జమ్మూ కాశ్మీర్లో అక్రమంగా ప్రవేశిస్తున్న చోరబాటుదారులు సంఖ్య ఈ ఏడాది గణనీయంగా పెరగడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది చోరబాట్ల సంఖ్య అంత లేవు, కానీ ఈ ఏడాది ఆ సంఖ్య అధికం కావడం పట్ల కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తీవ్ర కలత చెందుతున్నట్లు వెల్లడించారు. భారత్, పాక్ దేశాల సరిహద్దు ప్రాంతమైన నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)లో షిండే మంగళవారం పర్యటించారు.
ఈ సందర్బంగా సాంబ సెక్టర్లోని భద్రత దళాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... చోరబాట్ల సంఖ్య అధికమవడానికి గల కారణాలపై తమ శాఖ ఉన్నతాధికారులతో చర్చిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. 2003లో భారత్ - పాక్ దేశాల మధ్య చేసుకున్న కాల్పుల ఉల్లంఘన ఒప్పందాన్ని పాక్ తరుచుగా ఉల్లంఘిస్తుంది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 136 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించింది. దాంతో ఆ అంశంలో జోక్యం చేసుకోవాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
దీంతో షిండే మంగళవారం భారత్, పాక్ సరిహద్దుల్లో పర్యటిస్తున్నారు. అలాగే సరిహద్దుల్లోని పహారా కాస్తున్న సెంట్రల్ ఆర్మడ్ పోలీసు ఫోర్స్ (సీఏపీఎఫ్) సిబ్బందికి మాజీ సైనికుల హోదా కల్పించేందుకు కృషి చేస్తానని షిండే ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రధానితో సమావేశమై ఈ అంశంపై చర్చిస్తానని సీఏపీఎఫ్ సిబ్బందికి భరోసా ఇచ్చారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల నాటికి ఆ విషయం బిల్లుగా రూపాంతరం చెందుతుందని షిండే ఆశాభావం వ్యక్తం చేశారు.