ట్రంప్‌ కళ్లెదుటే ప్రయోగం.. పేలిపోయిన సూపర్‌ హెవీ రాకెట్‌! | Trump On Live SpaceX Super Heavy rocket soft lands in ocean Then explodes | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ కళ్లెదుటే ప్రయోగం.. పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ సూపర్‌ హెవీ రాకెట్‌!

Published Wed, Nov 20 2024 9:03 AM | Last Updated on Wed, Nov 20 2024 9:03 AM

Trump On Live SpaceX Super Heavy rocket soft lands in ocean Then explodes

స్పేస్‌ఎక్స్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రయోగంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సూపర్‌ హెవీ బూస్టర్‌ రాకెట్‌ ఒక్కసారిగా పేలిపోయింది. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ప్రయోగాన్ని వీక్షించగా..  సాఫ్ట్‌ ల్యాండ్‌ అయిన క్షణాల్లోనే ఈ పరిణామం  చేసుకోవడం గమనార్హం!.

బుధవారం ఉదయం సౌత్‌ టెక్సాస్‌ ‘స్టార్‌బేస్‌’ సెంటర్‌ నుంచి స్పేస్‌ ఎక్స్‌ ఈ ప్రయోగం నిర్వహించింది. అయితే రాకెట్‌ గాల్లోకి దూసుకెళ్లడం, అప్పర్‌ స్టేజ్‌ నుంచి స్టార్‌షిప్‌ సెపరేషన్‌ లాంటి ప్రక్రియలు విజయవంతంగానే జరిగాయి. కానీ, స్టేజ్‌లో లోపం కారణంగా లాంచ్‌ప్యాడ్‌కు తిరిగి రావడానికి బదులుగా ఆ భారీ రాకెట్‌ పేలిపోయింది. తిరిగి ల్యాండ్‌ అయ్యే టైంలో గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో తీరంలో ఒక్కసారిగా పేలిపోయి సముద్రంలో శకలాలు పడ్డాయి. అయినప్పటికీ..

ఈ భారీ రాకెట్‌ మాత్రం కీలక మైలురాయిని అధిగమించిందని స్పేస్‌ఎక్స్‌ ప్రకటించుకుంది. తాము అనుకున్నట్లే స్టార్‌షిప్‌ అప్పర్‌ స్టేజ్‌ నుంచి విడిపోయిందని, 65 నిమిషాల తర్వాత ఫసిఫిక్‌ మహాసముద్రంలో దిగిందని తెలిపింది. కాగా, ఈ జెయింట్‌ రాకెట్‌తో ఆరుసార్లు ప్రయోగం నిర్వహించగా..  స్టార్‌షిప్‌ వెహికిల్‌ సురక్షితంగా ల్యాండ్‌ కావడం ఇది రెండోసారి.

గత నెలలో స్పేస్‌ఎక్స్‌ సంస్థ భారీ స్టార్‌షిప్‌ రాకెట్‌ బూస్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆ స్టార్‌షిప్‌ నింగిలోకి దూసుకెళ్లడంతో పాటు లాంచ్‌ప్యాడ్‌ సురక్షితంగా చేరుకుంది. దీంతో ఇది ఓ ఇంజినీరింగ్‌ అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందాయి.

స్వయంగా వీక్షించిన ట్రంప్‌
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయంలో మస్క్‌ కీలకపాత్ర పోషించింది తెలిసిందే. ఈ దోస్తీ కారణంగా మస్క్‌కు తన ప్రభుత్వంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియెన్సీ(డోజ్‌) శాఖ బాధ్యతలు అప్పగించారు ట్రంప్‌. అందుకే ఇవాళ స్వయంగా.. దాదాపు 400 అడుగుల ఎత్తైన రాకెట్ ప్రయోగాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ వీక్షించారు. ఈ ప్రయోగానికి ముందు తాను స్పేస్‌ఎక్స్‌ రాకెట్‌ ప్రయోగం వీక్షించేందుకు వెళ్తున్నట్లు ట్రంప్‌ సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. ‘నేను గ్రేట్‌ స్టేట్‌ ఆఫ్‌ టెక్సాస్‌లో స్పేస్‌ఎక్స్‌ సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్‌ ప్రయోగాన్ని చూడటానికి వెళుతున్నాను. మస్క్‌కు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’ అని రాసుకొచ్చారు. ఈ ప్రయోగాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌తో సహా పలువురు రిపబ్లికన్‌ నాయకులు ప్రత్యక్షంగా వీక్షించారు.

చంద్రుడిపైకి వ్యోమగాములను, అంగారక గ్రహంపైకి ఫెర్రీ క్రూను చేర్చే లక్ష్యంతో స్పేస్‌ఎక్స్‌ ఈ రాకెట్‌ను డిజైన్‌ చేసింది. నాసా సైతం తమ రాకెట్‌ను ఉపయోగించుకోవాలన్నదే స్పేస్‌ఎక్స్‌ అభిమతం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement