపీ) ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment