సోలాపూర్: పట్టణంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అనే ఉత్కంఠ నెలకొంది. ఇంతలో గణేశ్ ఉత్సవాల కోలాహలం వచ్చింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయదలచుకున్న అనేకమంది ఆశావాహులు భవిష్యత్‌లో తమకు అందరూ అండగా ఉండాలనే అభిలాషతో పలు మండపాలలో పూజలు, దర్శనాలు చేసుకుంటూ కానుకలు విరాళాలు అందజేయడంలో మొగ్గు చూపారు. అయితే సోలాపూర్ సిటీ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గానికి గత మూడు పర్యాయాలు వరుసగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన ప్రస్తుత పార్లమెంటు సభ్యురాలు ప్రణతీ శిందే ఎంపీగా గెలుపొందడంతో ఆ స్థానం ద్వారా శాసనసభ్యుడిగా ఎన్నిక కావాలనే తపనతో దాదాపు 19 మంది ఆశావాహులు అభ్యర్థిత్వం కోసం ఆసక్తిగా కలలు కంటున్నారు.
గత కొన్ని రోజులుగా సుశీల్ కుమార్ శిందే మనవడు శిఖర్ పహారియా వార్తల్లో నిలుస్తున్నాడు. ఎందుకంటే తన పిన్ని ఎంపీ ప్రణతీ ప్రాతినిధ్యం వహిస్తున్న సోలాపూర్ సిటీ సెంట్రల్ స్థానానికి లేక పక్కనే గల సోలాపూర్ సౌత్ రూరల్ స్థానం ద్వారా రాజకీయ వారసుడిగా ముందుకు వస్తారనే వార్తలు గుప్పు మంటూ తెర మీదికి వస్తున్నాయి.
ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని గణేశ్ ఉత్సవ మండలాలను సందర్శించడం అందరితో చనువుగా మెలగడం, తన తాత ఫామ్‌హౌస్‌లో ఏర్పాటుచేసిన గణేశ్ ఉత్సవాన్ని సందర్శించడానికి వచ్చిన వారితో ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించడం మొదలైన ప్రక్రియ ఆయన్ను సుశీల్ కుమార్ శిందే కుటుంబం రాజకీయ వారసుడిగా ముందుకు తీసుకురాగలరనే భావనను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మూడు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా ఆశీర్వదించిన పట్టణ ప్రజలకు రాజకీయ వారసుడిని అందించాలని సుశీల్ కుమార్ శిందే కుటుంబంతో పాటు ఆయన్ను అభిమానించే వారు కోరుకుంటున్నట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment