
పాక్ కాల్పుల్లో జవాన్ మృతి
శ్రీనగర్ : సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. జమ్ము కశ్మీర్‌లోని పూంచ్ జిల్లా కృష్ణ గటి సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ మంగళవారం కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిన ఘటనలో ఓ సైనిక జవాన్ మరణించారు. భారత సైన్యం దీటుగా ప్రతిస్పందించడంతో పాక్ సైనిక శిబిరాలకు భారీ నష్టం వాటిల్లిందని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరు పక్షాల మధ్య జరిగిన కాల్పుల్లో 36 ఏళ్ల భారత జవాన్ నాయక్ రవి రంజన్ కుమార్ సింగ్ మరణించారు.బిహార్‌లోని రోహ్తాస్‌కు చెందిన సింగ్‌కు భార్య రీతా దేవి ఉన్నారు. సింగ్ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించే నిబద్ధతతో కూడిన సైనికుడని, ఆయన సమున్నత త్యాగాన్ని దేశం సదా స్మరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా ఇండో-పాక్ సరిహద్దుల్లో పాకిస్తాన్ ఇటీవల తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఘటనలు పెచ్చుమీరాయి.