షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు.
షోలాపూర్, న్యూస్‌లైన్: షోలాపూర్ లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈయనతో పాటుగా మాడా స్థానం నుంచి ఎన్సీపీ అభ్యర్థి విజయసింహ మోహితే పాటిల్ భారీ ఊరేగింపుగా వచ్చి నామినేషన్ పత్రాలను ఈసీ రిటర్నింగ్ అధికారులకి సమర్పించారు. వీరి వెంట ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఇతర రాష్ట్ర మంత్రులు ఉన్నారు.
అనంతరం నగరంలోని హోం మైదానంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య కూటమి అభ్యర్థులు షిండే, విజయసింహ మోహితే పాటిల్‌లను ఈసారి కూడా గెలిపించాలని సీఎం చవాన్, కేంద్ర మంత్రి పవార్ పిలుపునిచ్చారు. కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలను నరేంద్ర మెడీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎల్లప్పుడు ఇరు కాంగ్రెస్ పార్టీల వైపే మొగ్గు చూపుతూ వచ్చిన స్థానికులు ఈసారి కూడా ఆదరించాలని అభ్యర్థించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడి నుంచే ప్రారంభమైందో తెలియని మోడీ ఇక దేశాన్ని ఎలా పాలించగలరని ప్రశ్నించారు. మత కలహాలు జరగకుండా ఉండాలంటే లౌకిక పార్టీలను ప్రజలు ఎన్నుకోవాలని కోరారు.
ఊరేగింపు సాగిందిలా...
నామినేషన్ దాఖలు కంటే ముందు నాయకులు ఊరేగింపుగా వెళ్లారు. ఉదయం 10 గంటల నుంచి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా వాహనాల ద్వారా జనం బస్టాండ్ సమీపంలోని శివాజీ విగ్రహం వరకు చేరుకున్నారు. అక్కడ నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. తర్వాత ఊరేగింపును ప్రారంభించారు. పలు మార్గాల మీదుగా కొనసాగిన ఊరేగింపు రంగ్‌భవన్ చౌక్ వరకు చేరుకుంది. ఆ తర్వాత కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని నామినేషన్‌లు దాఖలు చేశారు.