నేతాజీ జయంతి సందర్భంగా పుస్తకం విడుదల చేస్తున్న ప్రధాని మోదీ, సీఎం మమత
కోల్‌కతా/సాక్షి, న్యూఢిల్లీ: బలమైన భారతదేశం నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) నుంచి వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వరకూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అడుగు జాడల్లో నడుస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నేతాజీ ఇప్పుడు జీవించి ఉంటే అన్ని విధాలా బలోపేతమైన భారత్‌ను చూసి గర్వపడేవారని అన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటానికి మనమే సొంతంగా టీకాలు అభివృద్ధి చేసుకోవడం, ఇతర దేశాలకు సైతం టీకాలను అందజేయడం, మన దేశ సార్వభౌమత్వానికి సవాలు ఎదురైనప్పుడు దీటుగా జవాబు ఇవ్వడం చూసి నేతాజీ ఎంతగానో గర్వపడేవారని పేర్కొన్నారు.
సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ్ దివస్’ వేడుకలను కేంద్ర ప్రభుత్వం శనివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ హాల్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎల్‌ఏసీ నుంచి ఎల్‌ఓసీ వరకు బలమైన భారత్ రూపుదిద్దుకోవాలని నేతాజీ కలలుగన్నారని, ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తున్నామని తెలిపారు. అజేయమైన సైనిక శక్తి మన సొంతమని చెప్పారు. తేజస్, రఫేల్ వంటి అత్యాధునిక ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకున్నామని వివరించారు.
దీవికి బోస్ పేరుపెట్టడం నా అదృష్టం
ఆత్మనిర్భర్ భారత్, సోనార్ బంగ్లాను(బంగారు బెంగాల్) కలగనడానికి నేతాజీ గొప్ప స్ఫూర్తి అని నరేంద్ర మోదీ కొనియాడారు. బోస్ పేరు విన్నప్పుడల్లా తాను ఎంతగానో స్ఫూర్తి పొందుతానని చెప్పారు. ఆయన స్వాతంత్య్రం కోసం అర్థించలేదని, దాని కోసం పోరాటం సాగించారని శ్లాఘించారు. 2018లో అండమాన్‌లోని ఓ దీవికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా నామకరణం చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బోస్‌కు సంబంధించిన ఫైళ్లను ప్రజల ముందుంచామని అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్‌ఏ) సభ్యులు సైతం గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొంటారని తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు బోస్‌కు రుణపడి ఉన్నాడని ఉద్ఘాటించారు. 130 కోట్ల మందిలోని ప్రతి రక్తం చుక్క బోస్‌కు రుణపడి ఉంటుందన్నారు. గృహ నిర్బంధం నుంచి తప్పించుకొనే ముందు సుభాష్ చంద్రబోస్ తన మేనల్లుడు శిశిర్ బోస్‌ను ‘నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా?’ అంటూ ప్రశ్నించారని గుర్తుచేశారు. గుండెపై చెయ్యి వేసుకొని, నేతాజీ సమక్షంలో ఉన్నట్లు ఊహించుకుంటే అదే ప్రశ్న వినిపిస్తుందన్నారు. భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించినట్లుగానే ఆత్మనిర్భర్ భారత్‌లోనూ బెంగాల్ ముఖ్యమైన పాత్ర పోషించాలన్నారు.
జైశ్రీరామ్‌లో తప్పేముంది?: బీజేపీ
మమతా బెనర్జీ తీరు పట్ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఓ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. జైశ్రీరామ్ నినాదంలో తప్పేముందని నిలదీశారు. జైశ్రీరామ్ అనేది రాజకీయ నినాదం కాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ అన్నారు. ఈ నినాదంలో ఎలాంటి తప్పు లేదని, నేతాజీ జయంతిని రాజకీయం చేయొద్దని నేతాజీ బంధువు చంద్రకుమార్ బోస్ సూచించారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రిని అవమానించారని బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్‌రంజన్ చౌదరి ధ్వజమెత్తారు. ఒక మహిళను పది మందిలో అవమానించడం దారుణమన్నారు. ఈ ఘటన తమ రాష్ట్రానికే అవమానమని సీపీఎం సీనియర్ నేత బిమన్ బోస్ పేర్కొన్నారు. సీఎం మాట్లాడుతుండగా నినాదాలు చేయడాన్ని టీఎంసీ ముఖ్య అధికార ప్రతినిధి డెరెక్ ఓ బ్రెయిన్ తప్పుపట్టారు.
బోస్ నివాసంలో మోదీ
కోల్‌కతాలో సుభాష్ చంద్రబోస్ నివాసం ‘నేతాజీ భవన్’ను ప్రధాని మోదీ సందర్శించారు. అనంతరం నేషనల్ లైబ్రరీలో నేతాజీపై నిర్వహించిన అంతర్జాతీయ సెమినార్‌లో పాల్గొన్నారు. అక్కడ కళాకారులు, ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు.
నన్ను పిలిచి అవమానిస్తారా?
బెంగాల్ సీఎం మమత
విక్టోరియా మెమోరియల్ హాల్‌లో జరిగిన నేతాజీ జయంతి కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురయ్యింది. ప్రసంగించేందుకు ఆమె ఉద్యుక్తురాలు కాగానే కొందరు ప్రధాని సమక్షంలో జైశ్రీరామ్ అంటూ బిగ్గరగా నినదించారు. దీంతో అసహనానికి గురైన మమత ప్రసంగించేందుకు నిరాకరించారు. తనను ఈ వేడుకకు పిలిచి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమే తప్ప రాజకీయ కార్యక్రమం కాదన్నారు. ఇలాంటి చోట మర్యాద పాటించాలన్నారు. పిలిచి అవమానించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. తాను ఇక మాట్లాడబోనని, జై బంగ్లా, జైహింద్ అంటూ ముగించారు.
Comments
Please login to add a commentAdd a comment